అడవిలో మానవత్వం చాటిన పోలీసులు

అడవిలో మానవత్వం చాటిన పోలీసులు
  • అస్వస్థతకు గురైన భక్తుడిని  భుజాలపై ఎత్తుకుని.. 20కిమీ కొండలు, గుట్టలెక్కిన పోలీసులు
  • నట్టడవిలో చేతులు కలిపి సాయం సాయమందించిన ఇతర భక్తులు
  • ప్రాణాలు కాపాడలేకపోవడంతో కంటతడిపెట్టుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది

కర్నూల్: మానవత్వం చాటుకున్నారు కర్నూలు జిల్లా శ్రీశైలం పోలీసులు. శ్రీశైలం పాదయాత్రకు వెళ్తూ.. ఆత్మకూరు మండలం వెంకటాపురం దాటిన తర్వాత నల్లమల అడవిలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న కన్నడ భక్తుడిని కాపాడేందుకు తమ భుజాలపై ఎత్తుకుని ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరీ ఆస్పత్రికి తరలించారు. నట్టడవిలో వందల అడుగుల ఎత్తున్న కొండలు, గుట్టలు ఎక్కుతూ ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రీశైలం శివార్లలోని కైలాసద్వారానికి తీసుకెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న వైద్య సిబ్బంది వెంటనే వైద్య చికిత్స చేపట్టగా.. ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించడంతో ఎంతో కష్టపడి భుజాలపై ఎత్తుకుని తీసుకొచ్చిన పోలీసులు, వైద్య సిబ్బంది కంటతడిపెట్టుకున్నారు. భక్తుడి ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో కాపాలనే సంకల్పంతో కొండలు.. గుట్టలు ఎక్కుతూ తీసుకొచ్చినా ప్రాణాలు కాపాడలేకపోవడంతో ఒకింత ఉద్వేగానికి గురై.. బోరున విలపించడం స్థానికులను, భక్తులను విషాదంలో ముంచెత్తింది. 
కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా బొమ్మనహల్లి గ్రామానికి చెందిన కట్టెగౌడ కుమారుడు వేదమూర్తి(43) శ్రీశైల మల్లన్న భక్తుడు. ఏటా ఉగాదికి తమ ఇంటి ఆడపడుచు అయిన శ్రీశైల భ్రమరాంబ దేవికి ముడుపులు చెల్లించుకోవడం ఆనవాయితీ. దీని కోసం వేలాది మంది కన్నడ భక్తులు ఉగాదికి నెల రోజుల ముందే తమ సొంత గ్రామాల నుండి పాదయాత్రగా బయలుదేరుతారు. మార్గం మధ్యలో భక్తులు, దాతలు ఆలయాల్లో పెట్టే అన్న ప్రసాదాలు తింటూ ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీశైలం చేరుకుంటారు. గత ఏడాది కరోనా ప్రబలడంతో పాదయాత్ర విఫలం అయింది. కరోనా వెళ్లిపోతే కాలినడకన వస్తానని మొక్కుకున్న వేదమూర్తి తన సహచరులతో కలసి స్వగ్రామం నుండి పాదయాత్ర చేస్తూ బయలుదేరాడు. నిన్న ఆత్మకూరుకు చేరుకుని వెంకటాపురం వద్ద బస చేసిన వేదమూర్తి శనివారం ఉదయమే వెంకటాపురం గ్రామ శివార్లలో నల్లమల అడవిలో ప్రవేశించారు. పాదయాత్ర చేస్తూ భీమునికొలను వద్ద కాసేపు సెదతీరాడు. అక్కడే అన్నప్రసాదాలు, తాగునీటి కొలను ఉండడంతో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. ఇది గమనించిన సహచర భక్తులు ఆత్మకూరు పోలీసుల సహాయం కోసం 100 కాల్ చేశారు.
సహాయం కోసం నెంబర్:100 కాల్.. వెంటనే స్పందించిన పోలీసులు, వైద్య సిబ్బంది
 భీమునికొలను వద్ద ఓ కన్నడ భక్తుడు ఊపిరితీసుకోలేక ఇబ్బందిపడుతున్నాడని.. ఎలాగైనా వైద్యం అందించాలని కోరగా.. పోలీసులు 108 వైద్య సిబ్బందిని వెంటబెట్టుకుని హుటాహుటిన భీమునికొలను చేరుకున్నారు. వైద్య సిబ్బంది వెంటనే తమ వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ సిలిండర్ తగిలించి కృత్రిమ శ్వాస అందించారు.  అక్కడ నుండి ఆస్పత్రికి తరలించేందుకు నలుగురు పోలీసులు, స్ర్టెచర్ పై భక్తుడిని మోస్తూ తీసుకెళ్గా.. వైద్య సిబ్బంది కూడా తమ ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకుని.. శ్వాస ఇబ్బంది కలుగకుండా చూసుకుంటూ... కొండలు కోనలు ఎక్కుతూ శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీశైలంలో ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కైలాసద్వారం వద్ద రెడీగా ఉన్నారు. ఈ భక్తుడిని తీసుకొచ్చిన వెంటనే వైద్య చికిత్స ప్రారంభించగా.. భక్తుడి శరీరంలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించడంతో.. అతని కోసం ఎంతో ప్రయాసపడుతూ.. కొండలు.. గుట్టలు ఎక్కుతూ వచ్చిన పోలీసులు, వైద్య సిబ్బంది బోరున విలపించారు. తమకు ఏమీ కాని.. ఎలాంటి బంధుత్వం లేని భక్తుడి కోసం వీరి శ్రమ వృధా కావడం కలచివేసింది. శ్రీశైల మల్లన్న భక్త శిబిరాల్లో ఘటన విషాదం రేపింది. 

