లార్డ్స్‎లో ఉమెన్స్ టీమిండియా నయా హిస్టరీ: ఇంగ్లాండ్‎పై 270 పరుగుల తేడాతో హార్మన్ సేన ఘన విజయం

లార్డ్స్‎లో ఉమెన్స్ టీమిండియా నయా హిస్టరీ: ఇంగ్లాండ్‎పై 270 పరుగుల తేడాతో హార్మన్ సేన ఘన విజయం

బ్రిటన్: క్రికెట్‎ మక్కాగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా ఉమెన్స్ టీమ్ నయా చరిత్ర సృష్టించింది. యస్తికా భాటియా సెంచరీతో కదం తొక్కగా.. క్రాంతి గౌడ్ 7 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్‏లో భారత అమ్మాయిలు 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. 457 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 186 పరుగులకే ఔట్ అయ్యింది. 130/6తో నాలుగో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లీష్ అమ్మాయిలు భారత బౌలర్ల ధాటికి మరో 56 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయిరు. దీంతో ఇండియా 270 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 

ఈ ఏకైక టెస్ట్‎లో టీమిండియా అమ్మాయిలు ఫస్ట్ ఇన్నింగ్స్‎లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ స్మృతి మందనా (83), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (58), స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. అతిథ్య ఇంగ్లాండ్ అమ్మాయిలు ఫస్ట్ ఇన్నింగ్స్‎లో కేవలం 170 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. వికెట్ కీపర్ జోన్స్ (52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. నాట్ స్కీవర్ బ్రంట్ (44) రాణించింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‎లో ఇండియాకు 115 పరుగుల ఆధిక్యం లభించింది.

►ALSO READ | 18 ఏళ్ల బంధానికి బ్రేక్: CSK హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై 

సెకండ్ ఇన్నింగ్స్‎లో ఇండియా అమ్మాయిలు దుమ్మురేపారు. వికెట్ కీపర్ యస్తికా భాటియా (113) చారిత్రాత్మక సెంచరీతో కదం తొక్కగా.. స్మృతి మందనా (70), రిచా ఘోష్ (50) అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో 341 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లాండ్ 457 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. రెండో ఇన్నింగ్స్‎లోనూ ఇంగ్లాండ్ అమ్మాయిలు సత్తా చాటలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి 186 పరుగులకే చాప చుట్టేశారు. దీంతో ఇండియా ఉమెన్స్ టీమ్ 270 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుని లార్డ్స్ మైదానంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.