తొలి ఏడాదిలోనే 2 లక్షల జాబ్​లు..

 తొలి ఏడాదిలోనే  2 లక్షల జాబ్​లు..
  • ఫస్ట్​ కేబినెట్​ భేటీలోనే మెగా డీఎస్సీ..ఏటా జాబ్​ క్యాలెండర్​
  • రైతులకు 2 లక్షల రుణమాఫీ, 24 గంటలు ఉచిత కరెంట్​
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్.. సీఎం క్యాంపు ఆఫీసులో ‘ప్రజాదర్బార్​’​
  • బెల్టు షాపులు పూర్తిగా రద్దు..మేనిఫెస్టోలో కాంగ్రెస్​ హామీలు
  • ఇప్పటికే ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్ల ప్రకటన
  • కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే  మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, తొలి కేబినెట్ భేటీ​లోనే మెగా డీఎస్సీని ప్రకటించి, ఆరు నెలల్లోనే టీచర్​ పోస్టులను నింపుతామని కాంగ్రెస్​ ప్రకటించింది. ఏటా జాబ్​ క్యాలెండర్​ను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వచ్చే ఏడాదికి సంబంధించి డేట్లతో పాటు జాబ్​ క్యాలెండర్​ను కూడా విడుదల చేసింది.

రైతులకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, వ్యవసాయానికి 24 గంటలూ ఫ్రీగా కరెంట్ ఇస్తామని తెలిపింది.  ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్​లో ఏఐసీసీ  చీఫ్​ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్​ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లలోని అంశాలతోపాటు.. మరో 37 అంశాలను కలిపి నాలుగు చాప్టర్లుగా 42 పేజీలతో మేనిఫెస్టోను రూపొందించింది. చాప్టర్​ 1లో సుపరిపాలన, చాప్టర్​ 2లో ఆరు గ్యారెంటీలు, చాప్టర్​ 3లో ఐదు డిక్లరేషన్లను (రైతు, యూత్​, ఎస్సీ –ఎస్టీ, మైనారిటీ, బీసీ) పేర్కొనగా.. చాప్టర్​ 4లో 37 కొత్త అంశాలతో హామీలను కాంగ్రెస్​ ప్రకటించింది.

రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్​తోపాటు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తామని పేర్కొంది. పంటల బీమాను అమలు చేస్తామని హామీనిచ్చింది. కల్యాణమస్తు స్కీం కింద ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. మహాలక్ష్మి స్కీమ్​ కింద ప్రతి మహిళకు  నెలకు రూ.2,500 ఇవ్వడంతో పాటు బస్సుల్లో ఫ్రీ జర్నీని అందిస్తామని, రూ.500కే గ్యాస్​ సిలిండర్​ను సరఫరా చేస్తామని ప్రకటించింది. ధరణిని రద్దు చేసి భూమాత అనే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని తెలిపింది. ఆరు గ్యారంటీలపై తొలి కేబినెట్​లోనే నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని స్పష్టం చేసింది. 

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్​ తెలిపింది. పేదలకు 200 యూనిట్లలోపు ఫ్రీగా కరెంట్​ అందజేస్తామని హామీ ఇచ్చింది. 

ఇదీ కాంగ్రెస్​ మేనిఫెస్టో..

ఇరిగేషన్​:
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో న్యాయ విచారణ. 
కృష్ణా నదీ జలాలలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించడం.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాకు కృషి.

వైద్యరంగం: 

జిల్లా కేంద్రాల్లో సూపర్‌‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, ప్రతి నియోజక వర్గంలో 100 పడకల సూపర్‌‌ స్పెషాలిటీ, ప్రసూతి ఆస్పత్రులు, అన్ని మున్సిపాలిటీలలో 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం .
ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం. 

గృహనిర్మాణం:

ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం.  ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకైతే రూ. 6 లక్షలు. 
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్​ కింద ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం.

పౌరసరఫరాలు / నిత్యావసరాల పంపిణీ: 

రేషన్‌‌ కార్డులపై సన్న బియ్యం సరఫరా
అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌‌ కార్డులు. 
మినీ సూపర్​ మార్కెట్లుగా అన్ని రేషన్​ షాపులు. 
రేషన్‌‌ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్‌‌ పెంపు.  

పంచాయతీరాజ్‌‌ - గ్రామీణాభివృద్ధి:  

ఉపాధిహామీ పని దినాలు 150 రోజులకు పెంపు.. కనీస కూలీ రూ. 350కు పెంపు.
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు రూ. 1,500. మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు, జడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్‌‌.

ప్రభుత్వ/ప్రైవేట్​ ఉద్యోగుల సంక్షేమం 

ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్​లో ఉన్న మూడు డీఏల చెల్లింపు
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫస్టు తారీఖున వేతనాలు. బదిలీలకు క్యాలెండర్​.
సీపీఎస్​ను రద్దు చేసి ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​అమలు.  
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు సిఫార్సుల అమలు.

