నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వజ్రోత్సవాలు

పలు చోట్ల ముగ్గుల పోటీలు, ర్యాలీలు

నిజామాబాద్, వెలుగు: మన దేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి చెప్పారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని  జిల్లా కేంద్రంలో శనివారం  జమైతుల్ ఉలేమా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముస్లింలు  ర్యాలీ నిర్వహించారు. స్థానిక  బోధన్ రోడ్ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, ఆర్టీసీ న్యూ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌‌‌‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వజ్రోత్సవాల్లో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. భారతీయులంతా ఒక్కటేనని.. దేశాభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని మైనార్టీలు చాటి చెప్పారన్నారు. హిందూ, ముస్లిం అనే భేదాలు లేకుండా జిల్లాలో అన్ని మతాలకు చెందిన వారు పరస్పరం కలిసి మెలిసి జిల్లా ప్రగతికి పోటీపడుతుండడం అభినందనీయమన్నారు. ర్యాలీలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జమైతుల్ ఉలేమా ప్రతినిధులు హాఫీజ్ లాయఖ్ అలీ, మౌలానా ఖిజర్, ఖయ్యుం షాకిర్, ఆబిద్ ఖాస్మి, ఇస్మాయిల్, షుకూర్, అఫ్జల్ పాల్గొన్నారు.

దేశభక్తిని చాటిన మహిళలు

నిజామాబాద్ టౌన్, వెలుగు: వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌‌‌‌లో నిర్వహించిన ముగ్గుల పోటీలు మహిళల్లోని సృజనాత్మకతను ఆవిష్కరించాయి. ఈ పోటీల్లో యువతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తి, జాతీయతా భావం ఉట్టిపడే రీతిలో అందమైన ముగ్గులు వేశారు. నగర మేయర్‌‌‌‌‌‌‌‌ నీతూ కిరణ్‌‌‌‌ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో భవానీ, స్వప్న, లావణ్య నిలువగా ప్రణవి, వినీషా, సుస్మితకు కన్సోలేషన్ ప్రైజ్‌‌‌‌లు దక్కాయి. ఈ ప్రోగ్రామ్‌‌‌‌కు జడ్పీ చైర్మన్‌‌‌‌ దాదన్నగారి విఠల్‌‌‌‌రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌లుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఝాన్సీ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి శశికళ పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎఫ్ కోసం పోరాడుతాం

బోధన్, వెలుగు: నిజాం షుగర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ (ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌) సాధన కోసం రాజకీయాలతీతంగా పోరాటం చేస్తామని బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌ వడ్డి మోహన్‌‌‌‌రెడ్డి చెప్పారు. శనివారం బోధన్​ మండలంలోని తగ్గెల్లి, హున్సా, మందర్నా, ఖజాపూర్ గ్రామాల్లో గడపగడప బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం హున్సాలో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో మోహన్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని హున్సా, మందర్నా, ఖజాపూర్​ గ్రామాల్లో ఎక్కువగా చెరుకును పండించే రైతులు ఉన్నారన్నారు. నేటికీ 300 నుంచి 400 ఎకరాల్లో చెరుకును పండిస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఫ్యాక్టరీని మూసివేయడంతో రైతులు చెరుకును మహారాష్ట్ర, జహీరాబాద్ వంటి దూరప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే 100 రోజుల్లో నిజాం షుగర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని  సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారన్నారు. రుణమాఫీ, ఎస్సీలకు మూడెకరాల భూమి, డబుల్​బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్​ బెడ్​ రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తున్నా, బోధన్‌‌‌‌లో ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రాబోవు రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గవర్నమెంట్ వస్తే ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తామని చెప్పారు.

ప్రైవేట్‌‌ కాలేజీల్లో ‘పీహెచ్‌‌డీ’లు వద్దు

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్‌‌‌‌డీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం దారుణమని ఎస్ఎఫ్ఐ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ముస్తాఫా అన్నారు. శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో టీయూ బాయ్స్ హాస్టల్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రిసెర్చ్‌‌‌‌లను వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ కాలేజీల్లో ప్రొఫెసర్లు ఎప్పుడు కాలేజీలు మారుతారో తెలియదని, అలాంటి చోట పీహెచ్‌‌‌‌డీలు చేయడం ఏలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలా చేస్తే పరిశోధనల్లో నాణ్యత దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  లీడర్లు శేషు, లక్ష్మణ్, సాయి, వినోద్, నవీన్ పాల్గొన్నారు.

అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రిజిస్ట్రార్ల మార్పు

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: తాను చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే టీయూ వీసీ రవీందర్‌‌‌‌‌‌‌‌ గుప్తా వర్సిటీలో రిజిస్ట్రార్లను మారుస్తున్నారని ఏబీవీపీ వర్సిటీ ప్రెసిడెంట్ శివ ఆరోపించారు. శనివారం టీయూలో నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ వర్సిటీలో స్టూడెంట్లు అవస్థలు పడుతుంటే వీసీ రాజభోగాలు అనుభవిస్తున్నాడన్నారు. వర్సిటీ నెలకొల్పి 16 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. ఉన్న కాస్త నిధులను కూడా ఆఫీసర్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలలకోసారి ఈసీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా.. 10 నెలలుగా ఆ ఊసే లేదన్నారు. వెంటనే ఈసీ సమావేశం నిర్వహించాలని డిమాండ్​చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వీసీని బర్తారఫ్ చేసి వర్సిటీ ప్రతిష్టను కాపాడాలన్నారు. సమావేశంలో లీడర్లు సాయికృష్ణ, నవీన్, సందీప్, ప్రమోద్, చక్రి పాల్గొన్నారు.

ఆ కాలేజీలను రద్దు చేయాలని ఆందోళన

నిజామాబాద్ టౌన్, వెలుగు: శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నగరంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాయి. పీడీఎస్‌‌‌‌యూ, టీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చౌరస్తా, గిరిరాజ్‌‌‌‌ కాలేజీ చౌరస్తా వద్ద వేర్వేరుగా కార్పొరేట్ కాలేజీల దిష్టిబొమ్మలను దహనం చేశారు.  పీడీఎస్‌‌‌‌యూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్ కల్పన, ప్రధాన కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు అశోక్, అజయ్, నవీన్, టీవీపీ నాయకులు శశాంక్, మనోజ్, సందీప్, ప్రవీణ్ పాల్గొన్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్, వెలుగు: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌‌‌‌యూ ఆర్మూర్ ఏరియా ప్రెసిడెంట్ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. శనివారం స్టూడెంట్లతో కలిసి ర్యాలీ నిర్వహించి ఆ కాలేజీల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అనిల్‌‌‌‌ మాట్లాడుతూ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌‌‌‌యూ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, మహిళా కమిటీ కన్వీనర్ దేవిక, మమత, నాగరాజు, విజయలక్ష్మి, గౌరి, దీపిక, నాగేశ్వరి పాల్గొన్నారు.