పోలీసులను వేనోళ్ల కొనియాడిన మల్లన్న భక్తులు

సాధారణంగా ఆరోగ్యవంతులైన వారు కొండలు, గుట్టలెక్కుతూ పాదయాత్రగా భీమునికొలను నుండి శ్రీశైలానికి చేరుకోవడానికి ఒకరోజు పడుతుంది. అయితే మరో మార్గం కనిపించని పరిస్థితుల్లో శ్రీశైలం వన్ టౌన్ ఎస్.ఐ హరిప్రసాద్ చొరవ తీసుకుని సిలిండర్ మోస్తూ.. బయలుదేరగా పోలీసులు, వైద్య సిబ్బంది అడవిలో  అక్కడక్క పాదయాత్ర చేస్తున్న వారి సహాయం తీసుకుంటూ  ముందుకు సాగారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే వేగంగా శ్రీశైల క్షేత్రం శివార్లలో ఉన్న కైలాసద్వారానికి తరలించారు. సాహసాన్ని మరిపించే రీతిలో పోలీసులు పడిన కష్టం.. ఒ నిండు ప్రాణం కాపాడేందుకు పడిన తపన.. శ్రమ.. పాదయాత్ర భక్తులను, శ్రీశైల మల్లన్న భక్తులను అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉగాది సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు కర్నాటక, మహారాష్ట్ర భక్తులు స్వగ్రామాల నుండే పాదయాత్ర చేస్తూ వస్తుంటారు. అస్వస్థతకు గురైన ఓ భక్తుడి కోసం పోలీసులు, వైద్య సిబ్బంది ఎంతో వ్యయప్రయాసలు పడుతూ.. కృత్రిమ శ్వాస అందిస్తూ.. అడవిలో భుజాలపై ఎత్తుకుని మోస్తూ..  ఆస్పత్రికి తరలించిన వైనం అభినందనలు అందుకుంది. పాదయాత్రగా వెళ్తున్న ఇతర భక్తుల్లోని యువకులు మేము సైతం అంటూ భుజాలు కలపడం.. ఆస్పత్రికి తరలించడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా తలా ఒక చేయి వేస్తూ.. ముందుకు సాగిన వైనం అభినందనలు అందుకుంది. కొందరు ఔత్సాహికులు వీరి కష్టాన్ని వీడియో.. ఫోటోలు తీస్తూ షేర్ చేయడం స్థానికంగా వైరల్ అయింది. అయితే ఇంత కష్టపడినా భక్తుడి ప్రాణాలు కాపాడుకోలేకపోవడం ఒకింత నిరాశకు గురిచేసింది. అయితే ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం.. వారికి వైద్య సిబ్బంది సహకరిస్తూ ముందుకు సాగడం హాట్ టాపిక్ అయింది. పోలీసులు వైద్య సిబ్బందితో స్ఫూర్తి దాయకమైన రీతిలో విధులు నిర్వర్తించిన ఘటనపై కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేయగా.. పోలీసు బాస్ డాక్టర్ ఫక్కీరప్ప అభినందనలు తెలియజేశారు. సమాజంలో పోలీసుల పట్ల ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేశారని ప్రశంసించారు.