పారిశ్రామిక రంగం : 

ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడల ఏర్పాటు. ఎంఎస్​ఎంఈలకు ప్రోత్సాహకాలు
2030 నాటికి తెలంగాణను 500 బిలియన్‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు. 

ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం:

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి,  రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించడం. వచ్చే పీఆర్సీ  పరిధిలోకి ఆర్టీసీ కార్మికులు. 
ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణ.

రవాణా– ఆటో డ్రైవర్ల సంక్షేమం:

ప్రతి ఆటో డ్రైవర్​కు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు.
పెండింగ్​లో ట్రాఫిక్​ చలానాలు 50% రాయితీతో వన్​టైం సెటిల్​మెంట్​ ద్వారా పరిష్కారం.

ఎక్సైజ్​ పాలసీ:

ఎక్సైజ్​ పాలసీ పున:పరిశీలన. 
పాలసీలో సవరణలు. 
బెల్టు షాపులు పూర్తిగా రద్దు. 
నీరా ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి, గీత కార్మికుల ఉపాధి పరిరక్షణ.
గుడుంబా, కల్తీ కల్లు , డ్రగ్స్‌‌ సరఫరాపై కఠిన చర్యలు. ప్రతి జిల్లా ఆస్పత్రిలోనూ రిహాబిలిటేషన్​   సెంటర్​. 

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం:

చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ పూర్తిగా అమలు. 
సమ్మక్క సారలమ్మ ఉత్సవాలను జాతీయ పండుగగా గుర్తించడం. 
ఎస్టీల్లోకి వాల్మీకి బోయలు

 బీసీ, ఇతర వర్గాల సంక్షేమం: 

ముదిరాజ్​, యాదవ, కురుమ, మున్నూరుకాపు, పద్మశాలీ, గౌడ, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, రజక, పెరిక, విశ్వకర్మ కులస్తులకు సరిపడా నిధులతో వేర్వేరు కార్పొరేషన్ల​ ఏర్పాటు. 
పద్మశాలీలకు సిరిసిల్లలో నూలు డిపోల ఏర్పాటు . 
ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు.
ఆర్య వైశ్య, రెడ్డి కులస్తులకు సరిపడా నిధులతో కూడిన కార్పొరేషన్ల ఏర్పాటు . 

మైనారిటీ సంక్షేమం: 

సరిపడా నిధులతో మైనారిటీ సబ్‌‌ ప్లాన్‌‌. సచార్​ కమిటీ సిఫార్సుల అమలు.
ఇమాంల గౌరవ వేతనాన్ని పెంచి.. క్రిస్టియన్​ పాస్టర్లు, గురుద్వారాల్లోని గ్రంతిలకు గౌరవ వేతనం ఇవ్వడం. 

 సింగరేణి కార్మికుల సంక్షేమం: 

సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునః పరిశీలించి సరళీకృతం చేయడం. సింగరేణి కాలనీలలో ఆధునిక విద్యాలయాలను ఏర్పాటు.

బీడీ కార్మికులు సహా ఇతరుల సంక్షేమం:

బీడీ కార్మికులకు 2014 పీఎఫ్‌‌ కటాఫ్‌‌ తేదీని తొలగించి ‘చేయూత’ పెన్షన్‌‌ చెల్లించడం. 
బీడీ కార్మికులను జీవిత బీమా ఇచ్చి, ఈఎస్‌‌ఐ పరిధిలోకి తేవడం.  
అసంఘటిత కార్నికుల సంక్షేమ  బోర్డు ఏర్పాటు. 
పట్టణ, మున్సిపాలిటీలలోని చిరు వ్యాపారులకు తైబజార్​ పన్ను రద్దు.
హమాలీలకు సంక్షేమ బోర్డు, హెల్త్‌‌ కార్డులు. ప్రతి మండల కేంద్రంలో హమాలీనగర్​ను ఏర్పాటు చేసి ఇండ్ల కేటాయింపు.

వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం:

57 ఏండ్లు నిండిన వృద్ధులందరికీ (వారి సంతానం ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ) వృద్ధాప్య పెన్షన్లు రూ. 4,000.
దివ్యాంగుల నెలవారీ పెన్షన్‌‌  రూ. 6,000కు పెంపు.  ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

 గల్ఫ్‌‌ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం:

ఎన్నారైల సంక్షేమ బోర్డు, గల్ఫ్‌‌ కార్మికుల  సంక్షేమ బోర్డు ఏర్పాటు. మరణించిన గల్ఫ్‌‌ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌‌ గ్రేషియా.

