విదేశాలకు వలసెల్లిపోతున్నరు.. లగ్జరీగా బతకడానికి..

విదేశాలకు వలసెల్లిపోతున్నరు.. లగ్జరీగా బతకడానికి..

ఒకప్పుడు జానెడు పొట్ట నింపుకోవడానికి పని వెతుక్కుంటూ దేశ విదేశాలకు వలసలు వెళ్లేవాళ్లు. కానీ.. ఇప్పుడు ట్రెండ్​ మారింది. ఇక్కడ లగ్జరీగా బతకడానికి కావాల్సినన్ని పైసలు ఉన్నవాళ్లు కూడా బెటర్​ లైఫ్ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్​, కెనడా, దుబాయ్​, సింగపూర్​.. అంటూ ఎగిరిపోతున్నారు. పొట్ట చేత పట్టుకుని పోయే వాళ్లతో పాటు విదేశాల్లో సెటిల్​ కావాలనే కోరికతో వెళ్లే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియన్​ సిటిజన్​షిప్​ని వదులుకుని, కన్న ఊరితో తెగదెంపులు చేసుకుని వెళ్తున్న వాళ్లు కూడా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వలసలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 6,500 మంది మిలియనీర్లు ఇండియాని విడిచి విదేశాల్లో సెటిల్​ అయ్యే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ –2023లో వెల్లడి చేసింది. 

మన దేశంతో పాటు చైనా, రష్యా లాంటి దేశాల నుంచి కూడా ధనవంతులు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ధనవంతులే కాదు.. బాగా చదువుకున్నవాళ్లు కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటున్నారు. అక్కడే సెటిల్ అవుతున్నారు. ప్రజాస్వామ్యం లేని దేశాల నుంచి వలసలు వెళ్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ.. ప్రజాస్వామ్య దేశమైన ఇండియా నుంచి ఇలా వలసలు వెళ్తుండడం ఆలోచించాల్సిన విషయమని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. కొన్ని విదేశాల్లో ఉండే నాణ్యమైన జీవన ప్రమాణాలు, భద్రత, శాంతిభద్రతలు, కాలుష్యం లేని వాతావరణం, ఆస్తుల రక్షణ, తక్కువ పన్నులు, పిల్లలకు నాణ్యమైన చదువులు, వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛ, పరిపాలనలో తక్కువ అవినీతి వంటి కారణాలతోనే ఇండియా నుంచి వలసలు పెరుగుతున్నాయనేది కొందరు ఎక్స్​పర్ట్స్​ అభిప్రాయం. అయితే.. మన దేశం నుంచి ఇతర దేశాలకు వలసలు వెళ్లడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కొన్ని వందల ఏండ్ల క్రితం నుంచే ప్రజలు రకరకాల కారణాలతో విదేశాలకు వలసలు వెళ్లడం ఉంది. 

ఎప్పటి నుంచో..

ఈ మధ్య ఇండియన్స్​ చాలామంది సొంత గూటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అలాగని వలసలు ఈ మధ్య మొదలైన విషయం ఏమీ కాదు. బ్రిటీషర్ల కాలంలోనే వలసలు పెరిగాయి. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఉపాధి కోసం వలస వెళ్లే సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఐక్యరాజ్య సమితి వలసదారుల స్టాక్ డాటాబేస్ ప్రకారం.. 1990 నుండి విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల జనాభా క్రమంగా పెరుగుతూ వచ్చింది.1990 నుండి 2020 మధ్య మూడు దశాబ్దాల్లో వలస జనాభాలో సగటు వార్షిక పెరుగుదల 3.4 శాతంగా ఉంది. 

