
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూతురును రేప్ చేస్తానంటూ ట్విట్టర్‌లో బెదిరించిన యువకుడ్ని సంగారెడ్డి జిల్లాలో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రామ్‌నగేశ్ హైదరాబాద్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో పని చేస్తున్నట్లు గుర్తించారు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌లో భారత ఓడిన వెంటనే క్రిక్‌క్రేజీగర్ల్ పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కోహ్లిని బెదిరిస్తూ పెట్టిన ఓ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీనిపై ఢిల్లీ పోలీసులతోపాటు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్‌నగేశ్ ఈ ట్వీట్ చేశాడని తెలుసుకున్న పోలీసులు.. బుధవారం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్‌లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.