వానొస్తుందంటే నగర జనానికి ఏదో తెలియని జడుపు!

వానొస్తుందంటే నగర జనానికి ఏదో తెలియని జడుపు!

‘‘వానలు కురవాలి వానదేవుడా,జగమెల్ల మురవాలి వానదేవుడా!’’అని పాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మొగులైందంటే.. వానొస్తుందంటే నగర జనానికి ఏదో తెలియని జడుపు! ‘ఇయ్యాల, రేపు భారీ వర్షాలు’ అని వాతావరణ విభాగం ప్రకటించిందంటే, భయంతో గజగజలాడే కుటుంబాలు నగరంలో వేలు, లక్షలు! చినుకు చినుకుకు లోన పెరిగే వణుకు!!  నగరాల్లో మన వాళ్ల వాననీటి నిర్వహణ, వరద నియంత్రణ ఎంత సక్కదనమో ఈ పరిస్థితే అద్దం.హైదరాబాద్ నగరానికి మినహాయింపేం లేదు! వానొచ్చిందంటే పుట్టుకొచ్చే సమస్యలు ఒక్కతీరు కాదు. నగరంలోని మెజారిటీ చెరువులు ఇప్పటికే ఇండ్ల సముదాయాలు, కాలనీలు అయిపోయాయి. అందుకే ఇప్పుడు రోడ్లన్నీ చెరువులు, కుంటలు అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతి కొన్నిసార్లు ప్రమాదస్థాయిలో పరవళ్లు తొక్కుతున్నది. గంటల తరబడి రోడ్లమీదే ట్రాఫిక్ నిలిచి, అంగుళాల లెక్కన ముందుకు కదిలే మందగమనం, దానికదే ఒక నరకం! భారీ వర్షమొకటి పడితే, ఇళ్లే కాదు, కాలనీలకు కాలనీలే రోజులు, వారాల తరబడి నీట మునిగి ఉండటం మామూలైపోయింది. అలా నీట మునిగే కాలనీవాసుల బతుకు వర్షకాలమంతా దుర్భరం! వెంటనే నీటిని తొలగించే(డీవాటరింగ్) చర్యలు కూడా పాలనా విభాగాల నుంచి ఉండవు. ఇంట్లో పేరుకుపోయిన బురద మట్టిని, పాములు, కప్పలు వంటి జీవుల కళేబరాలను ఎవరికి వారు సొంత ఖర్చు–శ్రమతో తొలగించుకొని, శుభ్రపరచుకోవడం కాలనీవాసులకు తలకుమించిన భారం! అర్బన్ డిజైన్ లోపాల నుంచి అవినీతి అదుపు దాకా, భూకబ్జాల నియంత్రణ నుంచి వ్యర్థాల నిర్వహణ దాకా అన్నీ వైఫల్యాలే! ఏమంటే, దేనికీ స్పష్టమైన సమాధానం ఉండదు. అంతకు ముందు చెన్నై, మొన్న ముంబయి, నిన్న బెంగళూరు, ఇయ్యాల హైదరాబాద్! ఇదీ వరస!! ఎందుకీ దుస్థితి? కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందనే సామెత చందంగా, ఏది చెప్పుకున్నా ఓ పెద్ద కథ, అడుగడుగునా వైఫల్యాల వ్యథ! ప్రభుత్వాల, పాలనాసంస్థల వైఫల్యాలొకవైపు, పర్యావరణ మార్పు ఫలితంగా అసాధారణ వర్షాలతో ముంచుకు వస్తున్న ప్రకృతి విలయం మరోవైపు వెరసి సగటు మనిషి జీవితం పట్టణాలు, నగరాల్లో అస్తవ్యస్తమౌతున్నది.

