
- ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, మహిళా సంఘాల కుమ్మక్కు!
- చెక్‌పోస్టులు పెట్టినా నడిగడ్డకు వస్తున్న కర్నాటక వడ్లు
- ప్రైవేట్ వ్యాపారుల వడ్లు సైతం కొనుగోలు కేంద్రాలకే
గద్వాల, వెలుగు: కర్నాటకలో వడ్ల రేటు తగ్గడంతో అక్కడి రైతులతో పాటు స్థానిక వడ్ల వ్యాపారులు తమ వడ్లను కొనుగోలు కేంద్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నాటక బార్డర్ వెంట ఉన్న కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్ముకుంటుండగా, వారికి అగ్రికల్చర్ ఆఫీసర్లు, కొనుగోలు సెంటర్ నిర్వాహకులు, మహిళా సంఘాల సభ్యులు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేటిదొడ్డి మండలం వెంకటాపురం, నందిన్నె, కొండాపురం సెంటర్లతో పాటు గట్టు మండలంలోని పలు సెంటర్లలో ఈ దందా సాగుతోంది. గద్వాల మండలం రేకులపల్లె, కొత్తపల్లి సెంటర్లలో వ్యాపారులు తమ వడ్లను అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కర్నాటకలో వడ్లకు తగ్గిన డిమాండ్..
ఈసారి కర్నాటకలో వడ్లకు రేట్, డిమాండ్ లేకపోవడంతో అక్కడి రైతులతో పాటు కొందరు వ్యాపారులు తమ వడ్లను జిల్లాకు తీసుకొస్తున్నారు. కర్నాటకలో క్వింటాల్ వడ్లు రూ.1,600 నుంచి రూ.2 వేల లోపే అమ్ముడుపోతున్నాయి. దీంతో అక్కడి రైతులు, వ్యాపారులు ఇక్కడి వారితో కుమ్మక్కై రాత్రి పూట వడ్లను తీసుకు వచ్చి సెంటర్లలో పెట్టి అమ్ముతున్నారు. సెంటర్ నిర్వాహకులతో పాటు మహిళా సంఘాల సభ్యులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వారికి సహకరిస్తూ కర్నాటక నుంచి వచ్చిన వడ్లనే ముందు కాంటా వేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇటీవల కొండాపురం సెంటర్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులు, సోమవారం కలెక్టరేట్ ముట్టడించి రైతులు తమ వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధరతో పాటు బోనస్..
మద్దతు ధరతో పాటు బోనస్ కలుపుకుంటే క్వింటాల్ వడ్లకు రాష్ట్రంలో రూ.2,850 ధర వస్తోంది. దీంతో ఇక్కడి రైతులతో కలిసి వడ్లను అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్, సెంటర్ నిర్వాహకులు, మహిళా సంఘాల సభ్యులకు క్వింటాల్‌కు ఇంత అని ఓ రేటు మాట్లాడుకొని ఈ దందాను కొనసాగిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు మిగులుతున్నాయి. కర్నాటక నుంచి వచ్చిన వడ్లను బార్డర్ లోని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతుండగా, వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
చెక్ పోస్ట్ లు పెట్టినా..
రాష్ట్రంలో వడ్లకు బోనస్ ఇస్తుండడంతో పక్క రాష్ట్రం నుంచి రాష్ట్రంలోకి వడ్లు రాకుండా జోగులాంబ గద్వాల జిల్లాలోని సరిహద్దులో 7 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. కానీ, అక్కడ నామామాత్రపు తనిఖీలు నిర్వహిస్తుండడం, అక్కడ ట్రాక్టర్ కు ఇంద చొప్పున డబ్బులు ఇచ్చి వడ్లను తీసుకొస్తున్నారనే ఆరోపణలున్నాయి. చెక్ పోస్ట్ లు లేని చోట బండ్ల బాట వెంట రాష్ట్రంలోకి వడ్లను తీసుకువస్తున్నారు.
సెంటర్లలో లీడర్లదే రాజ్యం..
జిల్లాలోని కొనుగోలు సెంటర్లను మహిళా సంఘాలు నడుపుతున్నప్పటికీ, లీడర్లే పెత్తనం చేస్తున్నారనే విమర్శలున్నాయి. క్రాప్ బుకింగ్ సమయంలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారనే విషయాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంట్రీ చేస్తారు. కానీ, లీడర్లు చెప్పడంతో క్రాప్ బుకింగ్‌తో సంబంధం లేకుండా టోకెన్స్ ఇస్తున్నారు. గన్నీ బ్యాగులు కావాలన్నా రైతులు లీడర్ల ఇండ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. హమాలీ పేరుతో క్వింటాల్‌కు రూ.50, తరుగు పేరుతో నాలుగు కిలోలు కోత పెడుతున్నారని, లీడర్లు చెప్పిన వారి వడ్లు కాంటా వేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
కర్నాటకతో పాటు వ్యాపారుల వడ్లు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అనుమానం ఉన్న కొనుగోలు సెంటర్ కు తహసీల్దార్ ను పంపిస్తున్నాం. పోలీస్, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్ గద్వాల