
దుబాయ్‌లో ఇండియన్లకు రహస్య ఆస్తులు
ఐటీ డిపార్ట్‌మెంట్ పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ: ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వేల మంది ఆదాయపుపన్నుశాఖకు (ఐటీ డిపార్ట్‌మెంట్) దొరికిపోయారు. వీరంతా దుబాయ్‌లో రహస్యంగా ఆస్తులు కొన్నట్టు ఐటీశాఖ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విచారణలో తేలింది. ఐటీ రిటర్నుల్లో ఈ విషయాన్ని పేర్కొనలేదని వెల్లడయింది. ఈ ఆస్తుల కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియాల్సి ఉంది. ఇలాంటి ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని డొల్ల కంపెనీలకు మళ్లించడం ద్వారా ఆదాయపు పన్నును ఎగ్గొడుతున్నట్టు బయటపడింది. చాలా మంది ఇండియన్లు బ్లాక్‌మనీని దాచుకోవడానికి దుబాయ్‌ని ఎంచుకుంటున్నట్టు ఐటీశాఖ గుర్తించింది. ప్రస్తుతం దొరికిన రెండు వేల మందిలో వ్యాపారులు, బ్యూరోకాట్లు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. బ్లాక్‌మనీ చట్టం ప్రకారం వీరందరిపైనా చర్యలు తీసుకుంటామని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల్లో ఇండియన్లు ఆస్తులు కొంటే వాటి వివరాలతోపాటు కొనుగోలుకు ఆదాయం ఎలా సమకూరిందో కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఐటీ చట్టం ఫారిన్ అసెట్స్ సెక్షన్ ప్రకారం ఈ ఆస్తుల వివరాలను ఐటీ రిటర్నుల్లో తప్పక పేర్కొనాలి. విదేశాల్లో కంపెనీలు ఉన్నా వెల్లడించాలని ఐటీశాఖ సీనియర్ ఆఫీసర్ ఒకరు వివరించారు.