నేర్వదగ్గ గుణపాఠమే!
పదిహేను నిమిషాల్లో ప్రపంచమంతటికీ పనికొచ్చే ఓ చక్కటి ‘యాప్’ తయారు చేయగల ‘ఐటీ మొనగాడు’ ఇంటి నుంచి ఆఫీస్ చేరడానికి, కాంక్రీట్ జనారణ్యపు రోడ్ల మీదే రెండు గంటలు పట్టిందంటే అది కచ్చితంగా బెంగళూరే! 1990ల వరకు బాగున్న గార్డెన్ సిటీ బెంగళూరు ఇటీవలే పాడైంది. పాతికేళ్లలో ఐటీ రంగం ఇక్కడ వృద్ధి చెంది ‘భారతదేశపు సిలికాన్​వ్యాలీ’ అయింది. ఐటీలో కీలక ఎగ్జిక్యూటివ్ స్థాయికెదిగిన వారు, రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల్లో, పబ్లిక్ సెక్టార్లలో ఉన్నతోద్యోగాలు చేసి రిటైరైన పెన్షనర్లు, ఓ మోస్తరు వ్యాపారవేత్తలు.. ఇలా ఎందరెందరో వాతావరణ పరంగా నచ్చి, బెంగళూరుని తమ స్థిర నివాసం చేసుకున్నారు. ఒకప్పటి ఆహ్లాదనగరం ఇప్పుడెందుకిలా తయారైంది? అనే బయటివారి ప్రశ్నకు సమాధానం తేలికే! నగరంపై జనసాంద్రత ఒత్తిడి పెరిగిన క్రమంలోనే అస్తవ్యస్త టౌన్ ప్లానింగ్, లే అవుట్ అతిక్రమణలు, ట్రాఫిక్ రద్దీ వల్ల నగరం అలా తయారైందనేది పరిశీలకుల భావన! అవినీతి తారాస్థాయికి చేరి, అతిక్రమణలకు, లే అవుట్ ఉల్లంఘనలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. వర్షాలు దంచి కొడితే నగరమిక నరకమే! ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించి పోతుంది. నీట మునిగిన కాలనీలు, శివారుల్లోని సంపన్నులు కూడా ప్రత్యామ్నాయ శిబిరాల్లో తలదాచుకునే దురవస్థ! రోజుకు పది, పదిహేను వేల రూపాయలు చార్జీ చేసే హోటల్ గదులు కూడా సగటున ఒక రాత్రికి రూ.35 వేలు, రూ.40 వేలు వసూలు చేసే గడ్డు రోజుల్ని ఈ వారంలోనే చూశాం.

ఇక్కడా చెయిదాటుతున్న స్థితి
చాన్నాళ్లుగా ముంబయి, చెన్నై, బెంగళూర్ చేదు అనుభవాలు చూసి కూడా జాగ్రత్తపడకుండా చెడిపోతున్న నగరం హైదరాబాద్! జోనల్ నిబంధనల్ని కఠినంగా అమలు చేసి, ప్రణాళికా బద్ధమైన హైదరాబాద్ అభివృద్ధి కోసం ‘హెచ్ఎండీఏ’ ఏర్పాటయింది. కానీ, సదరు సంస్థ చేస్తున్నదేమిటి? సరైన నియంత్రణ లేదు. అటు అధికారులతో, ఇటు ప్రజాప్రతినిధులతో, పలుకుబడి కలిగిన చోటా మోటా స్థానిక నాయకులతో చేతులు కలిపే రియల్టర్లు నగరంలో యథేచ్ఛగా ఉల్లంఘనలతో లేఅవుట్లు, నిర్మాణాలకు తలపడటం వల్లే కాలనీలు అడ్డదిడ్డంగా వెలుస్తున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు దురాక్రమణకు గురవుతున్నాయి. ఆచరణలో భవనాల క్రమబద్ధీకరణ(బీఆర్ఎస్) దారుణంగా తయారయింది. పథకం ప్రకటించాకే మొదటి ఇటుక కొని కూడా అక్రమనిర్మాణాలకు తలపడుతున్న ఘటనలూ ఉంటున్నాయి. సరైన ప్రణాళిక, తగిన పెట్టుబడి, పాలనలో పారదర్శకత, అవినీతిపై నియంత్రణ లేకపోవడం వల్లే మహానగరంలో వాన నీరు–వరద నిర్వహణ అస్తవ్యస్తంగా తయారయింది. శివారుల్లోఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ జలాశయాలు కాకుండా మంజీర, కృష్ణ, గోదావరి నదుల నుంచి నగరానికి తాగునీరు తెచ్చేందుకు వేల, లక్షల కోట్లు వెచ్చించిన ప్రభుత్వాలు... అందులో ఎంత శాతం నిధుల్ని  సమగ్ర మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు వెచ్చించాయి? అంటే మౌనమే సమాధానం అవుతుంది. నీటిని నగరంలోకి తేవడానికి ఉన్న శ్రద్ధలో ఎంతో కొంత, అదే నీటిని బయటకు పంపే విషయంలోనూ ఉండాలనేది సార్వత్రిక సూత్రం. 
కానీ, మన ప్రభుత్వాలకు ఈ విషయంలో శ్రద్ధే లేదు. చాలా సమస్యల్లాగే, ఈ విషయంలోనూ పేదలే తొలి బాధితులు. పరిస్థితులు వికటించినప్పుడు కోట్లు పెట్టి కొన్న ఖరీదు కారైనా పడవలా పనికి రాకుంటే, సంపన్నులకూ తిప్పలు తప్పవు.

