ఎస్ఎస్ఏ ఉద్యోగుల జీతాలు పెంచాలె

ఎస్ఎస్ఏ ఉద్యోగుల జీతాలు పెంచాలె

పెద్దపల్లి, వెలుగు:  పీఆర్సీ సూచించినప్పటికీ మూడేండ్లుగా సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు జీతాలు పెంచకుండా సర్కారు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఎంప్లాయీస్​ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మహారాష్ట్రలో రూ. 32 వేలు, ఆంధ్రప్రదేశ్​లో రూ. 30,500 జీతం చెల్లిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం రూ. 19,500 మాత్రమే చెల్లిస్తున్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఫండ్స్​తో ఎస్ఎస్ఏ నిర్వహణ కొనసాగుతోంది. కేంద్రం నుంచి నిధులు వస్తున్నప్పటికీ రాష్ట్రం ఫండ్స్​ విడుదలలో జాప్యం చేస్తోంది. 2011లో ఎస్ఎస్ఏ 18 వేల మందితో ప్రారంభమైంది. ప్రస్తుతం 21 వేల మంది ఉద్యోగులున్నారు. ఇప్పటి వరకు రెండు వేల మంది వరకు వివిధ కారణాలతో చనిపోయారు. ఆ స్థానాల్లో ఎవరినీ భర్తీ చేయలేదు. ఉన్న ఉద్యోగులకే అదనపు బాధ్యతలు అప్పగించి పని చేయిస్తున్నారు. 

జీతం పెంపు విషయంలో ప్రాజెక్ట్​అప్రూవల్​బోర్డు(పీఏబీ) ప్రపోజల్స్​ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫిబ్రవరి 2021లో తెలంగాణ పీఏబీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల జీతం రూ. 15 వేల నుంచి, రూ. 21,500కు పెంచాలని ప్రపోజ్​చేసినా రాష్ట్ర సర్కార్​స్పందించలేదు. చివరకు ఉద్యోగుల ఆందోళనకు తలొగ్గి రూ.19,500కు పెంచి చేతులు దులుపుకొంది. ఉద్యోగులు ఇప్పటికీ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు. ఇటీవల మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులు చనిపోయినా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు. కరోనా టైంలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు.  ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకు ఎలాంటి సహకారం అందలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో  ప్రమాదం జరిగితే రూ. 2 లక్షలు, చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తున్నారు. ఇతర అలవెన్స్​లు అన్నీ వర్తిస్తున్నాయి. 

పీఆర్సీ కమిటీ 60 శాతం ఇయ్యమంటే..

సర్కార్​ ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ 2020లో  ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం, కాంట్రాక్టు  ఉద్యోగులకు 60 శాతం పెంపు వర్తింపజేయాలని సూచించింది. అలాగే ప్రతి సంవత్సరం రూ. 1000 పెంచాలని చెప్పింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలపడంతో ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం, అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు 30 శాతం ఇస్తామని సీఎం అసెంబ్లీలో చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగు​లకు పెంచి అమలు చేశారు. ఎస్ఎస్ఏను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఎస్ఎస్ఏలో  డాటా ఎంట్రీ ఆపరేటర్స్, మెసెంజర్స్, ఇన్​క్లూజివ్​ఎడ్యుకేషన్​రిసోర్స్​పర్సన్, ఎంఆర్​సీ, సీఆర్​పీ, పార్ట్​టైం ఇన్స్​స్ట్రక్టర్, డిస్ట్రిక్ట్​ ప్రాజెక్ట్​ ఆఫీసర్, కేజీబీవీ విభాగాలు ఉన్నాయి. వీరిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో పక్కన పెట్టేసింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్​సమయంలో సీఎం కేసీఆర్​ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిమాండ్స్​పరిష్కరించి, ఏప్రిల్​నుంచి అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన జీఓలు మాత్రం విడుదల కాలేదు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్​రూ. 42 వేలు ఇయ్యాలని డిమాండ్​ చేస్తున్నారు. 

వెంటనే డిమాండ్స్​తీర్చాలి

సీఎం చెప్పినట్లుగా వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్స్​అన్నీ తీర్చాలి. ఏప్రిల్​నుంచే ఉద్యోగులను రెగ్యులరైజ్​చేయడంతో పాటు పేస్కేల్​ అమలు చేస్తామన్నారు. వెంటనే వాటికి సంబంధించిన జీఓలు విడుదల చేయాలి. అలాగే ఉద్యోగులను వేధింపులకు గురిచేసే విధంగా ఉన్న పలు రూల్స్​ను తీసేయాలి. ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలి.
- దుండిగల్​యాదగిరి, ఎస్ఎస్ఏ జాక్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

జీతాలు పెంచాలె

సర్వశిక్ష అభియాన్​ఉద్యోగుల జీతాలు పెంచడంలో సర్కార్​ నిర్లక్ష్యం వహిస్తోంది. ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు స్కూల్​అసిస్టెంట్​ పేస్కేల్​ వర్తింపజేయాలి. లేదంటే మరోసారి ఉద్యమం చేస్తాం. 
- బాలసాని వెంకటేశం, సీఆర్పీ, పెద్దపల్లి