ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు నిరసన సెగ

ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు  నిరసన సెగ

బోయినిపల్లి, వెలుగు: అనర్హులకు గృహలక్ష్మి స్కీం ఇస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవో ఆఫీసులో శుక్రవారం గృహలక్ష్మి ప్రొసీడింగ్స్​ను  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అర్హులను వదిలేసి అనర్హులను ఎంపిక చేశారని, ప్రొసీడింగ్స్​ పంపిణీ ఆపాలని, రీ సర్వే చేయాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి మండలానికి 419 రావాల్సి ఉండగా 170 మాత్రమే వచ్చాయన్నారు. అర్హులందరికీ గృహలక్ష్మి పథకం అందుతుందని హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పంపిణీ  చేయబోమని చెప్పారు.

రీ సర్వే చేసి ఇస్తామని చెప్పడంతో వారు నిరసన విరమించారు. కొద్దిసేపటికే ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్ని గ్రామాలతో పాటు బోయినిపల్లి లబ్ధిదారులను కూడా పిలవడంతో సర్పంచ్ గుంటి లతాశ్రీ, గుంటి శంకర్ అడ్డుపడ్డారు. పంపిణీ చేసేది లేదని చెప్పి మళ్లీ ఎలా పేర్లు పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ‘మీ గ్రామానికి ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఎందుకు పంపిణీ చేయొద్దు’ అని వేణుగోపాల్ ​ప్రశ్నించారు. దీంతో మీ ఇష్టమున్నట్టు చేసుకోండని సర్పంచ్​ అనడంతో ఎమ్మెల్యే కలగజేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు.