క్యూ 3 జీడీపీ గ్రోత్​ @ 4.4 శాతం

క్యూ 3 జీడీపీ గ్రోత్​ @ 4.4 శాతం

న్యూఢిల్లీ: అక్టోబర్​– డిసెంబర్​2022 క్వార్టర్లో గ్రాస్​ డొమెస్టిక్​ ప్రొడక్ట్​ (జీడీపీ) గ్రోత్​ 4.4 శాతానికి తగ్గింది. తాజా క్యూ 3 డేటాను మినిస్ట్రీ ఆఫ్​ స్టాటిస్టిక్స్​ అండ్​ ప్రోగ్రామ్​ ఇంప్లిమెంటేషన్​ మంగళవారం రిలీజ్​ చేసింది. రేట్లను అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) వడ్డీ రేట్లను పెంచడం వల్లే గ్రోత్​ రేటు తగ్గినట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి రెండు క్వార్టర్లతో పోలిస్తే ఈ గ్రోత్​ రేటు బాగా తక్కువ. ఏప్రిల్– జూన్​ 2022 మధ్యలో మన జీడీపీ 13.2 శాతం గ్రోత్​ రేటును, జులై – సెప్టెంబర్​ మధ్యలో 6.3 శాతం గ్రోత్​ రేటును సాధించింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో గ్రోత్​ బాగా తక్కువ ఉండటం వల్ల 2022–23 మొదటి క్వార్టర్లో గ్రోత్​ రేటు ఎక్కువగా రికార్డయింది. 2022–23 ఫైనాన్షియల్​ ఇయర్​కు జీడీపీ గ్రోత్​ రేటు 7 శాతంగా ఉంటుందని మంగళవారం స్టాటిస్టిక్స్​ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ గ్రోత్​ రేటు 6.8 శాతానికి మించకపోవచ్చని ఆర్​బీఐ అంచనా వేసిన విషయం తెలిసిందే. నిలకడైన ధరల వద్ద క్యూ 3 జీడీపీ రూ. 40.19 లక్షల కోట్లని స్టాటిస్టిక్స్​ మినిస్ట్రీ డేటా తెలిపింది. అంతకు ముందు ఏడాది (2021–22) క్యూ 3 లో ఈ జీడీపీ రూ. 38.51 లక్షల కోట్లు. అంటే క్యూ 3 లో 4.4 శాతం పెరిగినట్లు. అదేవిధంగా, ప్రస్తుత రేట్ల వద్ద జీడీపీ లెక్కిస్తే అది రూ. 69.38 లక్షల కోట్లని మినిస్ట్రీ డేటా పేర్కొంది. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లో ఈ జీడీపీ రూ. 62.39 లక్షల కోట్లు మాత్రమేనని, దీంతో పోలిస్తే ఈ క్యూ 3 లో 11.2 శాతం పెరిగినట్లవుతుందని వివరించింది. 
తగ్గిన కన్జూమర్​ డిమాండ్​, 

ఎగుమతులూ కారణాలే..

రేట్లను కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను పెంచడమే జీడీపీ గ్రోత్​ రేటు తగ్గడానికి ప్రధానమైన కారణమని చెబుతున్నారు. ఇదే కాకుండా, మరి కొన్ని కారణాల వల్లా జీడీపీ జోరు తగ్గింది. ఎగుమతులలో స్లోడౌన్​, దేశంలో కన్జూమర్​ డిమాండ్​ తగ్గడం వంటి కారణాలు కూడా జీడీపీ నెమ్మదించడానికి కారణాలేనని పేర్కొంటున్నారు. ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తే, కన్జూమర్​ డిమాండ్​ తగ్గడానికి వడ్డీ రేట్లు పెంచడమే కారణంగా నిలుస్తుంది.  గ్లోబల్​గా వివిధ దేశాల సెంట్రల్​ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో ఆయా దేశాలలో డిమాండ్​ తగ్గడం వల్ల మన ఎగుమతులు నెమ్మదించాయి.

