మెదక్లో కోట్లు ఖర్చు చేసి కట్టిండ్రు.. వట్టిగనే వదిలేసిండ్రు

మెదక్లో కోట్లు ఖర్చు చేసి కట్టిండ్రు.. వట్టిగనే వదిలేసిండ్రు

మెదక్, శివ్వంపేట, వెలుగు: కోట్లు ఖర్చుపెట్టి కట్టిన నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా ఉపయోగంలోకి రాకపోవడంతో వృధాగా మిగులుతున్నాయి. శివ్వంపేటలో నిర్మించిన సంప్​ ఇదే కోవలోకి వస్తుంది. నర్సాపూర్​నియోజవర్గ పరిధిలోని ఏడు మండలాల గ్రామాలకు మిషన్​భగీరథ స్కీం ద్వారా మంజీరా జలాలు సరాఫరా చేసే ఏర్పాటు చేశారు. 

మూడేళ్ల కిందట తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని మంజీరా నది ఎండిపోవడంతో సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బోర్పట్ల వద్ద నిర్మించిన ఇన్​ ఫిల్టరేషన్​వెల్ లలో నీటి నిల్వ అడుగంటింది. దీంతో నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్​, హత్నూర, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం, చిలప్​చెడ్, కౌడిపల్లి మండలాల్లోని గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో పాత బోర్లకు కనెక్షన్​లు ఇచ్చి, మరికొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసే ఏర్పాటు చేశారు. అయితే సరిపోను తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ప్రత్యామ్నాయంగా

మంజీరా నీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటి బండ నుంచి పైప్ లైన్ వేసి నియోజకర్గ పరిధిలోని గ్రామాలకు గోదావరి జలాలను సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అప్పటి నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమస్యను నాటి సీఎం కేసీఆర్​దృష్టికి  తీసుకెళ్లగా కోమటిబండ నుంచి పైప్​లైన్, శివ్వంపేటలో నీటి నిల్వ  కోసం సంప్​ నిర్మించేందుకు రూ.25 కోట్లు శాంక్షన్​ చేశారు. 

ఈ మేరకు కోమటిబండ నుంచి శివ్వంపేట మండలం శభాష్​పల్లి వరకు 18 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ నిర్మించారు. నీటి నిల్వ కోసం శివ్వంపేటలో 8 లక్షల లీటర్ల కెపాసిటీతో సంపు నిర్మించారు. కోమటిబండ నుంచి పైప్​లైన్​ ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి శివ్వంపేటలో నిర్మించిన సంప్​నింపి అక్కడి నుంచి నర్సాపూర్​ పట్టణ శివార్లలోని పీర్లగుట్ట మీద నిర్మించిన వాటర్​ట్యాంక్​కు పంపింగ్​ చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు నీటిని సరఫరా చేయాలని ప్లాన్​ చేశారు. 2021లోనే పైప్ లైన్ పనులు, సంప్​ నిర్మాణం పూర్తయింది. అయితే రెండేళ్లవుతున్నా ఆ సంప్​ను వినియోగంలోకి తీసుకురావడం లేదు. 

కొన్నాళ్లుగా పైప్​లైన్, మోటర్ల సమస్య తలెత్తుతుండడంతో తరచూ బోర్పట్లలోని భగీరథ ఇన్​ఫిల్టరేషన్​వెల్​నుంచి నీటి సరఫరా నిలిచిపోతోంది. దీంతో ఆయా నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో శివ్వంపేటలో నిర్మించిన సంప్​ను వినియోగంలోకి తీసుకొస్తే తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతుండడంతో పాటు రూ.25 కోట్లతో పైప్​లైన్​, సంప్ నిర్మించినా లాభం లేకుండా పోతోంది.  

గోదావరి నీళ్లు రావడం లేదు

శివ్వంపేటలో నిర్మించిన సంప్​కు గజ్వేల్​నుంచి గోదావరి నీళ్లు రావడం లేదు. అందువల్ల దానిని ఉపయోగించడం లేదు. గోదావరి నీళ్లు వస్తే 70 గ్రామాలకు నీటి సరఫరా చేయొచ్చు. ఈ విషయంలో చర్యలు తీసుకుంటాం. 
ప్రవీణ్​, మిషన్​ భగీరథ డీఈ, నర్సాపూర్​

అధికారుల నిర్లక్ష్యం

అధికారుల నిర్లక్ష్యం వల్లే శివ్వంపేటలో నిర్మించిన సంప్​ నిరుపయోగంగా మారింది. సంప్​ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అధ్వాన్నంగా మారినా అధికారులు అటువైపు చూడడం లేదు. తరచూ భగీరథ నీటి సరఫరా నిలిచిపోతోంది. అయినా సంప్​ను ఎందుకు ఉపయోగంలోకి తేవడం లేదో అర్థం కావడం లేదు.
శ్రీనివాస్ గౌడ్​, శివ్వంపేట సర్పంచ్​