వెలుగు సక్సెస్: డెమోగ్రాఫిక్ గ్యాప్​

వెలుగు సక్సెస్: డెమోగ్రాఫిక్ గ్యాప్​

ఒక దేశ జనాభాకు సంబంధించిన జనన, మరణ రేట్ల మధ్య తేడాను డెమోగ్రాఫిక్ గ్యాప్​ అంటారు. ఈ గ్యాప్​ జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదట తక్కువగాను, మధ్య దశలో ఎక్కువగాను, చివరి దశలో తక్కువగాను ఉంటుంది. 1921 ముందు జనన, మరణరేట్లు రెండూ అధికంగా, ఇంచుమించుగా సమానంగా ఉన్నాయి. అందుకే జనాభా పెరగలేదు. ఈ కాలంలో భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలో మొదటి దశలో ఉంది.

1921 తర్వాత జనన రేటు కంటే మరణరేటు ఎక్కువగా తగ్గింది. ఫలితంగా జనాభా పెరుగుతూ వచ్చింది. అందుకే భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండో దశలోకి ప్రవేశించింది. 1951 తర్వాత జనన, మరణ రేట్ల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో భారతదేశం 1951 నుంచి జనాభా విజృంభణ దశలో ఉంది. 1981 తర్వాత జననరేటు ముందు కాలంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. అందుకు 1981 తర్వాత భారత జనాభా పెరుగుదల రేటు తగ్గింది. 


1951 నుంచి 2020 మధ్య జనన రేటు తక్కువగా తగ్గగా (39.9 నుంచి 19.5కి), మరణరేటు ఎక్కువగా (27.4 నుంచి 6కు) తగ్గింది. అయితే, కేరళ, తమిళనాడు, గోవా తదితర రాష్ట్రాల్లో జనన రేటు చెప్పుకోదగిన విధంగా తగ్గింది. ఇప్పటికీ సాంఘిక, ఆర్ధిక కారకాలు పెద్ద కుటుంబాలకు అనుకూలంగానే ఉన్నాయి. వివాహం, కుటుంబ పరిమాణం, పిల్లల పట్ల శాస్త్రీయ దృక్పథం మారితేనే గాని జనన రేటు చెప్పుకోదగినట్లుగా తగ్గదు. 

శాంపుల్​ రిజిస్ట్రేషన్​ సిస్టమ్​ బులెటిన్​(ఎస్​ఆర్​ఎస్) 2020ను 2022, మేలో విడుదల చేశారు. జననరేటు, మరణరేటు, సహజ వృద్ధిరేటు, శిశు మరణ రేటు తదితర అంశాలను ఇందులో అంచనా వేస్తారు. ఇందులో పెద్ద రాష్ట్రాలు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కోటి జనాభా దాటాయి. 

జననరేటు: గత ఐదు దశాబ్దాల నుంచి జనన రేటు తగ్గుతూ వస్తోంది. (1971లో 36.9 ఉండేది. 2020 నాటికి 19.5కి తగ్గింది) గ్రామీణ పట్టణాల మధ్య జననరేటు వ్యత్యాసం తగ్గుతున్నది. అయితే, పట్టణాల్లో కంటే గ్రామాల్లో జననరేటు ఎక్కువగా ఉంటూనే వస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక జనన రేటు కలిగిన రాష్ట్రం బిహార్​ (25.5), ఉత్తరప్రదేశ్​ (25.1). తక్కువ జనన రేటు కలిగిన రాష్ట్రం కేరళ (13.2).

చిన్న రాష్ట్రాల్లో అధిక జనన రేటు కలిగిన రాష్ట్రం మేఘాలయ (22.9), అల్ప జనన రేటు కలిగిన రాష్ట్రం (12.1). మొత్తం రాష్ట్రాల్లో అల్ప జననరేటు కలిగిన రాష్ట్రం గోవా. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక జనన రేటు దాదానగర్​ హవేలి, డామన్​ డయ్యు (20.3), తక్కువ జనన రేటు అండమాన్​ నికోబార్ దీవులు(10.8) ఉంది. 

మరణరేటు: గత ఐదు దశాబ్దాల్లో మరణరేటు తగ్గుతూ వస్తోంది. (1971లో 14.9 కాగా, 2020 నాటికి 6కు తగ్గింది) తగ్గుదల ఎక్కువగా గ్రామాల్లో కనిపించింది. పెద్ద రాష్ట్రాల్లో అధిక మరణ రేటు చత్తీస్​గఢ్​ (7.9)ళో ఉండగా తక్కువ మరణరేటు కలిగిన రాష్ట్రం ఢిల్లీ (3.6). చిన్న రాష్ట్రాల్లో అధిక మరణ రేటు కలిగిన రాష్ట్రం హిమాచల్​ప్రదేశ్​ (6.8), తక్కువ మరణరేటు గల రాష్ట్రం నాగాలాండ్​ (3.7). అత్యధిక మరణరేటు గల కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి 6.5. అత్యల్ప మరణరేటు ఢిల్లీ(3.6)లో ఉంది. మొత్తం రాష్ట్రాలను తీసుకుంటే ఢిల్లీలో మరణరేటు తక్కువగా ఉంది.

సహజ వృద్ధిరేటు: జనన రేటు నుంచి మరణరేటును తీసివేస్తే సహజ వృద్ధిరేటు వస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక సహజ వృద్ధిరేటు క​లిగిన రాష్ట్రం బిహార్​(20). తక్కువ సహజ వృద్ధి కలిగిన రాష్ట్రం కేరళ (6.2). చిన్న రాష్ట్రాల్లో అధిక సహజ వృద్ధి గల రాష్ట్రం మేఘాలయ (17.6). 