అర్బన్ డిజైన్లోనే లోపం
ఎప్పుడూ చెప్పుకునే ఒక చండీగఢ్ తప్పితే దేశంలో ఏ ప్రధాన నగరాలూ సరైన డిజైన్, మాస్టర్ ప్లాన్​తో లేవు. ఇదొక పెద్ద సమస్య. ప్రణాళిక ఉన్నచోట కూడా లెక్కలేనన్ని ఉల్లంఘనలు. ప్రకృతికి–భౌగోళిక స్థితికి అనుకూలంగా నిర్మాణాలు జరిగితే ఇబ్బంది ఉండదు. కానీ, సరైన నగర ప్రణాళిక లేకుండా, ప్రకృతికి విరుద్ధ నిర్మాణాలతో వాననీటి నిర్వహణ, మురుగునీటి వ్యవస్థలు, వరద నియంత్రణ వంటివి మన నగరాల్లో సంక్లిష్టమవుతున్నాయి. దానికి అవినీతి, పాలకుల నిర్లక్ష్యం తోడై రోజురోజుకూ జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు లేక, విద్య–వైద్య సదుపాయాలు లభించక పట్టణాలు, నగరాలకు సాగే వలసలూ పెద్ద సమస్యే! ప్రపంచంలోనే కాలుష్యంతో పాటు జీవనయోగ్యతా ప్రమాణాలు అధ్వానంగా ఉన్న మొదటి పది నగరాలను లెక్కిస్తే, అందులో మెజారిటీ భారతదేశపు నగరాలే ఉన్నాయి. వేటికవిగా వాననీటి డ్రెయిన్లు, మురుగునీటి కాలువల ప్రత్యేక నిర్వహణపై మన నగరాల్లో శ్రద్ధ లేదు. చెరువులు, కుంటల పరిరక్షణ సరిగా ఉంటే, తక్కువ వ్యవధిలో భారీగా కురిసే వాన నీటిని భరించే సామర్థ్యం వాటివల్ల లభించేది. కానీ, భూమి విలువలు అడ్డదిడ్డంగా పెరిగాక, చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలు దురాక్రమణకు గురవుతున్నాయి. పలుకుబడి ఉన్న సంపన్నులు భూకబ్జాలకు పాల్పడితే, నిరుపేదలు మురికివాడల్లో, నగరాల్లో ఇతరత్రా ఉండే నదులు, కుంటలు, కాలువల, జలాశయాల అంచుల్లోని భూముల్ని తలదాచుకునే నివాసాల కోసం ఆక్రమిస్తున్నారు.
- దిలీప్ రెడ్డి.dileepreddy.r@v6velugu.com