వలసల చరిత్ర

19వ శతాబ్దపు ప్రారంభంలో బ్రిటిష్​ వలస రాజ్యాల్లోని తోటల్లో, రోడ్లు, భవనాలు, రైలుమార్గాల నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేయడానికి కార్మికులు అవసరమయ్యారు. దాంతో బ్రిటిష్​ సామ్రాజ్యం అంతటా పనిచేయడానికి ఇండియన్స్​ని తీసుకెళ్లారు. అలా వెళ్లినవాళ్లు ఆయా ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. 1833లో బ్రిటిష్ సామ్రాజ్యంలోని చాలా ప్రాంతాల్లో బానిసత్వాన్ని నిర్మూలించడం వల్ల బానిసల సంఖ్య తగ్గి, వలసదారుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత బ్రిటీషర్లు లక్షల మంది భారతీయ కార్మికులను ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ ‌లోని వాళ్ల కాలనీలకు తరలించారు. ముఖ్యంగా ఫ్రాన్స్, డెన్మార్క్ (1848), నెదర్లాండ్స్ (1863)ల్లో బానిసత్వాన్ని  నిర్మూలించడంతో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడింది.  చక్కెర ఉత్పత్తి విపరీతంగా తగ్గిపోయింది. దాంతో కొత్త వర్క్​ఫోర్స్​ని తయరు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు భారతదేశంతోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి కాంట్రాక్ట్​ లేబర్​ని తీసుకెళ్లారు. 

ఎందుకు వెళ్తున్నారంటే.. 

ఇండియా నుంచి విదేశాలకు వెళ్లేవాళ్లలో ఎక్కువ మంది ఉపాధి కోసమే వెళ్తున్నప్పటికీ కొంతమంది ఇక్కడికంటే విదేశాల్లో మంచి జీవితం ఉంటుందనే ఆశతోనే వెళ్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే వాళ్లలో ఎక్కువశాతం మంది అక్కడ ఉండే సౌకర్యాలు, లైఫ్​స్టయిల్​ కోసమే వెళ్తుంటారు. అరబ్​ దేశాలకు కూలీలుగా వెళ్లేవాళ్లు మాత్రం ఇక్కడ ఉపాధి లేక వెళ్తున్నారు. 

చదువుకోసం వెళ్లి...  

ఇండియాలోని యువకులు చాలామందికి విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉంటుంది. అందుకే ప్రతిసారి లక్షల మంది విదేశాల్లో చదువుకోవడానికి ఎంట్రన్స్​ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ప్రతిసారి లక్షలమంది ఇండియన్​ స్టూడెంట్స్​ చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. వాళ్లలో 80 శాతం మంది గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తున్నారు. చదువు పూర్తయ్యాక, అక్కడి పరిస్థితులు, జీతాలు అక్కడేస్థిరపడిపోతున్నారు. 
విదేశాల్లో ఉద్యోగం చేయడాన్ని చాలామంది ఒక స్టేటస్​గా భావిస్తారు. వాస్తవానికి మనదేశంతో పోలిస్తే.. చాలా దేశాల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చదువు పూర్తయ్యాక చాలామంది విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కుతాయనే ఉద్దేశంతో వలస వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. ఉద్యోగం చేసే వయసులో ఉన్న వాళ్లలో 66 శాతం మంది ​ విదేశాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. 

అవకాశాలు తక్కువ

అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాల్లో అధిక జనాభా సమస్య చాలా ముఖ్యమైనది. జనాభా ఎక్కువగా ఉంటే కార్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ.. తక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయి. అందువల్ల కంపెనీలు తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకుంటాయి. విదేశాలకు వలసలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంటోంది.

సామాజిక లేదా మత కారణాల వల్ల వలసలు వెళ్లే వాళ్లూ ఉంటారు. ఎందుకంటే.. కొన్ని రకాల గొడవల వల్ల అభద్రత భావం కలుగుతుంది. దాంతో దేశం వదిలివెళ్లడానికి ఇష్టపడతారు. ఉదాహరణకు.. కాశ్మీర్ పండిట్లు చాలామంది విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. 

ఒక కుటుంబం తమ కనీస జీవన అవసరాలను తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నా వలస వెళ్లడానికి మొగ్గు చూపిస్తారు. అలాంటివాళ్లు ఎక్కువగా గల్ఫ్​​ దేశాలకు కూలీలుగా వెళ్తుంటారు. ఈ దేశాలకు వెళ్లే వాళ్లలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్​, బీహార్ ‌ వాళ్లు ఉంటున్నారు. 

వాతావరణం కూడా కారణమే!

