ఇలా చదివితే కచ్చితంగా మీకు సక్సెసే!

ఇలా చదివితే కచ్చితంగా మీకు సక్సెసే!

మార్చి వచ్చిందంటే పరీక్షల టైం మొదలైనట్టు. స్టూడెంట్స్‌‌కి, పేరెంట్స్‌‌కి టెన్షన్‌‌ మొదలైనట్టే. కొంతకాలం ఆన్‌‌లైన్ క్లాసులు, కొద్దిరోజులు స్కూల్లో క్లాసుల వల్ల  స్టూడెంట్స్​కి కన్ఫ్యూజన్​, పేరెంట్స్​కి టెన్షన్​. ప్లానింగ్‌‌తో చదివితే ఇప్పటికైనా ఎగ్జామ్స్‌‌లో ఈజీగా సక్సెస్ కావొచ్చని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. 

లాక్​డౌన్​ వల్ల  కొన్నాళ్లు ఇంటి నుండే క్లాసులు వినాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత  స్కూళ్లు తెరిచారు. స్కూళ్లు మొదలయ్యాయో లేదో పరీక్షలు దగ్గరపడ్డాయి. దీంతో ఇటు స్టూడెంట్స్, అటు పేరెంట్స్ ఈసారి రిజల్ట్​ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. 
 

ప్లానింగ్ ఫస్ట్
ప్లానింగ్ ఉంటే ఎందులో అయినా సక్సెస్ అవుతారు. అందుకే ప్రతి ఒక్కరూ పరీక్షలు రెండు, మూడు నెలలు ఉన్నాయి అనగానే ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఎంత సిలబస్ పూర్తి చేసింది? ఇంకెంత మిగిలి ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే అనుకున్న టైంకి సిలబస్​ పూర్తి చేస్తారు. టైమ్ సేవ్ అవుతుంది. 

 

ఇలా చేయొద్దు
పరీక్షల టైం వచ్చిందని టెన్షన్ పడుతూ అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదవడం మొదలు పెట్టకూడదు. అన్ని చాప్టర్స్‌‌ వరుసగా కవర్ చేయకూడదు. దీనివల్ల కన్ఫ్యూజ్​ అవుతారు. అందుకే వారానికి కొన్ని చాప్టర్లు మాత్రమే కవర్ అయ్యేవిధంగా టైం టేబుల్ వేసుకోవాలి. చాప్టర్స్ వరుసగా కాకుండా ఏది ఇంపార్టెంటో తెలుసుకుని చదవాలి. అంటే అంతకుముందు జరిగిన పరీక్షల్లో ఏ ప్రశ్నలైతే రెగ్యులర్‌‌‌‌గా వచ్చాయో, టీచర్లు ఏవి ఇంపార్టెంట్ అని చెప్పారో.. అవే ముందు కవర్ చేయాలి. ఆ తర్వాత మిగిలినవి చదవాలి. 


ఒత్తిడి రాకుండా
‘ఎన్ని గంటలు చదివాం? ఎంత సిలబస్ పూర్తి చేసాం?’ అన్నది ఇంపార్టెంట్ కాదు. పరీక్షలో ‘ఎన్ని రాశాం? ఎలా రాశాం.. ’ అన్నదే ఇంపార్టెంట్. కాబట్టి, హడావిడిగా, టెన్షన్ పడిపోతూ చదవకుండా నిదానంగా చదవాలి. ‘సిలబస్ ఎక్కువ ఉంది? ఇదంతా ఎప్పుడు చదవాలి?’ అని కంగారు పడిపోకుండా కూల్‌‌గా చదవాలి. అప్పడే మైండ్‌‌పై ఒత్తిడి పడదు. దానివల్ల చదవాలనుకున్న టైం కంటే ముందే సిలబస్ పూర్తి చేయగలుగుతారు. అలాకాకుండా మైండ్‌‌పై ఒత్తిడి పెడుతూ చదివితే చదివినవన్నీ మరిచిపోయే ప్రమాదం ఉంది. 

 

పాజిటివ్ ఆలోచనలు 
‘‘ఇంత సిలబస్ పూర్తి చేయగలనా? పాస్ అవుతానా? లేదా?’’ అన్న డౌట్స్‌‌తో పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మంచిది కాదు. ‘కష్టపడితే సాధ్యమే’ అన్న ఆలోచనతో ప్రిపేర్ అయితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అందుకే ప్రతిరోజూ పొద్దున అరగంట మెడిటేషన్, మరో అరగంట వ్యాయామానికి కేటాయించాలి. అప్పుడే మైండ్, బాడీ రిలాక్స్ అవుతాయి. 

