
భారత్ తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. లేటెస్టుగా అణ్వస్త్ర సహిత అగ్ని ప్రైమ్ మిస్సైల్ ను పరీక్షించింది. అనుకున్నట్లుగానే అది లక్ష్యాన్ని ఛేదించడంతో డీఆర్డీవో వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. అగ్ని ప్రైమ్ క్షిపణి..వాస్తవానికి రెండు ప్రధాన క్షిపణుల శక్తిసామర్థ్యాల కలయిక అని చెప్పాలి. అగ్ని-4, అగ్ని-5 క్షిపణుల్లోని టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అగ్ని ప్రైమ్ కు తయారు చేశారు. అగ్ని-1 మిస్సైల్ కంటే ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది.
ప్రధానంగా అగ్ని ప్రైమ్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. ఎక్కువగా 1,500 కిమీ దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలదు. 1000 కిమీ దూరం వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. అగ్ని ప్రైమ్ క్షిపణిని తాజాగా ఒడిశా తీరప్రాంతంలో పరీక్షించారు. అన్నివిధాలుగా డీఆర్డీవో నిర్దేశించిన ప్రమాణాలను ఇది అందుకోవడంతో.. పరీక్ష విజయవంతం అయినట్టు ప్రకటించారు.