వ్యవసాయం నిలబెట్టింది..

మూడో క్వార్టర్​లో తయారీ రంగం​ 1.1 శాతం కుచించుకుపోయిందని, ఇదే సమయంలో వ్యవసాయ రంగం ​3.7 శాతం గ్రోత్​ రేటు సాధించిందని డేటా వెల్లడిస్తోంది. 2022-23 మూడో క్వార్టర్లో మైనింగ్​ సెక్టార్​ ఊపందుకుందని, ఈ రంగం 3.7 శాతం గ్రోత్​రేటును రికార్డు చేసిందని పేర్కొంది. ఎలక్ట్రిసిటీ, కన్​స్ట్రక్షన్​సెక్టార్లూ వరసగా 8.2 శాతం, 8.4 శాతం చొప్పున గ్రోత్​ సాధించినట్లు మినిస్ట్రీ డేటా తెలిపింది. కానీ, హోటల్స్​‌‌‌‌-ట్రాన్స్​పోర్ట్​ సెక్టార్​ గ్రోత్​ రేటు 9.7 శాతానికి పడిపోయింది. మరోవైపు రియల్​ ఎస్టేట్​ సెక్టార్​ 5.8 శాతం పెరగగా, డిఫెన్స్​ సెక్టార్​ 2 శాతం గ్రోత్​ను రికార్డు చేసింది.


జనవరిలో కోర్​ సెక్టార్​ 7.8 శాతం పెరిగింది...

మరోవైపు డిసెంబర్​2022 తో పోలిస్తే జనవరి 2023 లో కోర్​ సెక్టార్ ​గ్రోత్​ 7.8 శాతానికి పెరిగింది. అంతకు ముందు నెల అంటే డిసెంబర్​ 2022 లో కోర్​ సెక్టార్​ గ్రోత్​ 7 శాతంగా రికార్డయింది. కోల్​, ఫెర్టిలైజర్​, ఎలక్ట్రిసిటీ అవుట్​పుట్​ పెరగడం వల్లే జనవరిలో కోర్​సెక్టార్​ గ్రోత్​ పెరిగినట్లు స్టాటిస్టికల్​ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్​ ఏకంగా 17.9 శాతం పెరగ్గా, కోల్​ ప్రొడక్షన్​ 13.4 శాతం, ఫెర్టిలైజర్​ ప్రొడక్షన్​ 12 శాతం చొప్పున పెరిగింది. ఇక స్టీల్​ సెక్టార్​ అవుట్​పుట్​ 6.2 శాతం, నేచురల్​ గ్యాస్​ అవుట్​పుట్​ 5.3 శాతం, సిమెంట్​ అవుట్​పుట్​ 4.6 శాతం చొప్పున పెరిగాయి. ఎనిమిది కోర్ సెక్టార్లలో ఒక్క సెక్టార్​ మాత్రమే నెగిటివ్​ గ్రోత్​ కనబరిచిందని, క్రూడ్​ ఆయిల్​ అవుట్​పుట్​ జనవరి 2023 లో 1.1 శాతం తగ్గిపోయిందని డేటా తెలిపింది. ఏప్రిల్​2022 నుంచి జనవరి 2023 దాకా 10 నెలలకు కలిపి చూస్తే కోర్​సెక్టార్లు 7.9 శాతం గ్రోత్​ సాధించాయని కూడా స్టాటిస్టికల్​ మినిస్ట్రీ డేటా పేర్కొంది. నవంబర్​, డిసెంబర్​2022 నెలలతోపాటు, జనవరి 2023 లోనూ కోర్​ సెక్టార్లు పాజిటివ్​గ్రోత్​ చూపించడమంటే, దేశంలో ఇండస్ట్రియల్​ ప్రొడక్షన్​ పుంజుకున్నట్లే. అంతకు ముందు అక్టోబర్​ 2022 నెలలో ఎనిమిది కీలక సెక్టార్ల అవుట్​పుట్​ 0.1 శాతం తగ్గిపోయింది.