
- ద్రవిడ్, రోహిత్ ముందు నాలుగు ఆప్షన్స్
- ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పరిశీలించనున్న మేనేజ్‌మెంట్
ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌కు మరో నెల రోజుల సమయమే మిగిలి ఉండటంతో.. ఇప్పుడు టీమిండియా ఫైనల్ కాంబినేషన్పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గాయంతో మెగా టోర్నీకి దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్లేస్‌లో ఎవర్ని తీసుకోవాలన్న దానిపై కసరత్తులు చేయబోతున్నది. ఇందుకోసం ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వేదికగా చేసుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లేయర్లను పరిగణనలోకి తీసుకుంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ముందు నాలుగు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి. జడేజా లేకపోవడంతో ముందు జాగ్రత్తగా దీపక్ హుడా, అక్షర్ పటేల్‌ను టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లోకి తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో వస్తే ఐదో బౌలర్‌గా అతను న్యాయం చేయగలడు. కానీ ఫిట్‌నెస్, గాయాల వల్ల అతన్ని టీమ్‌లో ఆరో బౌలర్‌గా మాత్రమే తీసుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆ నాలుగు ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
హుడాకు చాన్స్ ఇవ్వడం..
ఆసియా కప్‌లో హార్దిక్ ఐదో బౌలర్‌గా బాధ్యతలు చేపట్టడంతో దీపక్ హుడా ఏడో నంబర్‌లో ఆడాడు. కానీ మెగా టోర్నీలో అతనికి ప్రమోషన్ ఇస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ పెరుగుతుంది. దీంతో పాటు అతను ఆఫ్ స్పిన్ వేయగల సమర్థుడు. అయితే ఆసియా కప్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం అతనికి మైనస్‌గా మారింది. మరి ఆసీస్, సౌతాఫ్రికాపై రాణిస్తే సమీకరణాలు మారొచ్చు. బ్యాటింగ్ డెప్త్ కోసం వెళ్తే మాత్రం హార్దిక్ బౌలర్‌గా ఫుల్ కోటా వేయాలన్న ఒత్తిడి పెరుగుతుంది.
అక్షర్ పటేల్‌ను ప్రయత్నిస్తే..
ప్రస్తుతం ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే జడేజాకు సరైన రీప్లేస్‌మెంట్ అక్షర్ పటేల్ కనిపిస్తున్నాడు. పటేల్‌ను తీసుకుంటే పాండ్యాపై బౌలింగ్ భారం కూడా తగ్గుతుంది. ఫుల్ కోటా ఓవర్లు వేయడంతో పాటు మంచి టర్న్‌ను రాబట్టగలడు. కాకపోతే జడేజాతో పోలిస్తే అక్షర్ బ్యాటింగ్‌లో కాస్త వీక్. దీనివల్ల బ్యాటింగ్ డెప్త్ పెరగదు. లోయర్ ఆర్డర్‌లో హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉన్నా పూర్తి నమ్మకం పెట్టలేని పరిస్థితి. కాబట్టి బౌలింగ్ బలోపేతం చేయాలనుకుంటే బ్యాటింగ్ లైనప్ క్షీణిస్తుంది.
అశ్విన్‌ను కొనసాగిస్తే..
కాసేపు లెఫ్ట్ కాంబినేషన్‌ను పక్కనబెడితే.. రవిచంద్రన్ అశ్విన్‌ను బెస్ట్ చాయిస్‌గా ఊహిస్తున్నారు. ఏడో ప్లేస్‌కు అతను సరిగ్గా సరిపోతాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ తరఫున అశ్విన్ ఆ రోల్‌ను పోషించాడు కూడా. అందుకే ఆస్ట్రేలియాలో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. హర్షల్ పటేల్, భువనేశ్వర్ కూడా కొన్ని రన్స్ చేసే సామర్థ్యం ఉంది కాబట్టి అశ్విన్‌ను హిట్టర్‌గా ప్రయోగించొచ్చు. అయితే అక్షర్ పటేల్‌లాగా అశ్విన్ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ కాకపోవడం మైనస్. దీనివల్ల డెత్ ఓవర్లలో స్కోరు చేసే వనరులు తగ్గొచ్చు.
హార్దిక్, దినేశ్ కార్తీక్‌పై ఆధారపడటం..
పరిస్థితులను బట్టి హార్దిక్, దినేశ్ కార్తీక్‌ను తుది జట్టులోకి తీసుకోవడం. అయితే జడేజా గైర్హాజరీలో రోహిత్.. స్పెషలిస్ట్ బ్యాటర్ కోసం ట్రై చేయొచ్చు. హార్దిక్ ఉంటే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌కు ఉపయోగపడతాడు. స్పిన్‌ను ఎదుర్కోవడానికి మిడిలార్డర్‌లో పంత్‌పై ఆధారపడొచ్చు. అప్పుడు కార్తీక్ ఫినిషర్‌గా రావొచ్చు. ఈ సమీకరణం వల్ల బ్యాటింగ్ గణనీయంగా బలోపేతం అవుతున్నప్పటికీ బౌలింగ్‌లో మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు.