
నాగర్‌కర్నూల్, వెలుగు : మూడో సంతానం కావాలని పోరు పెడుతున్న ఓ భర్త..భార్య ఒప్పుకోకపోవడంతో కోపంతో ఆమెను, ఇద్దరు పిల్లలను చంపాలనుకున్నాడు. అయితే రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన భార్య పారిపోగా పిల్లలను గొంతుకోసి చంపాడు. తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలం కుడికిళ్లకు చెందిన ఓంకార్ ..మొదటి భార్య కృష్ణవేణి చనిపోగా కల్వకోలు గ్రామానికి చెందిన లక్ష్మీని రెండో పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. రోజూ గొడవ పెట్టుకుంటుండడంతో ఆమె ఓంకార్‌ను విడిచి పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. విజయవాడకు వెళ్లిపోయిన ఓంకార్ అక్కడ సెంట్రింగ్ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఐదేండ్ల నుంచి తన గ్రామానికే చెందిన మహేశ్వరితో విజయవాడలో కాపురం పెట్టాడు. వీరికి కూతురు చందన(3), కొడుకు విశ్వనాథ్(1) ఉన్నారు. బాబు పుట్టాక మూడో సంతానం కావాలని మహేశ్వరిని అడుగుతున్నాడు. దీనికి ఆమె ఒప్పుకోవడంలేదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉన్న ఇద్దరు పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేస్తే చాలని వాదిస్తోంది. అయినా ఓంకార్ వినడం లేదు. వారం క్రితం మహేశ్వరిని, పిల్లలను తీసుకుని కుడికిళ్లకు వచ్చాడు. అక్కడ కూడా ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేశ్వరి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం ఓంకార్ అత్తగారింటికి వచ్చి పిల్లల గొడవ వదిలేయమని తనతో రావాలని భార్యను కోరాడు. మనసు మార్చుకున్నాడనుకున్న మహేశ్వరి పిల్లలను తీసుకుని అతడితో కలిసి బైక్‌పై బయలుదేరింది. వెళ్తుండగా బైక్‌పైనే మళ్లీ పిల్లల టాపిక్ తీశాడు. ఆవేశంగా మాట్లాడుతుండడంతో మహేశ్వరికి అనుమానం వచ్చింది. తనను, పిల్లలను ఏదైనా చేస్తాడేమో అనుకుని పెద్దకొత్తపల్లి సమీపంలోకి రాగానే బైక్ పై నుంచి దూకి పారిపోయింది. ఓంకార్బండి ఆపకుండా అలాగే పోనిచ్చాడు. మహేశ్వరి కొంతమంది స్థానికుల సాయంతో పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దీంతో పోలీసులు అతడి సెల్ ఫోన్ఆధారంగా ట్రేస్ చేయడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. అంతలోనే ఎత్తం గ్రామ శివారులో ఇద్దరు పిల్లలు చనిపోయి ఉన్నారని, మరొక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నారని సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా చందన, విశ్వనాథ్ విగతజీవులుగా కనిపించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓంకార్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానాకు తరలించారు.
వాడి ముఖం చూడ
మనవడు, మనవరాలి ప్రాణాలు తీసిన ఓంకార్ ముఖం చూడనని అతడి తల్లి బాలకిష్టమ్మ శపథం చేసింది. ఐదేండ్ల కింద వెళ్లిపోయిండని, వారం కింద ఊరికి వచ్చిండని చెప్పింది. తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నా పట్టించుకోలేదని వాపోయింది. ఇప్పుడు ఇద్దరు పసి పిల్లల ప్రాణాలు తీశాడని కన్నీరు పెట్టుకుంది. .