వలసలకు పర్యావరణం కూడా ఒక కారణమే. ఉదాహరణకు వరదలు, కరువులు, భూకంపాలు లాంటి  వాతావరణ మార్పులు ఎక్కువగా వస్తుంటే.. ఆ ప్రాంతంలోఉన్నవాళ్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి ఇష్టపడతారు. ఇలాంటి ప్రాంతాలు మన దేశంలో పెద్దగా లేకపోయినా.. కాలుష్యం మాత్రం పెరిగిపోయింది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో వాతావరణ కాలుష్యం చాలా ఎక్కువ. దాన్ని తప్పించుకునేందుకు కాలుష్యం తక్కువగా ఉండే దేశాలకు వెళ్లే వాళ్లూ ఉన్నారు. 

‘ఎందుకు వెళ్లకూడద’ని...   

ఈమాట కాస్త కామెడీగా అనిపిస్తుంది. కానీ ఇది వాస్తవం. డబ్బున్న వాళ్లలో కొందరు కొత్తదనం కోసం మరో ప్రాంతానికి ఎందుకు వెళ్లకూడదు? అనే ఆలోచనతోనే వలస వెళ్తుంటారు. మన దేశం ఎలా ఉందో తెలుసు.. కాబట్టి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఉండాలనే ఉద్దేశంతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి, అక్కడికి వెళ్తుంటారు. లేదంటే.. బంధువులు విదేశాల్లో ఉండి, అక్కడి పరిస్థితుల గురించి చెప్పడంతో... అది నచ్చి వెళ్తుంటారు కొందరు. 

డబ్బు ఉన్నవాళ్లు కూడా  

ఇదివరకు సొంతగడ్డ మీద పనిలేక విదేశాలకు వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు. కానీ.. ఇప్పుడు చాలామంది డబ్బున్న వాళ్లు కూడా వలస వెళ్తున్నారు. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్–2023 ప్రకారం..  2023లో ఇండియా నుంచి 6,500 మిలియనీర్లు(హై-నెట్-వర్త్ ఇండివిడ్యువల్స్​) వలస వెళ్లే అవకాశం ఉంది. ఇలా డబ్బున్నవాళ్లు వలస వెళ్లే దేశాల లిస్ట్ ‌లో మనది రెండో స్థానంలో ఉంది. 13,500 మంది వలసదారులతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ‘‘అయితే... వలసల వల్ల ఇండియాలో కోల్పోయిన మిలియనీర్ల కంటే.. చాలా ఎక్కువమంది కొత్త మిలియనీర్లు ఇక్కడ తయారవుతారు. కాబట్టి ఈ వలసల వల్ల అంత నష్టం ఉండకపోవచ్చు”అని న్యూ వరల్డ్ వెల్త్ రీసెర్చ్ హెడ్ ఆండ్రూ అమోయిల్స్ అభిప్రాయపడ్డాడు. కనీసం ఒక మిలియన్​ అమెరికన్​ డాలర్లు(8.2 కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టగలిగే స్థోమత ఉన్నవాళ్లు మన దగ్గరనుంచి వలస వెళ్లేందుకు చాలా కారణాలు ఉన్నాయి. 

ముఖ్యంగా మన దగ్గర ఉన్న పన్నుల విధానం వల్ల చాలామంది వలస వెళ్తున్నారు. కొన్ని దేశాల్లో పన్నులు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఆస్ట్రేలియా, దుబాయి, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5,200 మంది మిలియనీర్లు ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉందనేది అంచనా. 2022లో మాత్రం యూఏఈ రికార్డు స్థాయిలో మిలియనీర్లను ఎట్రాక్ట్​ చేసింది. ఈ ఏడాది 4,500 మంది కొత్త మిలియనీర్లకు ఆహ్వానం పలకనుంది. యూఎస్​ తన మిలియనీర్ క్లబ్ ‌లో 2,100 మందిని చేర్చుకోనుంది. 

