దూసుకెళుతోన్న ఇండియన్​ ఎకానమీ

 దూసుకెళుతోన్న ఇండియన్​ ఎకానమీ

కరోనా భయాలు.. ఆర్థిక మాంద్యం టెన్షన్లు.. వృద్ధిరేటు తగ్గుదల.. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా ఇండియన్​ ఎకానమీ దూసుకెళుతోంది. ఒకప్పుడు మనల్ని పాలించిన దేశం బ్రిటన్​ను కూడా వెనక్కి నెట్టి ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్​) 2021 మొదటి క్వార్టర్ ​లెక్కలను పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు ప్రపంచంలో టాప్-5 ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీతోపాటు ఇండియా ఉన్నాయి. యూకే ఆరో స్థానంలోకి వెళ్లింది. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ సైజు 854.7 బిలియన్ డాలర్లు. యూకే ఎకానమీ సైజు 816 బిలియన్ డాలర్లే. పదేండ్ల క్రితం వరకు మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉండగా, యూకే 5వ స్థానంలో ఉండేది. ఇదిలా ఉంటే మనదేశం మరికొన్ని సంవత్సరాల్లో టాప్-3 ఎకానమీగా ఎదుగుతుందని ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్టు అంచనా వేసింది.

న్యూఢిల్లీ: ఇండియా ఆర్థిక వ్యవస్థ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.  కరోనా కష్టాలను దాటుకొని ఎకనమీని పరుగులు పెట్టించడంతో ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎకనమీగా ఉన్నది కాస్తా ఇప్పుడు ఐదో ర్యాంకుకు ఎదిగింది. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్నదంటూ ఎకనమిస్టులు ఆందోళన చెందుతుండగా, ఇండియా ఈ ఖ్యాతిని సొంతం చేసుకోవడం విశేషం.  ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటన్​ఆర్థిక వ్యవస్థను  వెనక్కి నెట్టేసింది. ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​) ఈ 2021 మొదటి క్వార్టర్​లో లెక్కలను పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించింది. ఇండియా ఎకనమీ గ్రోత్​రేటును పరిశీలిస్తే  ఇక ముందు కూడా మరిన్ని విజయాలు సాధిస్తుందన్న నమ్మకం కలుగుతోందని ఎకానమిస్టులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం గ్రోత్​ సాధ్యమని, పోయిన ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం గ్రోత్​ సాధించడమే ఇందుకు రుజువని అన్నారు.  దీంతో చాలా మంది ట్విటర్​ను ‘కంగ్రాచులేషన్స్​ఇండియా’ మెసేజ్​లతో ముంచేశారు. ప్రస్తుతం టాప్​–5లో అమెరికా, చైనా, జపాన్​, జర్మనీతోపాటు ఇండియా ఉన్నాయి. యూకే ఆరోస్థానంలోకి వెళ్లింది. చాలా దేశాల్లో మాంద్యం సంకేతాలు కనిపిస్తుండగా, ఇండియా ఎకనమీ దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే మనదేశంలో మరికొన్ని సంవత్సరాల్లో టాప్​–3 ఎకనమీగా ఎదుగుతుందని ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్టు అంచనా వేసింది. గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి ఆర్థిక విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల 2027 నాటికి మనం జర్మనీని అధిగమిస్తామని ప్రకటించింది.  ప్రస్తుత గ్రోత్​రేట్​ కొనసాగినా, 2029 నాటికి జపాన్​ను కూడా దాటేస్తామని తెలిపింది. ‘‘2014 నుంచి మనం ఏడుస్థానాలు పైకి ఎక్కాం. అప్పుడు మనకు పదో ర్యాంకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఐదో ర్యాంకుకు చేరుకోవడం గొప్ప విషయం. చాలా పెద్ద విజయం”అని ఎస్​బీఐ గ్రూప్​ చీఫ్​ ఎకనమిక్​ అడ్వైజర్​ సౌమ్యకాంతి ఘోష్​ అన్నారు. అయితే మరికొందరు ఎకనమిస్టులు మాట్లాడుతూ కేవలం జీడీపీ పెరగడం చాలదని, తలసరి ఆదాయమూ పెరగాలని అన్నారు. 

బ్రిటన్​కు కష్టాలు... 

అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌‌‌‌లో యూకే ఎకనమీ పతనం కొత్త ప్రధానమంత్రికి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.  నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతోపాటు, మాంద్యం ప్రమాదాలను బ్రిటన్ ఎదుర్కొంటున్నది. ఎకనమీ బాగా తగ్గింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఏడుశాతం కంటే ఎక్కువ గ్రోత్​రేట్​ సాధిస్తుందని అంచనా.  భారతీయ స్టాక్స్‌‌ కూడా దూసుకెళ్తున్నాయి. ఎంఎస్​సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌‌లో చైనా తరువాత స్థానంలో ఇండియా వచ్చి చేరింది.  ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు కాగా,  యూకే ఎకనమీ సైజు 816 బిలియన్ డాలర్లు. ఇప్పటి నుంచి యూకే మరింత పడిపోయే అవకాశం ఉంది. యూకే జీడీపీ రెండవ క్వార్టర్​లో నగదు పరంగా కేవలం ఒకశాతం పెరిగింది. దీనిని ఇన్​ఫ్లేషన్​కు సర్దుబాటు చేసిన తర్వాత  0.1శాతం తగ్గింది. ఈ సంవత్సరం రూపాయితో పోలిస్తే పౌండ్ 8శాతం పడిపోయింది. డాలర్​తో పోల్చినా బలహీనపడింది.  పదేళ్ల క్రితం వరకు భారతదేశం.. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, యూకే 5వ స్థానంలో ఉంది.  2021–-22 క్యూ1లో నమోదైన జీడీపీ గ్రోత్​ 20.1 శాతం కాగా, 2022  జూన్  క్వార్టర్​లో జీడీపీ 13.5 శాతం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. 2022–-23 క్యూ1లో నిలకడైన (2011-–12) ధరల వద్ద వాస్తవ జీడీపీ లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ. 36.85 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా.  అయినప్పటికీ ఇది ఆర్​బీఐ అంచనాల కంటే తక్కువేనని ఒక ఎకనమిస్టు అన్నారు. ఇది 2021–-22 క్యూ1లో రూ. 32.46 లక్షల కోట్లుగా ఉంది.  నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ లో  గ్రాస్​ వాల్యూ యాడెడ్​(జీవీఏ) 12.7 శాతం పెరిగింది.

కన్సంప్షన్​, డిమాండ్​ పెరగడంతో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతోంది. రెండు సంవత్సరాల తరువాత కరోనా ఎఫెక్ట్​ తగ్గడంతో జనం ఇండ్ల నుంచి బయటకొచ్చి ఖర్చు చేయడంతో పెంట్-అప్ డిమాండ్ కనిపిస్తోంది. సేవల రంగం బలంగా పుంజుకుంది.  వచ్చే నెల పండుగ సీజన్ నుండి మరింత దూకుడు కనిపించవచ్చు. అయితే తయారీ రంగం గ్రోత్​ 4.8 శాతమే ఉండటం ఆందోళన కలిగించే విషయం.  ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం దిగులు కలిగిస్తోంది. ఈసారి సకాలంలో వర్షాలు రాకపోవడం, వరదల వల్ల పంటలపై ఎఫెక్ట్​ ఉంటుంది. రూరల్​ డిమాండ్​ కూడా తగ్గవచ్చు. 

“మనదేశం జీడీపీ విషయంలో బ్రిటన్​ను అధిగమించింది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది! వేగంగా అభివృద్ధి చెందుతున్న మన భారత ఆర్థిక వ్యవస్థకు ఇది మైలురాయి. కొన్ని సంవత్సరాలలో మనం టాప్– 3లో ఉంటాం’’

‑ వేదాంత రిసోర్సెస్ 
లిమిటెడ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్  

‘‘మన ఎకనమీ బ్రిటన్​ను దాటేసిందని ఐఎంఎఫ్​స్వయంగా ప్రకటించింది. అమెరికా, చైనా, జపాన్​, జర్మనీ తరువాత అత్యంత పవర్​ఫుల్​ మనమే! పదేళ్ల క్రితం మనకు 11వ ర్యాంకు ఉండేది. బ్రిటన్ ​ఐదో స్థానంలో ఉండేది’’

- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​

"కర్మసూత్రం పనిచేస్తుంది. స్వాతంత్ర్యం కోసం   పోరాడిన, ప్రాణాలను త్యాగం చేసిన ప్రతి భారతీయుడి హృదయాన్ని సంతోషంతో నింపే శుభవార్త ఇది.  భారతదేశం గందరగోళంలో పడుతుందని భావించిన వారికి బలమైన సమాధానం ఇది. దేశానికి కృతజ్ఞతలు చెప్పే సమయం ఇది"

‑ మహీంద్రా గ్రూప్​ చైర్మన్​ ఆనంద్​మహీంద్రా
 
‘‘భారత ఆర్థిక వ్యవస్థ విజయానికి 'సంస్కరణలు, పనితీరు & పరివర్తన' మంత్రం ఎంతోబాగా పనిచేసింది. ప్రధాని మోదీ  'చురుకైన' నాయకత్వం వల్లే ఈ ఘనత సాధ్యపడింది. ఇండియా యూకేని అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.  న్యూ ఇండియా విజయానికి కొత్త పేజీలను రాస్తోంది. ఎకనమిక్​ సూపర్ పవర్‌‌‌‌గా మారే దిశగా ఇండియా వేగంగా దూసుకుపోతోంది"

‑ కేంద్ర ఆరోగ్యం,  కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా 

" ఇది గర్వించదగ్గ క్షణం. ఇప్పుడు ఇండియా 3.5 లక్షల కోట్ల ఎకనమీ అయితే.. బ్రిటన్​ ఎకానమీ 3.2 ట్రిలియన్​ డాలర్లు. అయితే మన జనాభా గురించి కూడా ఆలోచించాలి. ఇండియా జనాభా  140 కోట్లు అయితే యూకే 68 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మన తలసరి ఆదాయం 2,500 డాలర్లు అయితే వారిది 47 వేల డాలర్లు’’ 

‑ కోటక్ మహీంద్రా బ్యాంక్  
సీఈఓ ఉదయ్ కోటక్