మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సిద్దిపేట కోమటి చెరువు వద్ద  నెక్లెస్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వేడుకలకు మంత్రి హరీశ్​ రావు, ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,  జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, సీపీ శ్వేత, చైర్ పర్సన్ మంజుల రాజనర్సు​ హాజరయ్యారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా డీజే టిల్లు సినిమా ఫేమ్ సిద్ధు జొన్నల గడ్డ సెంటర్ ఆఫ్​ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డు రెండో దశ పనులతో పాటు  360 డిగ్రీ సెల్ఫీ వీడియో, ఫొటో బూత్ ను మంత్రి హరీశ్​రావు  ప్రారంభించారు.  సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ డాక్టర్ శరత్ హాజరై డప్పు వాయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ కలెక్టరేట్​లో బాణాసంచా పేల్చి వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అడిషనల్​ కలెక్టర్లు రమేశ్,  ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. రామాయంపేట, పెద్దశంకరంపేట, తదితర పట్టణాలు భారీ జాతీయ జెండాలను ప్రదర్శించారు. 

‘మన ఊరు -మనబడి’ పక్కాగా అమలు చేయాలి

సిద్దిపేట, వెలుగు :  మన ఊరు మన బడి  కార్యక్రమాన్ని  సిద్దిపేట నియోజకవర్గంలో   పక్కాగా అమలు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం క్యాంపు ఆఫీస్​లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఈవో శ్రీనివాస్​రెడ్డితో కలసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలవారీగా పాఠశాలల్లో అదనపు గదులు, వసతులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.  స్కూల్స్ ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు, పథకం అమలుపై అధికారుల చర్యలు, అధికారుల పనితీరు, తదితర అంశాలపై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల తరగతి గదులను రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు. మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో నిరంతరం నీరు, మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా తో పాటు , ఫర్నీచర్, ప్రహరీ, వంట గది, అదనపు గదులు, డిజిటల్ క్లాస్ రూమ్ లు కల్పించాలని సూచించారు.  అదనపు నిధులు అవసరం ఉన్న పాఠశాలల జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మరో మూడు నెలల్లో మన ఊరు -మనబడిలో భాగంగా  చేపట్టిన పనులు పూర్తి చేయాలన్నారు. 

జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలి

మెదక్​టౌన్​/సిద్దిపేట రూరల్, వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా 16న ఉదయం 11:30 గంటలకు  నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో జిల్లా ప్రజలు పెద్ద  సంఖ్యలో పాల్గొని సక్సెస్​ చేయాలని మెదక్​కలెక్టర్​ హరీశ్, సిద్దిపేట సీపీ ఎన్. శ్వేత పిలుపునిచ్చారు. ఇదే విషయమై జిల్లాలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో అధికారులు మూడు రోజుల నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారని తెలిపారు. 

16న కవి సమ్మేళనం 

వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 16న మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో సాయంత్రం 4 గంటలకు ‘స్వాతంత్ర్య స్ఫూర్తి - వజ్రోత్సవ దీప్తి’ అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు కలెక్టర్​ హరీశ్​ తెలిపారు. సమ్మేళనానికి జిల్లాలోని కవులు, కళాకారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్ల పరిశీలన

సిద్దిపేట, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక డీగ్రీ కాలేజీ గ్రౌండ్​లో  నిర్వహించే వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ శ్వేత ఆదివారం పరిశీలించారు.  వర్షం కురిసే అవకాశం ఉన్నందున కార్యక్రమానికి వచ్చే వారు తడువకుండా వాటర్ ప్రూఫ్ షామియానాలు  వేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయానికి వేడుకలు నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్​ ఖాన్,   ఏసీపీ మహేందర్, ఆర్డీవో అనంతరెడ్డి, డీఈవో శ్రీనివాస్​రెడ్డి,  తహసీల్దార్​ విజయ సాగర్, డీపీఆర్వో రవికుమార్, ఐ అండ్​ పీఆర్ డీఈ తిరుపతి నాయక్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నర్సాపూర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా నాయకుడు వెల్మకన్న రాజేందర్ అన్నారు. కౌడిపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలు వస్తేనే ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఫండ్స్​ కేటాయిస్తోందన్నారు. దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఇందుకు నిదర్శనమన్నారు. త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం కోసం కోట్ల నిధులను కేటాయిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి, మాయ మాటలు చెప్పి ప్రజల ఓట్లతో గెలిచాక మరిచిపోవడం టీఆర్ఎస్ కు కొత్త కాదన్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు రాకేశ్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, మహిపాల్, లక్ష్మణ్, రాజు ఉన్నారు. 

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

సంగారెడ్డి/పుల్కల్/గజ్వేల్, వెలుగు : దేశంలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్  దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం చౌటకూర్ మండలంలోని శివ్వంపేట నుంచి చౌటకూర్ మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్​ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈనెల 9న సదాశివపేట మండలం ఆరూర్ వద్ద చేపట్టిన పాదయాత్ర సంగారెడ్డి కి చేరుకోగా మొత్తం 75 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గజ్వేల్​ నియోజవకర్గంలో చేపట్టిన ముగింపు పాదయత్రలో మాజీ ఎంపీ, జిల్లా పార్టీ ఇన్​చార్జి అంజన్​కుమార్​ యాదవ్​, గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నాయకులు గాలి  అనిల్​కుమార్ పాల్గొన్నారు.

నిరుద్యోగులను నిండాముంచుతున్న కేసీఆర్

పాపన్నపేట, వెలుగు : నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా కొట్లాడి  తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్​ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పి పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని, కేసీఆర్ మాత్రం తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పొలిటికల్ ఉద్యోగాలు కల్పించారని మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ధోరణి మారాలని, ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు యువత తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

పార్ట్ బీ సమస్య పరిష్కరించాలి

మెదక్ (శివ్వంపేట), వెలుగు : పార్ట్​బీ సమస్య పరిష్కరించాని రైతులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డికి మొరపెట్టుకున్నారు. ఆదివారం శివ్వంపేటలో భగుళాముఖి ఆలయానికి మంత్రి వచ్చిన సందర్భంగా స్థానిక రైతులు ఆయనను కలిసి  మాట్లాడారు. సర్వే నంబర్​ 315, 316లో ఉన్న 1,200 ఎకరాలు పార్ట్- బీలో పెట్టడంతో తమకు రైతు బంధు, రైతు బీమా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జడ్పీటీసీ మహేశ్​గుప్తా ఆధ్వర్యంలో రైతులు మంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

దుర్గమ్మ ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం చాలా రోజులుగా జలదిగ్బంధంలో ఉండి ఆదివారం ఓపెన్​ కావడంతో భక్తులు రద్దీ భారీగా పెరిగింది. మంజీరా నదీ పాయలలో స్నానాలు చేసి దుర్గమ్మ ను దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ ఆఫీసర్లు, పాలక మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

- పాపన్నపేట, వెలుగు