ఈజీగా వీసా: విదేశాలలో స్థిరపడటానికి ముఖ్యంగా రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది అక్కడ ఉద్యోగం సంపాదించడం. రెండోది ఆ దేశంలో వ్యాపారం చేయడం. డబ్బు ఉన్నవాళ్లంతా పెట్టుబడులు పెట్టి పర్మినెంట్​ వీసా సంపాదిస్తారు. ఉదాహరణకు అమెరికాలో ఇండియన్స్​ సెటిల్​ కావాలంటే.. కనీసం ఎనిమిది లక్షల అమెరికన్​ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలి. బ్రిటన్ ‌లో అయితే.. ఐదున్నర లక్షల డాలర్లు పెట్టుబడిపెడితే.. అక్కడ ఉండేందుకు వీసా ఇస్తారు. అందుకే ఇక్కడి ధనవంతులకు విదేశాలకు వలస వెళ్లడం ఈజీ అయిపోయింది.

పన్నులు తక్కువ: యూఏఈ లాంటి దేశాల్లో ఆస్తిపై ట్యాక్స్​లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువమంది ఆ దేశాలకు వెళ్తారు. అయితే.. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఇండియా కంటే ఎక్కువ పన్నులు ఉంటాయి. కానీ.. ఆ పన్నులకు తగిన సదుపాయాలు కల్పిస్తారు. 
వ్యాపార అవకాశాలు : ఇండియాతో పోలిస్తే కొన్ని దేశాల్లో కంపెనీని రిజిస్టర్​ చేసుకోవడం, వ్యాపారం మొదలుపెట్టడం చాలా ఈజీ.  బిజినెస్​ లోన్లు పొందడం కూడా ఈజీ. 

అమెరికాలోనే ఎక్కువ

ఇండియన్స్​ ప్రపంచంలోని దాదాపు అన్ని చోట్ల ఉన్నారు. 150 ఏళ్ల క్రితమే ఇండియన్స్​ అవకాశాల కోసం వలసలు వెళ్లడం మొదలుపెట్టారు. అందుకే భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు చాలా దేశాల్లో ఉన్నారు. కేవలం అమెరికాలోనే 44 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు.  అన్ని దేశాల కంటే అమెరికాలోనే ఎక్కువమంది ఇండియన్స్​ సెటిలయ్యారు. ఆ తర్వాత ఎక్కువమంది సౌదీ అరేబియాలో ఉన్నారు. 

ఆస్ట్రేలియాకు ఎందుకు? 

ఈ మధ్య ప్రంపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఆసియా, దక్షిణాఫ్రికా, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్నారు. 2022 జూన్​లో విడుదల చేసిన డేటా ప్రకారం.. ఆస్ట్రేలియాకు యూకే, న్యూజిలాండ్ నుండి వచ్చిన వలసదారుల సంఖ్యను దాటి మొదటిసారి ఇండియా మొదటి స్థానంలో నిలిచింది.

ముఖ్యంగా అక్కడి వాతావరణం, కల్చర్​, సదుపాయాలు, వన్యప్రాణులు, పర్యావరణం, ఉద్యోగాలు, చదువు, ఆరోగ్యం కోసమే ఆస్ట్రేలియాకు వెళ్లాలి అనుకుంటున్నారు. పైగా ఇండియాలాగే ఆస్ట్రేలియా కూడా ప్రజాస్వామ్య దేశం. ముఖ్యంగా చదువుకోవడానికి వెళ్లే వాళ్లకు ఆస్ట్రేలియా బెస్ట్​ ఛాయిస్​. అక్కడ స్కాలర్ ‌షిప్ ప్రోగ్రామ్ ‌లు బాగున్నాయి. పైగా విదేశాల నుంచి వచ్చిన వాళ్లు అక్కడ ఎక్కువగా ఉండడంతో భిన్న సంస్కృతులు కనిపిస్తాయి. జూన్ 2022 జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా జనాభాలో 27% పైగా విదేశాల్లో పుట్టినవాళ్లే. 

సెమీ స్కిల్డ్ ఉద్యోగాల్లో...

