ఇండియా తడ‘బ్యాట్‌‌‘

ఇండియా తడ‘బ్యాట్‌‌‘


సౌతాంప్టన్‌‌: సరైన ప్రాక్టీస్‌‌ లేకుండా వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌‌మెన్‌‌ బొక్కబోర్లా పడ్డారు. న్యూజిలాండ్‌‌ పవర్‌‌ఫుల్‌‌ పేస్‌‌ అటాక్‌‌ను ఎదుర్కోలేక పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. దీంతో ఆదివారం మూడో రోజు.. ఇండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 92.1 ఓవర్లలో 217 రన్స్‌‌కు ఆలౌటైంది. ఓవర్‌‌నైట్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ అజింక్యా రహానె (117 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 49), విరాట్‌‌ కోహ్లీ (132 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌తో 44) టాప్‌‌ స్కోరర్లు. కివీస్‌‌ పేసర్‌‌ జెమీసన్‌‌ (5/31) ధాటికి టీమిండియా మిడిల్‌‌, లోయర్‌‌ ఆర్డర్‌‌ పేకమేడలా కుప్పకూలింది. 71 రన్స్‌‌కు చివరి 7 వికెట్లు చేజార్చుకుని మ్యాచ్‌‌పై పట్టు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌ ఆట ముగిసే సమయానికి ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 49  ఓవర్లలో 2 వికెట్లకు 101 రన్స్‌‌ చేసింది. కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ (12 బ్యాటింగ్‌‌), రాస్‌‌ టేలర్‌‌ (0 బ్యాటింగ్‌‌)  క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్‌‌ ఇంకా 116 రన్స్‌‌ వెనుకబడి ఉంది.  రెండో సెషన్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చిన న్యూజిలాండ్‌‌ ఇన్నింగ్స్‌‌ను టీమిండియా బౌలర్లు ఏమాత్రం డ్యామేజ్‌‌ చేయలేదు.  పేసర్లు ఎంత ప్రయత్నించినా వికెట్‌‌ దక్కలేదు. దీంతో కివీస్‌‌ ఓపెనర్లు టామ్‌‌ లాథమ్‌‌ (30), డేవన్‌‌ కాన్వే (54) స్వేచ్ఛగా ఆడారు. చెత్త బంతి కోసం వెయిట్‌‌ చేస్తూ అసలైన టెస్ట్‌‌ క్రికెట్‌‌ను చూపించారు. దీంతో ఈ సెషన్‌‌లో 21 ఓవర్లు ఆడిన కివీస్‌‌ 36/0తో నిలిచింది. లాస్ట్‌‌ సెషన్‌‌లో వరుస విరామాల్లో ఈ ఇద్దరు ఔట్‌‌కావడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 70 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. నిలకడ చూపిన విలియమ్సన్‌‌.. కాన్వేతో సెకండ్‌‌ వికెట్‌‌కు 31 రన్స్‌‌ జోడించాడు. 

రెచ్చిపోయిన జెమీసన్‌‌..