అల్ప సహజ వృద్ధి గల రాష్ట్రం గోవా (6.2). అధిక సహజ వృద్ధి కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్​ హవేలి డామన్​ డయ్యూ (16.5). తక్కువ సహజ వృద్ధి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు (5).

శిశు మరణరేటు: నిర్ణీత కాలంలో నిర్ణీత ప్రాంతంలో ప్రతి 1000 సజీవ జననాలకు మృతిచెందే శిశువుల సంఖ్యను(ఒక సంవత్సరం లోపు) తెలిపేది శిశు మరణరేటు. అంటే మొదటి పుట్టిన రోజు కూడా చూడకుండా మృతిచెందేవారు. దేశ ఆరోగ్య ముఖ చిత్రాన్ని తెలిపే ఒక సూచీ శిశుమరణ రేటు. 1971లో 129 ఉండేది. ప్రస్తుతం ఇందులో 1/4 వంతు ఉంది.

పెద్ద రాష్ట్రాల్లో అధిక శిశు మరణ రేటు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్​(43). తక్కువ శిశు మరణ రేటు కలిగిన రాష్ట్రం కేరళ (6). చిన్న రాష్ట్రాల్లో ఐఎంఆర్​ ఎక్కువగా ఉన్న రాష్ట్రం మేఘాలయ (29). తక్కవగా ఉన్న రాష్ట్రం మిజోరాం (3). మొత్తం రాష్ట్రాల్లో తక్కువ ఐఎంఆర్​ గల రాష్ట్రం మిజోరం(3). కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధిక ఐఎంఆర్​ డామన్​ డయ్యూ, లఢఖ్​ (16)లో ఉంది. అతి తక్కువ ఐఎంఆర్​ పాండిచ్చేరి(6)లో ఉంది. 

మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్​ఆర్​): పునరుత్పాదక వయస్సు కలిగిన స్త్రీకి సగటున జన్మించే పిల్లల సంఖ్యను చెప్పేది మొత్తం సంతానోత్పత్తి రేటు. అయితే స్త్రీ విద్యాస్థాయి పెరిగే కొద్దీ టీఎఫ్​ఆర్​ తగ్గుతుంది. ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​-5 (2019-21)లో ఐదు రాష్ట్రాలు మాత్రమే పెర్టిలిటీ రిప్లేస్​మెంట్ స్థాయిని సాధించలేకపోయాయి. బిహార్​ (2.98), ఉత్తరప్రదేశ్​ (2.35), జార్ఖండ్​ (2.26), మణిపూర్​ (2.17). ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​–5 ప్రకారం దేశ టీఎఫ్​ఆర్​ 2.0. గ్రామాల్లో 2.1, పట్టణాల్లో 1.6. 1992–93లో 3.4 ఉండేది. 1.4 తగ్గి ప్రస్తుతం 2.0 చేరింది.

ప్రసూతి మరణ రేటు

ప్రతి లక్ష సజీవ జననాలకు సంవత్సరానికి చనిపోయే తల్లుల సంఖ్యను తెలిపేదే ప్రసూతి మరణ నిష్పత్తి. ప్రతి లక్ష పునరుత్పాదక వయస్సు కలిగిన (15 -49 సంవత్సరాలు) మహిళలకు సంవత్సరంలో సంభవించే ప్రసూతి మరణాలను తెలిపేదే ప్రసూతి మరణాల రేటు. ఎస్​డీజీ లక్ష్యాల్లో ఎంఎం నిష్పత్తిని 70 కంటే తక్కువకు తీసుకురావాలి. వైద్య సదుపాయాల కొరత, అధిక పేదరికం ఉన్నా ఎంఎంఆర్ తగ్గుతూ వచ్చి 2017-19 నాటికి 103కు చేరాయి. ఎంఎంఆర్​ను సరిగ్గా అర్థం చేసుకునేందుకు రాష్ట్రాలను మూడు గ్రూపులుగా విడదీస్తారు. 

  • ఎ. ఎంపవర్డ్​ యాక్షన్ గ్రూప్​(ఈఏజీ), అసోం: బిహార్​, జార్ఖండ్​, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్​, ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​, ఒడిశా, రాజస్తాన్​, అసోం. 
  • బి. దక్షిణాది రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు) 
  • సి. ఇతర రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు 
  • ఎంఎంఆర్ 2014-16 నుంచి 2017-19 నాటికి 130 నుంచి 103కు తగ్గింది. 
  • ఈఏజీ, అసోంల్లో చెప్పుకోదగిన విధంగా     188 నుంచి 145కు తగ్గింది.
  • దక్షిణాది రాష్ట్రాల్లో             77 నుంచి 59కి తగ్గింది. 
  • ఇతర రాష్ట్రాల్లో            93 నుంచి 79కి తగ్గింది. 
  •   అసోంలో అధికంగాను (205), కేరళలో అల్పంగాను (30)గా ఉంది. 
  •   భారతదేశ ఎంఎం రేటు 6.5, తెలంగాణలో 3.1గా ఉంది.
  • చైల్డ్​ మొర్టాలిటీ రేట్​(సీఎంఆర్​): 0 నుంచి 5 సంవత్సరాల మధ్యలో మృతిచెందే పిల్లల సంఖ్యను తెలిపేది సీఎంఆర్​. ఎస్​ఆర్​ఎస్​ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పిల్లలకు మృతిచెందేవారు 2020 నాటికి 32.6గా ఉంది.