కొన్ని దశాబ్దాల నుంచి విదేశాల్లో సెమీ -స్కిల్డ్ ఉద్యోగాల్లో పనిచేసేందుకు వలస వెళ్లే ఇండియన్స్​ సంఖ్య పెరిగింది. ఇలాంటి వాళ్లు ముఖ్యంగా గల్ఫ్​ దేశాల్లో ఉంటున్నారు. కాకపోతే.. వీళ్లలో చాలామంది కొంత సంపాదించుకుని, సొంత ఊరిలో ఓ ఇల్లు కట్టుకుని, కొంత భూమి కొనుక్కుని.. తిరిగి వచ్చేయాలని వెళ్లినవాళ్లే. కానీ.. వాళ్లలో కూడా అతి కొద్ది మంది అక్కడే స్థిరపడ్డారు. ఇలా వెళ్లినవాళ్లలో చాలామందికి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. కొందరు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్​ లాంటి పనుల్లో చేరితే.. మరికొందరు కూలీలుగా పనిచేస్తుంటారు. అంతేకాదు.. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి వచ్చేసిన వాళ్లూ ఉన్నారు.

పల్లెల నుంచి పట్నాలకు 

ఇండియా నుంచి బయటి దేశాలకు వెళ్లే వలసల కంటే పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే వలసలే ఎక్కువ. 2000వ దశకం మొదట్లో వలసలు విపరీతంగా పెరిగాయి. 2001 నుంచి 2011 సంవత్సరాల మధ్య జనాభా లెక్కల ప్రకారం వలసలు పెరిగాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. 1990 నుంచి 2001ల మధ్య సంవత్సరానికి 2.4% మాత్రమే వలసలు పెరిగేవి. 2001 నుంచి 2011ల మధ్య పట్టణ ప్రాంతాలకు వెళ్లే వలసలు సంఖ్య సంవత్సరానికి 4.5% శాతం పెరిగింది. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వలస రేటు ఉందనేది అంచనా. 

ఇండియాలో వలసలపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ) 2021లో ఒక నివేదిక ఇచ్చింది.   దాని ప్రకారం.. 2020–2021 మధ్య మొత్తం కార్మిక -సంబంధిత వలసల్లో అంతర్రాష్ట్ర వలసలే ఎక్కువగా ఉన్నాయి. పల్లె నుంచి దగ్గర్లోని పట్నానికి వలస వెళ్లే వాళ్ల కంటే.. పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే వాళ్లు ఆర్థికంగా, సామాజికంగా  బలహీనంగా ఉన్నారని తెలిసింది. 

ఇండియన్​ రైల్వేస్​ డాటా ప్రకారం.. 2011– 2016 సంవత్సరాల మధ్య ప్రతి సంవత్సరం రాష్ట్రాల మధ్య సగటున 90 లక్షల మంది వలసపోతున్నారు. 2020 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం.. వలస కార్మికులు దేశ జీడీపీలో 10% వాటాను అందిస్తున్నారు. అనేక రంగాలకు వెన్నెముకగా పనిచేస్తున్నారు. వాళ్లు పంపే డబ్బు ఆయా ఇళ్లల్లో పేదరికాన్ని తగ్గిస్తుందంటోంది ఈ నివేదిక. 

కారణాలనేకం 

ఉపాధి వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడతారు. కానీ.. కొన్నేండ్ల నుంచి వ్యవసాయంలో అవసరమైనదాని కన్నా ఎక్కువ మంది ఆధారపడడంతో తక్కువ లాభాలు వస్తున్నాయి. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. పైగా గ్రామాల్లోని చిన్న తరహా కుటీర పరిశ్రమలు కూడా ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతున్నాయి. అందుకే పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, సేవా రంగాల్లో ఉపాధి వెతుక్కుంటూ పట్టణాల బాట పడుతున్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా విద్యా సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఉన్నత విద్య  గ్రామీణ ప్రజలకు చాలా దూరం. అందుకే పిల్లల చదువుల కోసం చాలామంది తల్లిదండ్రులు సొంత ఊరిని విడిచి పట్టణాలకు వెళ్తున్నారు. పిల్లల చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు కూడా పట్టణాల్లోనే దొరకడంతో అక్కడే స్థిరపడుతున్నారు.

