ఆపరేషన్‌ అజయ్‌ : ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న235 మంది

 ఆపరేషన్‌ అజయ్‌ : ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న235 మంది

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ ద్వారా ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. శుక్రవారం (అక్టోబర్ 13న) తెల్లవారుజామున 212 మంది భారతీయులు ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. శనివారం (అక్టోబర్​ 14న) మరో విమానం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు పెద్దఎత్తున వందేమాతరం నినాదాలు చేశారు. ఈ విమానంలో 235 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. 

అక్టోబర్ 6వ తేదీన పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే.  20 నిమిషాల్లో 5 వేలకుపైగా రాకెట్లతో హమాస్‌ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. ప్రతిగా ఇజ్రాయెల్‌ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్‌ను నామరూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతో దాడలు చేస్తోంది.

ఇరువైపుల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తీసుకొస్తోంది. దీనికి ఆపరేషన్ అజయ్ అనే పేరు పెట్టింది. అత్యంత భయానక పరిస్థితుల నుంచి బయటపడి క్షేమంగా స్వదేశానికి చేరుకోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read :- నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే

ఇజ్రాయెల్ లో నార్మల్ పరిస్థితులు లేవని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని భారతకు వచ్చిన వాళ్లు చెబుతున్నారు. తమను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.