బియ్యపు గింజంత రాడార్ తయారుచేసిన భారత శాస్త్రవేత్తలు

బియ్యపు గింజంత రాడార్ తయారుచేసిన భారత శాస్త్రవేత్తలు

తయారు చేసిన ఐఐఎస్​సీ

‘ష్​.. గోడలకు చెవులుంటాయ్​’.. ఇదీ దొంగచాటుగా గోడ వెనక ఉండి వినే వారి గురించి మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట. నిజంగానే గోడ చాటున ఎవరైనా ఉన్నారో తెలుసుకుంటే ఎట్లుంటది? మామూలు జీవితం గురించి పక్కనబెడితే, రక్షణ రంగంలో మాత్రం అలాంటిది చాలా అవసరం. అందుకే ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​​ (ఐఐఎస్​సీ) బెంగళూరు సైంటిస్టులు ఓ రాడార్​ను తయారు చేశారు. రాడార్​ అంటే చాంతాడంత పెద్దగా ఉండేది కాదు, జస్ట్​ బియ్యం గింజ ఋసైజులో ఉంటుందంతే. అవును, త్రూ ద వాల్​ రాడార్​ (టీడబ్ల్యూఆర్​)ను ఎలక్ట్రికల్​ కమ్యూనికేషన్​ ఇంజనీరింగ్​ డిపార్ట్​మెంట్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ గౌరవ్​ బెనర్జీ నేతృత్వంలోని టీం తయారు చేసింది. కాంప్లిమెంటరీ మెటల్​ ఆక్సైడ్​ సెమీకండక్టర్​ (సీఎంవోఎస్​) టెక్నాలజీతో సైంటిస్టులు ఈ టీడబ్ల్యూఆర్​ను రూపొందించారు. ఒక ట్రాన్స్​మిటర్​, మూడు రిసీవర్లు, రాడార్​ సిగ్నళ్లను పుట్టించే అడ్వాన్స్​డ్​ ఫ్రీక్వెన్సీ సింథసైజర్​తో ఈ రాడార్​కు డిజైన్​ చేశారు. ఆ మొత్తాన్ని ఓ చిన్న చిప్​పై పెట్టారు. ఇప్పటిదాకా రాడార్లు పెద్దగా ఉండడం వల్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటోందని, ఇప్పుడు చిన్న సైజులో రాడార్​ను తయారు చేయడం వల్ల ఖర్చు బాగా తగ్గుతుందని గౌరవ్​ బెనర్జీ చెప్పారు. రక్షణ రంగంతో పాటు, ఆరోగ్యం, రవాణా, వ్యవసాయ రంగాల్లోనూ ఇలాంటి రాడార్లను ఉపయోగించడానికి వీలవుతుందన్నారు. ఇలాంటి టెక్నిక్​ను ఇప్పటిదాకా కొన్ని దేశాల్లో మాత్రమే వాడుతున్నారని, ఇండియాలో ఇదే ఫస్ట్​ అని చెప్పారు.

ఎవరున్నరు.. ఏం చేస్తున్నరో చెప్తది

మామూలు రాడార్లలా కాకుండా గోడ అవతల ఎవరున్నారు.. వాళ్లు ఏం చేస్తున్నారన్నది ఈ టీడబ్ల్యూఆర్​ కచ్చితంగా చెబుతుందని చెబుతున్నారు. కాబట్టి మిలటరీతో పాటు రెస్క్యూ మిషన్లు, విపత్తు టైంలో వీటితో చాలా ఉపయోగం ఉంటుందని గౌరవ్​ బెనర్జీ వివరించారు. టీడబ్ల్యూఆర్​ విషయంలో డిజైనే ఓ పెద్ద చాలెంజ్​ అని అన్నారు. ‘‘గోడల నుంచి వెళ్లేటప్పుడు సిగ్నళ్లు ఒక్కోసారి ఆగిపోతుంటాయి. దాన్ని అధిగమించాలంటే ఎన్నో ఫ్రీక్వెన్సీలతో కూడిన రేడియో వేవ్స్​ను ఉపయోగించాల్సి ఉంటుంది. దాంతో దాని డిజైన్​ చాలా సంక్లిష్టమవుతుంది. దాని కోసం మైక్రోవేవ్​ ట్రాన్స్​మిటర్స్​, రిసీవర్స్​, ఫ్రీక్వెన్సీ సింథసైజర్​ వంటి వాటిని వాడాల్సి ఉంటుంది. దాంతో దాని డిజైన్​ బాగా కాంప్లెక్స్​ అయిపోతుంది. అయితే, మేం వాటన్నింటినీ ఓ చిన్న చిప్​లో పెట్టగలిగాం. డిజైన్​ను మామూలు చేయగలిగాం. దాని కోసం సర్క్యూట్ డిజైన్​ టెక్నిక్​ను వాడాం. మామూలు స్మార్ట్​ఫోన్లలో వాడే టెక్నిక్​నే ఇందుకోసం వాడుకున్నాం’’ అని గౌరవ్​ బెనర్జీ వివరించారు. ప్రస్తుతం మిలటరీ కోసమే దీన్ని తయారు చేసినా భవిష్యత్తులో ఆరోగ్య రంగానికీ వీటి వల్ల మేలు కలుగుతుందని చెప్పారు. పెద్ద వయసు వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్​ చేయొచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఇంప్రింట్​ అనే ప్రోగ్రామ్​ కింద ఈ రీసెర్చ్​కు నిధులిచ్చింది. డీఆర్​డీవో, భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ వంటి ప్రభుత్వ సంస్థలూ ప్రాజెక్ట్​లో భాగస్వాములుగా ఉన్నాయి.