ప్రతిక్షణం జన ప్రభంజనం.. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రతిక్షణం జన ప్రభంజనం..  నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రజలకు సమస్యలపై అవగాహన కల్పించి వాటిని పరిష్కరించడానికి, వనరుల సమీకరణ, బలోపేతం చేయడానికి ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే  దుష్పరిణామాలను వివరించేందుకు,  ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989లో  ప్రారంభించింది. 

కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత, లింగ సమానత్వం,  తల్లి ఆరోగ్యం,  మానవ హక్కులు వంటి వివిధ  సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడం యూఎన్​లక్ష్యం. 1987 జులై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకుంది.   1987 జులై 11 నుంచి సరిగ్గా 20 ఏండ్ల తరువాత అంటే జులై  11, 2007 నాటికి  ప్రపంచ జనాభా సంఖ్య 6,602,226,175కు చేరుకున్నట్లు ఐక్యరాజ్య సమితి  వెల్లడించింది. 2008 జూన్ 28 నాటికి 6.7 బిలియన్లు ఉండగా, 2012 నాటికి ఏడు బిలియన్లకు చేరుకుంది.

ఇది 2021లో దాదాపు 7.9 బిలియన్లకు చేరుకుంది. 2050లో ప్రపంచ  జనాభా 9.7 బిలియన్లకు చేరే అవకాశముందని కూడా పేర్కొంది. 1,428.6 మిలియన్ల జనాభాతో మొదటి స్థానంలో భారత్ , 1,425.7 మిలియన్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉండగా, 340 మిలియన్ల జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉంది. 

చైనాను అధిగమించిన భారత్​

 2023 నాటికి మొదటి స్థానంలో ఉన్న చైనాను భారత్‌‌‌‌‌‌‌‌ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా అవతరించింది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు ప్రపంచ జనాభాలో 37 శాతం ఆక్రమించాయి. ఇటీవలి కాలంలో సంతానోత్పత్తి రేట్లు,  జీవన కాలపు అంచనాలలో అపారమైన మార్పులు వచ్చాయి. 1970 ప్రారంభంలో  స్త్రీలు సగటున ఒక్కొక్కరు 4, 5 మంది పిల్లలను కలిగి ఉండేవారు.  ప్రపంచ సగటు మనిషి జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 సంవత్సరాల నుంచి 2019లో  72.6 సంవత్సరాలకు పెరిగింది.

అదనంగా, ప్రపంచం అధిక స్థాయి పట్టణీకరణను కోరుకుంటుంది.  వలసలను వేగవంతం చేస్తోంది. 2007లో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో  ఎక్కువమంది ప్రజలు నివసించగా,  2050 నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం మంది నగరాల్లో నివసిస్తారు. అవి ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఆదాయ పంపిణీ, పేదరికం, సామాజిక రక్షణలను ప్రభావితం చేస్తాయి. ఆరోగ్య సంరక్షణ, విద్య,  గృహాలు, పారిశుద్ధ్యం, నీరు, ఆహారం, శక్తికి సహకరించే ప్రయత్నాలను కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఆరోగ్యంపై సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
 
ప్రణాళికాబద్ధమైన కుటుంబ జీవనం 

నేడు విద్య, శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల యువ దంపతులు తమకు ఎప్పుడు సంతానం కావాలి, ఎంతమంది కావాలి అని నిర్ణయించుకుని తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం జరుగుతోంది. దంపతులు తాము కోరుకున్నప్పుడే, కోరుకున్నంత మంది పిల్లలను కనగలిగే వసతులు ఇప్పుడు ఉన్నాయి. తమ బిడ్డలకు చక్కని విద్యను అందించడం, ఆరోగ్యవంతమైన పరిసరాల్లో పెరిగే అవకాశం కల్పించడం తప్పనిసరి అని భావిస్తున్న తల్లిదండ్రులు, దానికి తగ్గట్లుగా తమ ఆర్థికస్థితి ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు పుట్టినట్లయితే, వారి అవసరాలను తీర్చటం తమకు కష్టమని వారు గుర్తిస్తున్నారు.

అందుకే తక్కువ సంతానంతోనే చిన్న కుటుంబంగా పరిమితం చేసుకుంటున్నారు.  అప్పుడే పిల్లలు వద్దనుకున్నా, బిడ్డల మధ్య ఎడం కావాలనుకున్నా, వాడటానికి స్త్రీ, పురుషులకు గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి అనువైనవి వారు  ఎంచుకునే అవకాశం ఉంది.  అలాగే పిల్లలు ఇక చాలు అనుకున్నాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సౌకర్యం ఉంది. ఈ పద్ధతులు నమ్మకమైనవి, సులువైనవి, సురక్షితమైనవి.  

కుటుంబ నియంత్రణ విధానాలు

 ఒక బిడ్డ కలిగిన దంపతులు కూడా కాన్పుల మధ్య 3 సంవత్సరాల ఎడం ఉండేటట్లు చూసుకోవాలి.  కుటుంబ నియంత్రణ సాధనాలలో ముఖ్యమైనవి మగవారికి నిరోధ్, ఆడవారికి నోటి మాత్రలు, కాపర్ టీ. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో,  ఉపకేంద్రాలలో ఉచితంగా లభిస్తాయి.  స్త్రీలు గర్భ నిరోధానికి వాడగల రెండు రకాల సాధనాలలో ఒకటి గర్భ నిరోధక నోటి మాత్రలు, రెండవది కాపర్ టి.  గర్భనిరోధక నోటి మాత్రలను ఋతుస్రావం ప్రారంభమైన 5వ రోజు నుంచి రోజూ  ప్రతిరాత్రి  వరుసగా వేసుకోవాలి.

ఏ మాత్ర నుంచి మొదలుపెట్టాలో ప్యాకెట్ వెనుక వివరాలు ఉంటాయి.  ఒక ప్యాకెట్ లో 28 టాబ్లెట్స్ ఉంటాయి. 21 మాత్రలు తెలుపు రంగులో, 7 మాత్రలు నలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. తెల్లరంగులో ఉన్నవి  హార్మోన్ మాత్రలు. వేరే రంగులో ఉన్నవి ఐరన్ మాత్రలు. ఒక ప్యాకెట్ అయిపోయిన వెంటనే తిరిగి రెండవ ప్యాకెట్ ప్రారంభించాలి.  గర్భిణిగా ఉన్నప్పుడు, పాలిచ్చే తల్లులు ఆరునెలల వరకు, గుండె జబ్బు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు, ఉబ్బస వ్యాధి, కాలేయపు వ్యాధులున్నవారు గర్భనిరోధక నోటిమాత్రలు వాడకూడదు.

 గ్రామీణుల్లో అపోహలు

కాపర్​ టి సురక్షితమైన పద్ధతి అయినప్పటికీ గ్రామాలలో వీటిపై అపోహలు, అనుమానాలతో  స్త్రీలు ముందుకురాక వెంట వెంటనే గర్భం ధరించడం జరుగుతోంది.  ఎక్కువ రక్తస్రావం అవుతుందని, ఈ సాధనం శరీరంలోని వేరే అవయవాలలోనికి పోతుందని కొందరు అనవసర భయాందోళనకు గురవుతున్నారు.  ఈ భయాలను విడిచి నిపుణులైన డాక్టర్ల సహాయంతో కాపర్ టీ వేయించుకుని మహిళలు సుఖ జీవనాన్ని గడపవచ్చు. మనదేశంలో ఈ సాధనాల గురించి తెలుసుకుని వాడుతున్న వారి సంఖ్య 3% మాత్రమే.  పిల్లల్ని కనే వయస్సులో ఉన్న దంపతులందరూ ఈ సాధనాల గురించి పూర్తి సమాచారం తెలుసుకుని, తగిన పద్ధతిని ఎంచుకుని 100 శాతం ఆచరణలో పెట్టాలి. 

కుటుంబ సంక్షేమం

 కుటుంబ సంక్షేమం అంటే కేవలం ఇద్దరు పిల్లలతో ఆపరేషన్​ చేయించుకోవడం మాత్రమే కాదు. దీనికంటే ముందుగా తెలుసుకోవలసినవి, చేయవలసినవి కొన్ని ఉన్నాయి.  స్త్రీకి తగిన వయస్సులోనే వివాహం, సరైన వయస్సులోనే సంతానం, కాన్పుల మధ్య ఎడం పాటించటం వల్ల ఆ సంసారంలో తల్లీబిడ్డల ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. స్త్రీలు 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు మాత్రమే సంతానోత్పత్తికి తగిన వయస్సు అని గుర్తించాలి. 

వివాహమైన తరువాత కనీసం 2 ఏండ్ల వరకు గర్భం రాకుండా జాగ్రత్త పడాలి. ఇద్దరు పిల్లల మధ్య వ్యవధి కనీసం 3 సంవత్సరాలు ఉండేలా తగిన పద్ధతులు పాటించాలి. ఈ వ్యవధి కేవలం కుటుంబ నియంత్రణ కోసమనిగాక తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు.  వెంట వెంటనే కాన్పుల వల్ల తల్లీబిడ్డల పోషణ, ఆరోగ్యాల పట్ల సరైన శ్రద్ధ  చూపలేని కారణంగా వారిద్దరూ అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఎక్కువ.  ప్రభుత్వం వివిధ కుటుంబ నియంత్రణ సాధనాలను ఉచితంగా అందజేస్తోంది. 

నాశబోయిన నరసింహ(నాన),
కవి, రచయిత, 
ఆరోగ్య విస్తరణ అధికారి