ఐక్యరాజ్యసమితి వేదికపై పాక్, చైనాలకు భారత్ చురకలు

ఐక్యరాజ్యసమితి వేదికపై పాక్, చైనాలకు భారత్ చురకలు

అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. భారత్ పట్ల పాక్, చైనా తీరుపై విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జై శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని పరోక్షంగా చైనా, పాకిస్థాన్‌లపై జైశంకర్ ఘాటు విమర్శలు చేశారు.

పాక్ పై ఆగ్రహం..

ఐక్య రాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. దీనికి భారత్‌ గట్టిగా బదులిచ్చింది. బిన్‌ లాడెన్‌ లాంటి  ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారికి....భారత్ పార్లమెంట్‌ దాడికి పాల్పడిన వారికి యునైటెడ్ నేషన్స్ వంటి వేదికపై శాంతి వ్యాఖ్యలు బోధించే అర్హత లేదని జైశంకర్ చురకలంటించారు. ఉగ్రవాద నిర్మూలనకు అనేక దేశాలు బాధ్యతగా వ్యవహరిస్తుంటే..కొన్ని దేశాలు మాత్రం ఉగ్రవాదులను సమర్ధించేలా.. వారిని రక్షించేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఆర్టికల్ 370 రద్దు అంతర్గత వ్యవహారం..

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని జైశంకర్‌ అన్నారు. ఈ విషయాన్ని పాక్ అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు. భారత్ పై వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలని హితవు పలికారు. ఉగ్రవాదం, శత్రుత్వం, హింసకు తావులేని ఇస్లామాబాద్ తో సంబంధాలు కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 

చెనాకు చురకలు..

ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చాలనే ప్రతిపాదనకు చైనా వీటో అధికారంతో అడ్డుపడటంపై జై శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  కరోనా, పర్యావరణ మార్పు, ఉగ్రవాదం వంటి వాటిపై ఐక్యరాజ్యసమితి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా వంటి దేశాలు.. విశ్వసనీయమైన పాత్రను భద్రతా మండలిలో కొనసాగించాలని సూచించారు. వారు భాగస్వామ్యం పంచుకోకుంటే భవిష్యత్ సంబంధించిన అంశాలపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేమని జైశంకర్ వ్యాఖ్యానించారు.