కొంతమంది తమ పిల్లల్ని బాగా చదివించి విదేశాలకు పంపించారు. వాళ్లలో ఎక్కువమంది మళ్లీ తిరిగి రావడం లేదు. అలాంటివాళ్లు చాలామంది తమ తల్లిదండ్రులను ఊళ్లకు దగ్గరగా ఉన్న సిటీల్లో ఉంచుతున్నారు. సిటీల్లో అయితే ఎమర్జెన్సీ హెల్త్​ సర్వీసులు, ఆన్​లైన్​ డెలివరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. ఈ సౌకర్యాల కోసం ఎక్కువమంది సిటీలకు షిఫ్ట్​ అవుతున్నారు. ఊళ్లలో కాస్త ఎక్కువ డబ్బు ఉన్నవాళ్లు కూడా సిటీల్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు.  

ఇండియాకు వలసలు

భారతదేశం శతాబ్దాలుగా అంతర్జాతీయ వలసదారులను ఆకర్షిస్తోంది. 2020 నాటికి దాదాపు 4.9 మిలియన్ల మంది విదేశాల్లో -పుట్టినవాళ్లు ఇండియాలో ఉన్నారు. దీని ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వలసదారులు ఉన్న దేశాల లిస్ట్ ‌లో14వ స్థానంలో ఉంది. అయితే మన దేశంలో ఉన్న వలసదారులు దేశ జనాభాలో 0.4 శాతం కంటే తక్కువే. వందల ఏండ్ల క్రితమే అలెగ్జాండర్ ది గ్రేట్, మధ్య ఆసియాలోని కుషాన్ ‌లు, ముస్లిం సుల్తానులు, పర్షియన్లు, పోర్చుగీస్, మొఘల్స్​ చివరగా బ్రిటిష్ వాళ్ల కాలంలో ఎంతోమంది వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్ నుండి ఇండియాకు వచ్చిన వలసదారుల సంఖ్య ఈ మధ్య చాలావరకు తగ్గింది. అందుకు కారణం బంగ్లాదేశ్ ‌ ఆర్థిక వృద్ధి సాధించడమే. 

రెండు తరాలు

హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని ఆలియాబాద్ ఒక చిన్న గ్రామం. దాదాపు 500 మంది జనాభా ఉంటారు. ఇక్కడి నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా లాంటి దేశాలకు సుమారు 70 మంది వెళ్లారు. ఒక్కో ఇంటి నుంచి రెండు తరాలకు చెందినవాళ్లు అక్కడే ఉన్నారు. ఒకర్ని చూసి ఇంకొకరు బయటి దేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామం నుంచి వెళ్తున్నారు. ముందుగా స్టడీ వీసాతో వెళ్లి అక్కడే ఉద్యోగం సంపాదించి సెటిల్​ అయిపోతున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎల్లమ్మ పట్నాలకు వాళ్లంతా సొంత ఊరికి వస్తుంటారు.

గల్ఫ్​ బాట...

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం రాచాపూర్ గ్రామానికి చెందిన మూడు వందల మంది  దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా, షార్జాలకు వలస వెళ్లారు. వాళ్లలో 150 మందికి పైగా యువకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెళ్లినవాళ్లే. వాళ్లంతా స్థానికంగా ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు చెప్పారు. ఈ గ్రామ జనాభా రెండు వేలు కాగా 480 కుటుంబాలు ఉన్నాయి. అలాగే సారంగాపూర్ మండలం యాకర్ పెల్లి గ్రామం నుంచి దాదాపు 150 మందికి పైగా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. వాళ్లలో 100 మంది యువకులే. అంతా తెలంగాణ ఏర్పడిన తర్వాత వెళ్లిన వాళ్లే.

మారిషస్​లో మనవాళ్లే

వాస్తవానికి ప్రపంచంలో ఇండియా నుంచి వలసవెళ్లేవాళ్లే ఎక్కువ. అంటే.. భారత సంతతికి చెందినవాళ్లే ఎక్కువమంది విదేశాల్లో ఉన్నారన్నమాట. విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 3.2 కోట్ల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు విదేశాల్లో ఉన్నారు. అంతేకాదు.. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం సగటున 25 లక్షల మంది విదేశాలకు వలసలు వెళ్తున్నారు.  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. మారిషస్ ‌లో 9.94 లక్షల మంది ఇండియన్లు ఉంటున్నారు. వాళ్లలో భారత సంతతికి చెందిన వ్యక్తులే ఎక్కువ. ఈ లెక్కన మారిషస్ జనాభాలో దాదాపు 66% భారతీయులే ఉన్నారు. ఇండియన్స్​ అక్కడికి ఎలా వెళ్లారంటే.. 19వ శతాబ్దంలో మారిషస్​లో కార్మికుల కొరత ఉండడంతో బీహార్, ఉత్తరప్రదేశ్ ‌తోపాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి కొంతమందిని కార్మికులుగా తీసుకెళ్లారు.

