
హైదరాబాద్, వెలుగు : మనకు ఎన్ని బట్టలున్నా కొత్తవి కావాలనే అనిపిస్తుంటుంది. కొత్తవి కొన్న తర్వాత పాత వాటిని వాడాలనిపించదు. అలాగని వాటిని పడేసేందుకు మనసొప్పదు. ఇలాంటివారి కోసం పలు సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. పాత బట్టలను కొని, అందుకు పైసలిచ్చి మళ్లీ షాపింగ్‌ను ఎంకరేజ్ చేసేందుకు పలు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. పాత బట్టలను అమ్మగా వచ్చిన డబ్బుతో తిరిగి షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పదుల సంఖ్యలో ఇలాంటి యాప్‌లు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది వీటిని ఉపయోగిస్తుండగా.. మంచి రేటింగ్, రివ్యూస్‌తో మార్కెట్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
ఓల్డ్ క్లాత్స్ సేల్ అండ్ షాప్ కాన్సెప్ట్ తో
ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తున్న రోజులివి. నచ్చిన డ్రెస్‌ని కార్టులో పెట్టుకుని ఎప్పుడెప్పుడు సేల్ ఉంటుందా? ఆఫర్లు ఉంటాయా? కొనేద్దామా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. కొత్తవి కొన్న తర్వాత పాత వాటిని వేసుకోవడమే మానేస్తారు. చాలా సార్లు వేసుకుని బోర్ కొట్టడం, రంగు పోవడం, సైజ్ సరిపోకపోవడం లాంటి కారణాలతోనూ పాత బట్టలు ఏండ్లకు ఏండ్లుగా కబోర్డ్‌లలోనే మూలుగుతుంటాయి. అయితే వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలనే కాన్సెప్ట్ తో ఓల్డ్ క్లాత్స్ సేల్ అండ్ షాప్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రీ అప్, బేచ్ దే, పోష్‌మార్క్, ఓఎల్‌ఎక్స్, డీపాప్, ఒయేలా, క్లాతింగ్ క్లిక్, ఈబే, ఓల్డ్ కార్ట్ వంటి యాప్‌లు ప్లేస్టోర్‌లో ఉన్నాయి. పాత బట్టలను అమ్మి ఆ వచ్చిన డబ్బులతో షాపింగ్ చేసుకునేలా ఈ యాప్‌లను డిజైన్ చేశారు.
ఈజీగా యూజ్ చేసేలా..
ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యాక సేల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, అమ్మాలనుకుంటున్న బట్టలను క్లోజప్‌లో ఫొటో తీసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. చిన్న డిస్క్రిప్షన్ రాయాలి. ఆ తర్వాత డ్రెస్ కండీషన్, కేటగిరీని సెలక్ట్ చేసి అమౌంట్‌ను కూడా తెలపాలి. ఇందులో సెల్లింగ్ ఫీజు లేకుండానే ఓల్డ్ క్లాత్స్ అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాయి సదరు కంపెనీలు. అదేవిధంగా డోర్ స్టెప్ పికప్‌ను అందిస్తున్నాయి. బట్టలను అమ్మే సమయంలో క్రెడిట్ పాయింట్స్ లేదా క్యాష్ కావాలనే ఆప్షన్ పెట్టుకునే వీలుంటుంది. బట్టలతో పాటు యాక్ససరీస్, డెకరేటివ్ ఐటమ్స్ కూడా అమ్ముకునేలా, కొనుక్కునేలా ఈ యాప్‌లో ఆప్షన్లు ఉన్నాయి.
అన్ని రకాల కేటగిరీలు ఉన్నాయి
ఓల్డ్ క్లాత్స్ సేల్ యాప్‌లను యూజ్ చేస్తున్నా. సెల్లర్స్, బయ్యర్స్‌తో ఈజీగా కమ్యూనికేట్ అవడానికి వీలుంటోంది. ఈజీగా యాక్సెస్ చేసేలా యాప్‌లను డిజైన్ చేశారు. వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉపయోగపడుతోంది. అన్ని రకాల కేటగిరీలు ఈ యాప్‌లలో ఉంటున్నాయి.
- పల్లవి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఈస్ట్ మారేడ్‌పల్లి