
- సిటీపై సన్‌స్ట్రోక్.. పెరుగుతున్న డీహైడ్రేషన్, ఫీవర్, డయేరియా బాధితులు
- ఎండకు ఉక్కిరిబిక్కిరై హాస్పిటళ్లకు క్యూ కడుతున్న జనం
- ఉదయం 9 గంటల నుంచే మొదలవుతున్న వేడిమి
- జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: సిటీలో తీవ్రమైన ఎండలు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 – 10 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో వేడిమిని తట్టుకోలేక అల్లాడుతున్నారు. గత 15 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలోని గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటళ్లకు వడదెబ్బ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. మండిపోతున్న ఎండల దెబ్బకు తలనొప్పి, ఒళ్లు మంటలు, డీహైడ్రేషన్, ఫీవర్, డయేరియా వంటి సమస్యలతో జనం డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు.
నిలోఫర్, గాంధీ, ఏరియా హాస్పిటళ్లకు సాధారణ రోజులతో పోలిస్తే ఓపీలు పెరిగాయి. ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్అయినవారిని ఇన్పేషెంట్లుగా అడ్మిట్ చేసుకొని ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్లో ప్రస్తుతం 24 మంది డయేరియాతో బాధపడుతూ ట్రీట్ మెంట్ పొందుతున్నారు. సాధారణ రోజుల్లో ఇక్కడ 10 మందిలోపు మాత్రమే ఉంటారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు తాకిడి పెరిగింది. చిన్న చిన్న క్లినిక్ ల నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల వరకు అన్నింటికి వడదెబ్బ కేసులు వస్తున్నాయి. కనీసం నాలుగైదు కేసులు వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. వర్షాలు కురవడం, తర్వాత ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం ఆస్పత్రుల పాలవుతున్నారని అంటున్నారు.
అన్నిచోట్ల ఎండ బాధితులే
నిలోఫర్ హాస్పిటల్‌కు రెగ్యులర్ గా వచ్చే కేసులతోపాటు గత కొద్దిరోజులుగా వందకిపైగా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.15 రోజుల ముందు వరకు డైలీ 600 నుంచి 700 మంది వస్తుండగా, ఎండలు పెరిగాక 800లకిపైగా ఓపీలు ఉంటున్నాయి. ఇక ఫీవర్ హాస్పిటల్‌కు ఓపీలు తగ్గినప్పటికీ వస్తున్న కేసుల్లో డయేరియా, ఫీవర్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. గాంధీకి రెగ్యులర్ ఓపీలతో పాటు జనరల్ ఫిజీషియన్ ఓపీలు పెరిగాయి. గోల్కొండ, నాంపల్లి, మలక్ పేట, కొండాపూర్ ఏరియా హాస్పిటళ్లకు డైలీ ఐదారు వందల మంది పేషెంట్లు వస్తున్నారు. వీరిలో ఎక్కువగా టెంపరేచర్ తట్టుకోలేక, డీ హైడ్రేషన్ కి గురైన వారే ఉంటున్నారు.
మరింత పెరిగే ఛాన్స్
రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సిటీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో మంచినీరే దివ్య ఔషధమని చెబుతున్నారు. వేడిమికి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుందని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ కు గురైతే ఓఆర్‌ఎస్ తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి, బట్టలు వదులు చేసి(25-–30 డిగ్రీల)నీళ్లతో తడపాలని, ఇలా చేస్తే రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుందంటున్నారు. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్‌ప్యాక్ లు పెట్టాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
డాక్టర్లు, నిపుణుల సూచనలు
- ఎండలో బయటికి వెళ్లేవారు క్యాప్‌లు, స్కార్ఫ్‌లు వాడాలి.
- మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం.
- ప్రతి అర్ధ గంటకు 300 మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. ఓఆర్‌ఎస్, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ తీసుకోవటం మంచిది.
- ఫ్రూట్స్ తినడంతోపాటు జ్యూస్‌లు తాగుతుండాలి. ఉప్పుతో కూడిన ద్రవాలు తీసుకోవాలి. చెమటను గ్రహించే, చల్లగా ఉండే వదులైన కాటన్ బట్టలు ధరించాలి
- కూల్‌డ్రింక్స్ అంత మంచిది కాదు. వాటికి బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగడం ఉత్తమం.
హార్ట్, కిడ్నీ పేషెంట్లు ఎండలో తిరగొద్దు
వడదెబ్బకు గురైన వారి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. వాంతులు, అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అవసరమైన వారిని అడ్మిట్ చేసుకుని ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. హార్ట్, కిడ్నీ పేషెంట్లు ఎండలో తిరగకపోవడమే బెటర్.
- డాక్టర్ విజయభాస్కర్, రవి హెలీయోస్ హాస్పిటల్
బయటికెళ్తే వాటర్ బాటిల్ మస్ట్
వడదెబ్బకు గురైన వారు ఫీవర్హాస్పిటల్కు వస్తున్నారు. ట్రీట్ మెంట్ అందించి జాగ్రత్తలు చెబుతున్నాం. ఉదయం 10 గంటల తర్వాత బయటికి వెళ్లేవారు చిన్న చిన్న జాగ్రత్తలతో వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలా చూసుకోవాలి. తరచూ వాటర్ తాగుతూ ఉండాలి.
డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్