వాళ్లలో తమిళులు, తెలుగువాళ్లు, మరాఠీ వాళ్లు కూడా ఉన్నారు. అలా వెళ్లినవాళ్లంతా అక్కడే సెటిలయ్యారు. ఇండో–-మారిషస్​ జనాభాలో ఇండియా నుంచి వెళ్లిన హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ హిందూ మతమే  ప్రధానమైనది. దాదాపు 48.54% శాతం హిందువులే ఉన్నారక్కడ. మన దగ్గర ఉన్నట్టే అక్కడ కూడా ఆలయాలు కనిపిస్తాయి. 

అక్కడే సెటిల్​

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామంలో1980 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మందికి పైగా గల్ఫ్​కి వెళ్లారు. అందులో కొంతమంది తిరిగి రాగా.. ప్రస్తుతం 250 మంది వరకు వేరువేరు దేశాల్లో ఉన్నారు. కాగా ఇందులో కొందరే చదువుల కోసం బయటి దేశాలకు వెళ్లారు. ఎక్కువ మంది ఉపాధి కోసం వెళ్లారు. ఇక్కడితో పోలిస్తే గల్ఫ్​ దేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో కూడా అక్కడే సెటిల్​ అయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి పంచాయతీ పరిధి కరీంబాద్​(కాశ కాలనీ) జనాభా దాదాపు 700. ఇక్కడుండే కాశ తురకలకు సరైన ఉపాధి లేకపోవడంతో దాదాపు 90 మంది దుబాయి​కి వెళ్లారు. ఇందులో 10 మంది మాత్రమే వివిధ చదువుల నిమిత్తం వెళ్లారు. మిగతా వాళ్లంతా దుబాయిలో లేబర్​ వర్క్​ చేస్తున్నారు. 

బహ్రెయిన్​లో ఎలక్ట్రికల్​ వర్క్​

మాది పేద కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చిన్న ఇల్లు తప్ప  వ్యవసాయమేమీ లేదు. నాన్న కూలీ పనులకు వెళ్లేది. ఇంటికాడ రూపాయి సంపాదన లేదు.  చిల్లర ఖర్చులకు కూడా తల్లిదండ్రుల వద్ద చేయి చాపాల్సి వచ్చేది. బంధువులు చెప్పడంతో 2018లో  మొదటి సారి బెహ్రెయిన్​ పోయిన. ఎలక్ర్టికల్​ వర్క్ చేస్తూ  నెలకు 125 దినార్​​లు సంపాదిస్తున్న. వాటి విలువ ఇండియాలో రూ.25 వేల వరకు ఉంటుంది. కంపెనీ వాళ్లే వసతి ఇచ్చారు. వంటకు అయ్యే ఖర్చు మినహా  మిగతా డబ్బులను ఇంటికి పంపిస్తున్న. ఊళ్లో సరైన ఉపాధి లేక వలస బాట పట్టినా.. ఇప్పటికీ గ్రామాల్లో సరైన ఉపాధి దొరకని పరిస్థితి. అందుకే ఇక్కడే సెటిల్​ అవుదాం అనుకుంటున్నా.

