ఆసుపత్రులకు వెళితే టెస్టులే ఫస్ట్ 

ఆసుపత్రులకు వెళితే టెస్టులే ఫస్ట్ 
  • జ్వరంతో పోతే.. జేబులు ఖాళీ
  • టెస్ట్​లు, ట్రీట్​మెంట్​ అంటూ దోచుకుంటున్న ప్రైవేటు​ హాస్పిటళ్లు
  • వాతావరణ మార్పులతో  పెరిగిన వైరల్ ఫీవర్ లు 
  • ఇంటికో ఇద్దరు, ముగ్గురు జ్వర బాధితులు.. 
  • ప్రభుత్వ హాస్పిటళ్లలో అరకొర వసతులతో ప్రైవేటుకు వెళుతున్న జనం 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైరల్​ఫీవర్లు వణికిస్తున్నాయి.  ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఫీవర్​తో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని ప్రైవేటు హాస్పిటల్స్ క్యాష్​ చేసుకుంటున్నాయి. టెస్టులు.. ట్రీట్ మెంట్ పేరిట రూ.లక్షల్లో  బిల్లులు వేసి దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు హాస్పిటల్స్ వేస్తున్న బిల్లులతో రోగులు బెంబేలెత్తుతున్నారు. గవర్నమెంట్​ హాస్పిటల్​కు పోదామంటే అక్కడ అరకొర వసతులు ఉన్నాయి. దీంతో సరైన ట్రీట్​మెంట్​ అందుతుందో లేదోనని జనం గవర్నమెంట్ హాస్పిటల్స్​కు వెళ్లడం లేదు.  

ఆసుపత్రులకు వెళితే టెస్టులే ఫస్ట్ 

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎక్కడా లేనన్ని  ప్రైవేటు హాస్పిటళ్లు ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా జలుబు, జ్వరాలు వస్తున్నాయి. జ్వరం వచ్చిందని ప్రైవేటు హాస్పిటల్ కు వెళితే ముందుగా బ్లడ్, యూరిన్, డెంగీ..  తదితర టెస్ట్​లు చేయించాల్సిందే.  సీబీపీ రూ. 300, మలేరియా టెస్టు రూ. 300, వైడల్ టెస్టు రూ. 100, డెంగీ రూ. 1500, సీఆర్ పీ రూ. 250 వంటి టెస్టులు చేయిస్తున్నారు. డాక్టర్  ఫీజు రూ. 500, తక్కువలో తక్కువ రూ. 1500  విలువైన మందులు రాస్తున్నారు. ఇలా మొత్తంగా కలిపి జ్వరం వచ్చిందని హాస్పిటల్ కు పోతే రూ. 5వేలు వదిలించుకోవాల్సిందే. 

పిల్లల్లో ప్లేట్ లెట్స్ పడిపోతున్నయంటూ..

కరీంనగర్ లోని ప్రైవేటు చిన్న పిల్లల హాస్పిటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. కరీంనగర్ కు ఉమ్మడి జిల్లా పరిధిలోని రోగులతో పాటు మంచిర్యాల, ఆదిలాబాద్ నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడికి తీసుకువచ్చిన పిల్లల్లో ఎక్కువ శాతం ప్లేట్ లెట్స్ కౌంట్ తక్కువగా ఉందని రిపోర్టులు చూపుతున్నాయి. రిపోర్టులు చూడగానే తల్లిదండ్రుల్లో ఆందోళన స్టార్ట్​ అవుతోంది. ప్లేట్ లెట్స్ కౌంట్ తక్కువగా ఉంది..  పిల్లాడికి ట్రీట్ మెంట్ అందించాలంటూ హాస్పిటల్​ సిబ్బంది హడావుడి చేస్తున్నారు. ట్రీట్ మెంట్  ఇస్తున్నామని చెప్పి.. అడ్డగోలు మందులు రాస్తూ.. కనీసం ఐదారురోజులు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. స్పెషల్ అబ్జర్వేషన్ లో ఉంచాలంటూ రోజుకు కనీసం రూ. 4వేల బిల్లు వేస్తూ వారం పాటు సుమారు రూ. 50వేలు దండుకుంటున్నారు.  

సర్కారు దవాఖానాల్లో అధ్వానం... 

జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన హాస్పిటల్​లోని  చిన్న పిల్లల వార్డులో  దాదాపుగా అన్ని బెడ్లు నిండిపోయాయి.  ఇక్కడికి వచ్చే పిల్లల్లో కూడా ఎక్కువ మందికి ప్లేట్ లెట్స్ కౌంట్ తక్కువగా ఉంటున్నది.  వాంతులు, విరేచనాలు అవుతున్న వారే ఎక్కువగా వస్తున్నారు.  ఇక్కడ  అడ్మిట్ అయిన పిల్లలకు రోజుకు రెండు సార్లు రౌండ్స్ కు రావాల్సి ఉండగా ఎప్పుడో ఒకసారి మాత్రమే వచ్చి పరీక్షిస్తున్నారు. కౌంట్ తక్కువగా ఉన్న పిల్లలకు ప్లేట్ లెట్స్ కావాలన్నా కూడా టైం కు ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా  పేషెంట్ కు సంబంధించిన వారు వచ్చి ప్లేట్ లెట్స్ ఇస్తేనే పిల్లలకు ఇచ్చే పరిస్థితి నెలకొంది.  బ్లడ్ బ్యాంకులో ప్లేట్ లెట్స్ అందుబాటులో లేవు. దీంతో పిల్లల పేరెంట్స్ ఇతరులపై ఆధార పడాల్సి వస్తోంది. చిన్నపిల్లల సిరప్​లు ఎక్కువగా బయటకే రాస్తున్నారు. ఓన్డమ్, , డోమ్​పెరిడన్​ వంటి సిరప్ లు హాస్పిటల్ లో లేవు.. బయటి నుంచే తెచ్చుకోవాలంటూ తల్లిదండ్రులకు చెబుతున్నారు.  గత్యంతరం లేక బయట కొంటున్నారు. ఏటా లక్షల రూపాయలు హాస్పిటల్స్ కు ఫండ్స్ వస్తున్నా.. పిల్లలకు సంబంధించిన మందులు లేకపోవడం గమనార్హం. 

‘నిజమాబాద్ జిల్లా భీంగల్ మండలానికి చెందిన భూక్యా శంకర్ కొడుకుకు జ్వరంతో పాటు  ఊపిరితిత్తుల్లో నంజు వచ్చింది. జగిత్యాల, మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటళ్లలో చూపించినా  తగ్గలేదు. డాక్టర్లు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు.  అక్కడా తమ వల్ల కాదంటూ వరంగల్ ఎంజీఎం కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. వరంగల్ కు తీసుకెళ్లినా  అక్కడా సరైన ట్రీట్​మెంట్​అందుతుందో లేదో అని భయపడిన శంకర్​ తన కొడుకును కరీంనగర్​లోనే ఓ ప్రైవేటు హాస్పిటల్​లో జాయిన్ చేశాడు. ఎనిమిది రోజుల తర్వాత ఆ బాలుడు  కోలుకున్నాడు.  హాస్పిటల్​యాజమాన్యం టెస్టులు.. ట్రీట్ మెంట్.. మందులకు సుమారు  రూ. 1.30లక్షల బిల్లు వేసింది. దీంతో శంకర్​కు ఆ బిల్లు చూసి గుండె గుబిల్లుమంది’.