జర్నలిస్టుల సంక్షేమం:

రూ. 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి. ఎప్పటినుంచో పెండింగ్​లో ఉన్న హైదరాబాద్‌‌  జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యకు పరిష్కారం.
అర్హులైన ప్రింట్‌‌, ఎలక్ట్రానిక్‌‌  మీడియా జర్నలిస్టులకు జిల్లాల వారీగా ఇండ్ల స్థలాలు కేటాయింపు. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం. రిటైర్‌‌ అయిన జర్నలిస్టులకు పెన్షన్‌‌ సదుపాయం.

 మరిన్ని... 

50 ఏండ్లు నిండిన జానపద కళాకారులకు నెలకు రూ.3000 పెన్షన్‌‌.
ఒగ్గు , డప్పు కళాకారులకు నెలవారీ జీవన భృతి కింద రూ.3,000.
ఐదేండ్ల లోపు ప్రాక్టీస్​ అనుభవం ఉన్న జూనియర్‌‌ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల గౌరవ భృతి.   
ట్రాన్స్‌‌  జెండర్స్​కు లింగ మార్పిడి ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డులు జారీ చేస్తూ సామాజిక భద్రత. వృత్తి విద్యా శిక్షణ, ఉద్యోగాల్లో అవకాశాలు.
రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్సిటీ, ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్‌‌ స్పోర్ట్స్‌‌ స్కూళ్ల ఏర్పాటు. 

విద్యా రంగం

ప్రతి స్టూడెంట్​కు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు. ఫ్రీ వైఫై. ఉచిత ట్రాన్స్​పోర్ట్​ సౌకర్యం.
ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్​ స్కూల్​ ఏర్పాటు. 
ఫీజురీయింబర్స్‌‌ మెంట్‌‌ పథకం మరింత మెరుగ్గా అమలు.
మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనం రూ.10,000కు పెంపు.
యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్​టైం లెక్చరర్లకు గౌరవ  వేతనాలు  రూ. 50,000,  అన్ని ప్రభుత్వ జూనియర్‌‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌‌ ఫ్యాకల్టీలకు రూ. 42,000కు పెంపు. 
ఖమ్మం, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో కొత్త యూనివర్సిటీల ఏర్పాటు.
ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ.

రైతు సంక్షేమం

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా వంటి హామీలను అందులో చేర్చింది. 
ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులతోపాటు ప్రతి ఒక్క రైతుకూ ఎకరాకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12 వేల ఆర్థిక సాయం.
మెరుగైన మద్దతు ధరతో పంటల కొనుగోళ్లు. వరికి రూ.500 బోనస్​. 
వడ్ల కొనుగోళ్లలో తేమ శాతం నెపంతో తరుగు తీసే విధానం రద్దు.
ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీల రద్దు.

మహిళా - శిశు సంక్షేమం  

‘కళ్యాణమస్తు’ కింద ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి రూ. 1,00,000 ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం.
మహిళా పోలీసింగ్‌‌ని పటిష్ఠ పరచి గ్రామాలకు, పట్టణాలకు విస్తరణ.
డ్వాక్రా సంఘాలకు పక్కా భవనాలను నిర్మించి వడ్డీ లేని రుణాలు.
పుట్టిన ప్రతి ఆడ శిశువుకు ఆర్థిక సాయంతోకూడిన ‘బంగారు తల్లి’ పథకం పునరుద్ధరణ.
అంగన్​వాడీ టీచర్లకు వేతనం రూ.18,000కు పెంచుతూ ఈపీఎఫ్‌‌ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పించడం. 

ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతం 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తం. తొలి కేబినెట్ సమావేశంలోనే వాటిపై నిర్ణయం ప్రకటిస్తం. మహాలక్ష్మి పథకం ఫస్ట్ ప్లేసులో ఉంటది. ఎప్పుడూ ఫామ్‌‌హౌస్‌‌లోనే ఉండే కేసీఆర్ ఇకపై అక్కడే ఉండిపోతరు. కేసీఆర్‌‌‌‌కు టాటా బైబై చెప్పాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. జనాలు బాగు పడుతారని తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ప్రాజెక్టులు, పథకాలు.. ఇలా ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడ్డరు.  మోదీ, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది కాంగ్రెస్సే. 
- ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

ప్రగతిభవన్‌‌ను ‘ప్రజాపాలన భవన్‌‌’గా మారుస్తం

కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌‌ను ‘ప్రజా పాలన భవన్‌‌’గా పేరు  మారుస్తాం. ప్రజాపాలన భవన్‌‌ తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌‌లు నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్‌‌ విజయం తథ్యం.  కాంగ్రెస్‌‌ విజయం.. ప్రజల తెలంగాణతో స్వర్ణ యుగానికి నాంది పలుకుతుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరిస్తాం.  జవాబుదారీతనం, పారదర్శకత కోసం ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలంతా మాతో కలిసి రావాలి.  

  
- రాహుల్ గాంధీ ట్వీట్​