- పిడిశెట్టి శ్రవణ్, కేశవాపూర్ 

సొంతూళ్లలో ఇండ్లు

కామారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాల నుంచి  ఎక్కువ సంఖ్యలో  ఉపాధి కోసం  సౌదీకి వెళ్లారు.  ముఖ్యంగా జిల్లాలోని సదాశివనగర్, మాచారెడ్డి,  రామారెడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాల నుంచి 150  మందికి వరకు ఉపాధి కోసం వెళ్లారు. నిజాంసాగర్ మండలంలో తెల్గాపూర్, లింగంపేట, తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని కొన్ని గ్రామాల నుంచి కూడా వెళ్లారు. అక్కడికి వెళ్లి సంపాదించి, సొంతూళ్లలో ఇండ్లు కట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. నిజాంసాగర్ మండలం  తెల్గాపూర్ జనాభా 600.  ఇక్కడ150 కుటుంబాలు ఉంటాయి. 110 మంది వరకు  గల్ఫ్​ దేశాలకు వెళ్లారు. 

నేను, నా ఇద్దరు కొడుకులు వెళ్లాం

నేను, నా ఇద్దరు కొడుకులు దుబాయికి వెళ్లాం. ఏడేండ్లు అక్కడ ఉన్నాం.  ఆరోగ్యం సరిగలేక  ఏడాది కిందట నేను, నా పెద్దకొడుకు వెంకట్ తిరిగి వచ్చాం. చిన్న కొడుకు శ్రీనివాస్ అక్కడే ఉన్నాడు. నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చని వెళ్తున్నాం. ఆరోగ్యం బాగైన తర్వాత మళ్లీ పోదామనుకుంటున్నాం. 
- పోచాగౌడ్, తెల్గాపూర్

150 మంది గల్ఫ్​లో.. 

మాచారెడ్డి మండలం ఘన్​పూర్​ గ్రామ జనాభా 2,100 .  ఇక్కడ ఓటర్లు 1,615 మంది ఉన్నారు.  ఇక్కడి నుంచి కొన్నేళ్లుగా  ఉపాధి కోసం గల్ఫ్​ దేశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం 150 మంది వరకు గల్ఫ్​లో ఉన్నారు. కొందరు కొన్నేండ్లు అక్కడ ఉండి వచ్చారు. అలా వెళ్లినవాళ్లలో కొందరు ఆర్థికంగా  స్థిరపడి  ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు. వాళ్లను చూసి  మరికొందరు వెళ్లారు. ఈ మధ్య పదిరోజుల్లోనే ముగ్గురు వెళ్లారు. 
- ప్రశాంత్​గౌడ్, ఘన్​పూర్​, మాచారెడ్డి

మావోడు ఆస్ట్రేలియాలో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తుండు. అక్కడ్నే సొంతిల్లు కూడా కొన్నడు. మమ్మల్ని వచ్చేయమంటుండు. కానీ.. మాకేమో ఊరిడిసిపోబుద్ధి అయితలేదు. నా కొడుకు సదువుకుంటా అని అమెరికా పోయిండు. అక్కడ్నే ఉద్యోగంలో చేరిండు. లగ్గం కూడా అక్కడ్నే చేస్కుండు. ఇప్పుడు గ్రీన్ కార్డ్​ కూడా వచ్చింది. నేను కూడా అప్పుడప్పుడు పోయొస్తున్న. నాకైతే అమెరికాల జీవితం మస్తు మంచిగుంటది. పల్లెటూరిలో పుట్టి, పెరిగిన ఒక పెద్దాయన ఈ మధ్యే హైదరాబాద్​ వచ్చిండు. ఒక పెద్ద విల్లా కొనుక్కున్నడు. సిటీకి దగ్గర్లోనే పెద్ద ఫాంహౌజ్​ కొన్నడు. పైసలు ఎక్కడ్నుంచి వచ్చినయంటే.. ‘కొడుకు బయటి దేశంల జాబ్​ చేస్తుండు. అక్కడ సంపాదించిన పైసలతోనే ఇవన్నీ కొంటున్న’ అన్నడు. 

ఇలాంటి వాళ్లు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. ఇదివరకటితో పోలిస్తే.. ఇలాంటి వలసలు ఈ మధ్య బాగా పెరిగాయి. సుఖంగ బతకడానికి, మంచి జీతం కోసం చాలామంది ఊళ్లు విడిచిపెడుతున్నారు. అందుకు తగ్గట్టు అవకాశాలను దక్కించుకుంటున్నారు. అనుకున్నట్టు బతుకుతున్నమని ఆనందిస్తున్నరు కూడా చాలామంది.