దేశంలో పొదుపు చేసేటోళ్లు తక్కువ..63శాతం మందికి అప్పులే ఉన్నయ్

దేశంలో పొదుపు చేసేటోళ్లు తక్కువ..63శాతం మందికి అప్పులే ఉన్నయ్
  • ఖాతాలు ఖాళీగానే!
  • 16 శాతం ఖాతాలు ఇనాక్టివ్​
  • ప్రతి పది మందిలో తొమ్మిది మందికి అకౌంట్లు
  • 63.3శాతం మందికి అప్పులు
  • ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఫిండెక్స్ వెల్లడి

న్యూఢిల్లీ: దేశమంతటా బ్యాంకు ఖాతాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా, చాలా మంది వాటిని వాడటం లేదని తేలింది. డిజిటల్ ​పేమెంట్స్​ కూడా వేగంగా పెరగడం లేదని వెల్లడయింది. ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఫిండెక్స్ 2025 రిపోర్ట్​ ప్రకారం, 2024 నాటికి భారతదేశంలో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. 

2011లో జనాభాలో కేవలం 35శాతం ఉన్న అకౌంట్ హోల్డర్ల సంఖ్య, 2024 నాటికి 89శాతానికి పెరిగింది. అయితే, వీటిలో 16శాతం ఖాతాలు ఇనాక్టివ్​గా ఉన్నాయి. ఇది ప్రపంచ సగటు (6శాతం) కంటే రెట్టింపు. గ్రామాల్లోని 89.2శాతం మహిళలకు ఖాతాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రాంతాల మధ్య తేడాలు  తగ్గాయి. భారతదేశంలో 88.7శాతం మంది బ్యాంకు ఖాతాలను, 23.1శాతం మంది మొబైల్ మనీ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. 

మొబైల్ ఫోన్ లేదా  కార్డుతో  లింకైన  డిజిటల్ ఖాతాలు 31.1శాతం మాత్రమే ఉన్నాయి.  ఇండియాలో డిజిటల్ ఆర్థిక సేవలు విస్తరించేందుకు ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇందుకోసం చర్యలు తీసుకోవాలి. బ్యాంకు ఖాతాల వాడకాన్ని పెంచాలంటే అన్ని వర్గాలకూ ఉపయోగపడే ఫైనాన్షియల్ ​ప్రొడక్టులను తీసుకు రావాలి. 

ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు లేవు. వారిలో సగానికి పైగా భారత్ సహా ఎనిమిది దేశాలలోనే ఉన్నారు. ఇనాక్టివ్​ ఖాతాల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం కుటుంబంలో మరొకరికి  ఖాతా ఉండడమే. 

డిజిటల్​  పేమెంట్స్​ ఇప్పటికీ తక్కువే..

 మనదేశంలో 48.5శాతం మంది మాత్రమే డిజిటల్ పేమెంట్స్ ​సేవలను వాడుతున్నారు. ఇది ఇతర మధ్య, తక్కువ - ఆదాయ దేశాల సగటు కంటే చాలా తక్కువ.  భారతదేశంలో  కేవలం 38.6శాతం మంది పొదుపు చేస్తుండగా, 63.3శాతం మంది అప్పులు తీసుకున్నారు. దీనిని బట్టి చూస్తే ప్రజల రోజువారీ ఆర్థిక జీవితంలో ఫైనాన్షియల్​ ప్రొడక్టులు పూర్తిగా భాగం కాలేదని  అర్థమవుతోంది. 

దేశంలో 66.5శాతం మందికే  పర్సనల్​ మొబైల్ ఫోన్ ఉండగా, 42శాతం మందికి మాత్రమే స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు ఉన్నాయి.  యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపులు యువతలో బాగా పాపులర్ అయ్యాయి. వీరిలో 90శాతం మంది గూగుల్​పే, ఫోన్​పే వంటి యూపీఐ యాప్స్​ను ఉపయోగిస్తున్నారు. ముసలి వారితో పోలిస్తే యువతలో  డిజిటల్ చెల్లింపుల వాడకం ఎక్కువగా ఉంది. వృద్ధుల్లో 60శాతం మంది మాత్రమే యూపీఐని వాడుతున్నారు.