 

నిద్ర కూడా అవసరం
పరీక్షలు దగ్గరపడుతున్నప్పుడు, పరీక్షలు రాస్తున్న టైంలో నిద్రపోకుండా చదవకూడదు. ఇలా చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పైగా చదివింది గుర్తుండదు. అందుకే బాగా తిని, హాయిగా నిద్రపోవాలి. 

తింటేనే మేలు
పరీక్షల టైంలో చాలామంది మంచి ఫుడ్ తినరు. కొంతమంది తింటే చదవలేమని అసలు ఫుడ్డే తినరు. ఇది చాలా ప్రమాదం. పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రులే కేర్ తీసుకోవాలి. టైంకి వాళ్లకు అన్నీ అందేలా చూడాలి. ఎక్కువగా నీళ్లు తాగించాలి. కాఫీ, టీలు తగ్గించి మజ్జిగ, పళ్ల రసాలు, పోషకాహారం టైంకి ఇవ్వాలి. శరీరం హెల్దీగా ఉన్నప్పుడే మైండ్ యాక్టివ్‌‌గా పనిచేస్తుంది. అప్పుడే చదివింది గుర్తుంటుంది. 

ఇలా ప్లాన్ చేయొచ్చు

  • సబ్జెక్టులను బట్టి టైమ్ టేబుల్ వేసుకోవాలి. సబ్జెక్టుల్లో లాంగ్వేజ్‌‌లు ఒకలా, మిగిలిన సబ్జెక్టులు ఒకలా టైమ్ టేబుల్ వేసుకుంటే చదవడం ఈజీగా ఉంటుంది. 
  • ఇంగ్లీష్, హిందీ, తెలుగు వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను సాయంత్రం, మిగిలిన సబ్జెక్టులను మార్నింగ్ టైం చదివేటట్టు ప్లాన్ చేసుకోవాలి. 
  • మ్యాథ్స్ సిలబస్ ఎక్కువగా ఉంటే.. రెండు పూటలా ప్రాక్టీస్​ చేయాలి.
  • కష్టమైన సబ్జెక్టులు ఉదయం పూట చదివితేనే ఈజీగా అర్ధమవుతాయి. 
  • ప్రతిరోజూ 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ తినాలి. 
  • ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ డ్యాన్స్, సింగింగ్, పెయింటింగ్స్ లాంటివి ప్లాన్ చేయాలి. 
  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు లేదా నాలుగు గంటల వరకూ బ్రేక్ తీసుకోవాలి. కావాలనుకుంటే ఆ టైంలో ఒక గంట ఆబ్టెక్టివ్​ టైప్​ లాంటివి చదువుకోవచ్చు. 
  • ప్రతిరోజూ ఉదయం నాలుగు లేదా ఐదు గంటల నుంచి చదవడం మొదలుపెట్టాలి.

మార్కులే లైఫ్ కాదు

టీచర్స్, పేరెంట్స్ పెట్టే ఒత్తిడి వల్లనో లేదా ఎక్కువ సిలబస్ ఉండటం వల్లనో.. చాలామంది స్టూడెంట్స్ మైండ్‌‌పై ఒత్తిడిని ఎక్కువగా పెంచుకుంటున్నారు. అది పరీక్షల టైంలో మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ, పిల్లలపై ఎక్కువ ఒత్తిడి ఉండకూడదు. దీనివల్ల వాళ్లు శారీరకంగా, మానసికంగా వీక్‌‌గా అవుతారు. కాబట్టి, పరీక్షల టైంలో పిల్లలపై ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. అలాగే, స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్.. మార్కులు మాత్రమే లైఫ్ కాదని గుర్తించాలి. అందులోనూ కరోనా వల్ల స్కూళ్లు సరిగా లేవు. క్లాసెస్ సరిగా జరగలేదు. అలాంటి టైంలో పిల్లల నుంచి ఎక్కువ మార్కులు ఎక్స్‌‌పెక్ట్ చేయకూడదు. ఈ టైంలో వాళ్లకు అండగా నిలుస్తూ, అన్ని విధాలా సపోర్టు చేస్తేనే పిల్లలు ఒత్తిడికి గురవకుండా ఉంటారు. ఒకవేళ, పరీక్షల ముందు పిల్లలు టెన్షన్ పడుతున్నా, భయపడుతున్నా పరీక్షల ముందు కౌన్సెలింగ్ ఇప్పిస్తే మంచిది.  
- డా. హరిణి అట్టూరు, సైకియాట్రిస్ట్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్.