గ్రీన్ కార్డులు, నివాసంపై ఆశలు వదులుకోండి

గ్రీన్ కార్డులు, నివాసంపై ఆశలు వదులుకోండి

‘అమెరికా రావాలంటే ఇకపై మీ కాళ్ల మీద మీరు నిలవడాల్సిందే. మా దేశానికి భారమయ్యేటట్లయితే ఇక్కడికి అస్సలు రావొద్దు. ఇప్పటికే వచ్చినోళ్లు మంచిగ సంపాదించుకుని బతుకుర్రి. ఇక గ్రీన్ కార్డులు, పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీల కోసం ఎక్వగా ఆశలు పెట్టుకోకుర్రి. మీరు పైసలు బాగా సంపాయించుకుంటరని, మీ లైఫ్​ మీరు బాగా చూసుకోగలరని నమ్మకం కుదిరితేనే అయన్నీ అయితయ్. లేకుంటే ఇక గ్రీన్ కార్డులిచ్చుడు ఉండదు. అంతేకాదు.. మీరు మా దేశానికి బరువైతరనుకుంటే.. అసలు ముందే రానియ్యం..” ఇదీ ఇయ్యాళ నుంచి అమెరికా సర్కారు అమలు చేయనున్న ‘పబ్లిక్ చార్జ్’ రెగ్యులేషన్ సారాంశం. సర్కారు పథకాలను విదేశీయులు ఎక్కువగా వాడుకుంటున్నారని, అమెరికన్​లు చెల్లిస్తున్న ట్యాక్స్ డబ్బులను అమెరికన్ పేదలకే ఉపయోగపడేలా చూసేందుకు ఆ దేశ సర్కారు సోమవారం నుంచి పబ్లిక్ చార్జ్ రూల్​ను అమలు చేయనుంది.

పబ్లిక్ చార్జ్ అంటే..?

అమెరికాలో ఉండే విదేశీయులు నిర్ణయించిన దాని కంటే ఎక్కువగా ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందినట్లయితే దానిని ‘పబ్లిక్ చార్జ్’ అంటారు. అమెరికా రావాలనుకుంటున్న విదేశీయుల్లో ఎవరైనా భవిష్యత్తులో పబ్లిక్ చార్జ్​గా మారతారని అనిపించినా, ఇకపై వారికి వీసా నిరాకరించే అవకాశం ఉంది. ఇక దేశంలో ఇప్పటికే ఉన్న విదేశీయులు పబ్లిక్ చార్జెస్ గా మారతారని తేలినా.. వాళ్లకు ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్చుకునేందుకు చాన్స్ ఉండదు. అందువల్ల గ్రీన్ కార్డులు, పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీ (శాశ్వత నివాసం) వంటివి వారికి దక్కవు. చాలా ఏళ్లుగా ఈ విషయంలో సరైన రూల్స్ లేనందున అమెరికన్ ప్రజల పన్నులతో అందిస్తున్న ఫుడ్ స్టాంప్స్ (రేషన్ షాపుల్లో సరుకులు), హెల్త్ స్కీంల వంటి పథకాలను విదేశీయులు వాడుకుంటున్నారని, అసలైన అమెరికన్ పేదలకు నష్టం జరుగుతోందని ట్రంప్ సర్కారు భావిస్తోంది. అందుకే.. ‘అమెరికా ఫస్ట్..’ పాలసీని మరింత స్ట్రిక్ట్​గా అమలు చేయాలని ఆలోచిస్తోంది.

కోర్టు తీర్పుతో లైన్ క్లియర్..

పబ్లిక్ చార్జ్ రెగ్యులేషన్​పై చివరి ఇంజక్షన్ ఆర్డర్​ను శుక్రవారం అమెరికా సుప్రీంకోర్ట్ ఎత్తేసింది. దీంతో ఈ రెగ్యులేషన్ అమలుకు అడ్డంకి తొలగిపోయింది. కోర్టు తీర్పుతో ఈ రూల్​ను అమలు చేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్​కు మార్గం సుగమం అయిందని ఈ మేరకు వైట్​హౌస్​ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రీషమ్ వెల్లడించారు. ‘‘కష్టపడి పని చేస్తూ పన్నులు కడుతున్న అమెరికన్లకు కోర్టు తీర్పు రక్షణఇస్తుంది. నిజంగా సహాయం అవసరమైన అమెరికన్ల కోసం సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలవుతుంది. దేశంలోకి కొత్తగా వచ్చేటోళ్లు ఇక్కడి ప్రజల పన్నులతో అమలు చేసే పథకాలపై ఆధారపడకూడదన్న న్యాయ సూత్రం అమలుకు అవకాశం ఉంటుంది” అని స్టెఫానీ పేర్కొన్నారు. ఫైనల్ రూల్​ను నిరుడు ఆగస్టు 14నే సర్కారు పబ్లిష్​ చేసింది. అక్టోబరు 15 నుంచే అమలులోకి రావాల్సి ఉండగా, పలు కోర్ట్ రూలింగ్స్ కారణంగా వాయిదా పడింది.

ఫైనల్ రూల్​లో ఏముంది?

విదేశీయులెవరైనా భవిష్యత్తులో పబ్లిక్ చార్జ్​గా మారే అవకాశం ఉందని హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ భావిస్తే.. వారు గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీ కోసం లీగల్ స్టేటస్​ను మార్చుకోవడానికి అనుమతించాలా? వద్దా? అన్నది ఈ డిపార్ట్ మెంటే నిర్ణయిస్తుంది. అలాగే విదేశీయులు తమ సొంతకాళ్లపై నిలబడలేరని భావిస్తే.. వాళ్లకు వీసాలు కూడా నిరాకరించే చాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఉన్నోళ్లు ఎక్స్​టెన్షన్ పొందాలనుకున్నా లేదా గ్రీన్ కార్డ్ వంటివి పొందాలనుకున్నా.. వాళ్లు నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ పొందినప్పటి నుంచీ నిర్ణయించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ పథకాలను వాడుకుని ఉండరాదని నిబంధనలు చేర్చారు.