146/3 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా లంచ్‌‌ వరకు 65 రన్స్‌‌ చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఔట్‌‌ఫీల్డ్‌‌ తడిగా ఉండటంతో ఆట అరగంట ఆసల్యంగా మొదలైంది. వాతావరణం మేఘావృతంగా ఉండటంతో.. కివీస్‌‌ పేసర్లు జెమీసన్‌‌, బౌల్ట్‌‌ (2/47), వాగ్నర్‌‌ (2/40) సీమ్‌‌, స్వింగ్‌‌, షార్ట్‌‌ పిచ్‌‌లతో కోహ్లీ, రహానెను బాగా ఇబ్బంది పెట్టారు. ఫలితంగా ఓవర్‌‌నైట్‌‌ స్కోరుకు ఒక్క రన్‌‌ కూడా జోడించకుండానే కెప్టెన్‌‌ విరాట్‌‌.. జెమీసన్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. రెండో రోజు మొత్తం మస్త్‌‌ ఓపిక చూపెట్టిన కోహ్లీని.. జెమీసన్‌‌, బౌల్ట్‌‌ ఆఫ్‌‌సైడ్‌‌ బాల్స్‌‌తో ఊరించారు. ఈ స్ట్రాటజీ బాగా ఫలించింది. ముఖ్యంగా 6 అడుగుల 8 ఇంచ్‌‌ల జెమీసన్‌‌ కాస్త వైడ్‌‌గా సంధించిన బాల్‌‌ డైరెక్ట్‌‌గా విరాట్‌‌ లెగ్స్‌‌ను తాకుతూ వెళ్లింది. రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. రహానెతో నాలుగో వికెట్‌‌కు 61 రన్స పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. భారీ అంచనాలతో వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ (4) సూపర్‌‌ ఫ్లిక్‌‌తో మిడ్‌‌ వికెట్‌‌ మీదుగా బౌండరీ సాధించినా.. ఎక్కువసేపు వికెట్‌‌ కాపాడుకోలేదు. జెమీసన్‌‌ సంధించిన యాంగిల్‌‌ బాల్‌‌ను డ్రైవ్‌‌ చేయబోయి థర్డ్‌‌ స్లిప్‌‌లో లాథమ్‌‌కు చిక్కాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడటంతో.. రహానె కొద్దిగా ధైర్యం చేసి షాట్లు కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ వాగ్నర్ వేసిన షార్ట్‌‌ పిచ్‌‌లను ఫుల్‌‌ చేయబోయి లైన్‌‌ మిస్సయ్యాడు. ఫలితంగా మిడ్‌‌ వికెట్‌‌లో లాథమ్‌‌కు సింపుల్‌‌ క్యాచ్‌‌ ఇచ్చి హాఫ్‌‌ సెంచరీ మిస్‌‌ చేసుకున్నాడు. ఈ దశలో వచ్చిన అశ్విన్‌‌ (22) కాసేపు బ్యాట్‌‌ అడ్డేసే సాహసం చేశాడు. జడేజా (15)ను నిలబెట్టి చకచకా రన్స్‌‌ చేసినా.. సౌథీ దెబ్బకు వెనుదిరిగాడు. ఓవరాల్‌‌గా 211/7 స్కోరుతో లంచ్‌‌కు వెళ్లింది. సెకండ్‌‌ సెషన్‌‌లో కేవలం 3.1 ఓవర్లు మాత్రమే ఆడిన ఇండియా.. ఆరు రన్స్‌‌ చేసి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. బౌల్ట్‌‌ బౌలింగ్‌‌లో క్యాచ్‌‌ డ్రాప్‌‌ నుంచి గట్టెక్కిన జడేజా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఇషాంత్‌‌ (4) కూడా భయపడుతూనే బ్యాటింగ్‌‌ చేశాడు. బ్రేక్‌‌ నుంచి వచ్చిన తర్వాత జెమీసన్‌‌ ఇండియాకు డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు.92వ ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో ఇషాంత్‌‌, బుమ్రా (0)ను ఔట్‌‌ చేశాడు. తర్వాతి ఓవర్‌‌లో బౌల్ట్‌‌.. జడేజాను పెవిలియన్‌‌కు పంపడంతో  షమీ (4 నాటౌట్‌‌) మిగిలిపోయాడు. కేవలం 25 నిమిషాల్లోనే టీమిండియా తోకను కట్‌‌ చేసిన కివీస్‌‌.. స్కోరును 220కే పరిమితం చేసింది. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌: 217 ఆలౌట్‌ (రహానె 49, కోహ్లీ 44, అశ్విన్‌ 22, జెమీసన్‌ 5/31, బౌల్ట్‌ 2/47, వాగ్నర్‌ 2/40). న్యూజిలాండ్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌: 101/2 (డేవన్‌ కాన్వే (54, లాథమ్‌ 30, ఇషాంత్‌ 1/19, అశ్విన్‌ 1/20).