చిన్న గ్రామం.. చాలా రాష్ట్రాల ప్రజల నోళ్లలో నానుతోంది

చిన్న గ్రామం.. చాలా రాష్ట్రాల ప్రజల నోళ్లలో నానుతోంది

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠి గ్రామం పాలజ్. మహారాష్ట్రలోని బోకర్ తాలుకా పరిధిలో ఉన్న పాలజ్ ఊరి పేరు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లోని ప్రజల నోళ్లలో నానుతోంది. పాలజ్ గ్రామంలో ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడి కర్ర గణేశుడిని చూసేందుకు దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి లక్షలామంది భక్తులు వస్తుంటారు. 11 రోజుల పాటు కర్ర గణపతికి పూజలు జరుగుతాయి. ఈ కర్ర గణపయ్యను 1948లో తయారు చేయిచారు. ఏటా ఇదే విగ్రహాన్ని పాలజ్ గ్రామస్తులు ప్రతిష్ఠాపన చేసి పూజలు చేస్తారు. చివరిరోజు దగ్గరలోని వాగులో నిమజ్జనోత్సవం చేస్తారు.  తర్వాత కర్ర విగ్రహాన్ని తిరిగి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు.  వినాయక నవరాత్రుల సమయంలోనే  కర్రగణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడి ఆలయంలో గణేశుడి ఫొటో  ఉంటుంది.

స్వాతంత్య్రానికి పూర్వం పాలజ్  గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి ఊరంతా మంచం పట్టింది. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. దీంతో జనమంతా గణేశుని నమ్ముకుందాం.. అని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకంగా కర్ర గణపతిని తయారు చేయించాలని నిర్ణయించారు. నిర్మల్ లో కొయ్యబొమ్మలు చేసే నకాషీ కళాకారుడైన గుండాజీ వర్మను రప్పించి కర్ర గణేశుని విగ్రహాన్ని చేయించారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామ పెద్దలు చెబుతుంటారు. అప్పటి నుంచి కర్ర గణేశుడికి వినాయక ఉత్సవాల్లో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి ముడుపు కడితే కోరుకున్న పని జరుగుతుందని భక్తులు నమ్ముతారు.  

ముడుపులో కనపడే పాలజ్ గణేషుడి విశిష్టత
పాలజ్ గణేషుడి విశిష్టత ఇక్కడ కట్టే ముడుపులో కనబడుతుంది. భక్తులు స్వామివారిని మొక్కుకొని ముడుపులను కడుతుంటారు. వచ్చే ఏడాదిలోపు వారి కోరికలు తీరడంతో గణేష్ నవరాత్రులకు మళ్లీ వచ్చి ముడుపులు విప్పుతారు. దూర ప్రాంతాల నుంచి  భక్తులు పాదయాత్రగా పాలజ్ చేరుకొని కట్టిన ముడుపులు విప్పుతారు. ప్రత్యేకమైన ఈ ఆనవాయితీ భక్తులను ఆకట్టుకుంటోంది. దీంతో ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 2004 లో ఆలయ కమిటీ, గ్రామస్తులు చందాలు పోగు చేసి సేకరించిన కొంత మొత్తంతో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందంగా నిర్మించిన ఆలయం పూర్తయిన తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. గ్రామస్తులు కోటి రూపాయలతో అన్నదాన సత్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాలకూ పరిశుభ్రమైన నీరు అందిస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యం లో సీసీ రోడ్లు వేశారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం, అధికారుల నుంచి  సహాయం ఆశించకుండా  11 రోజులు పూజాకార్యకర్రమాలు  నిర్వహిస్తున్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు నిత్యన్నదానం, వసతి, మరుగుదోడ్లు, రక్షిత మంచినీరు బారికేడ్లు, తాగునీరు, తీర్థప్రసాదాలు అందిస్తుంటారు. తెల్లవారు జాము నుంచి  సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కరోనా వల్ల రెండేళ్ల పాటు పాలజ్ కర్ర గణపతి దర్శనం భక్తులకు కలగలేదు. ఈసారి భారీగా భక్తులు వస్తుండడంతో  దర్శనానికి అన్ని ఏర్పాటు చేశారు.