ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారతీయులకు వీసా అవసరం లేదు

ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..  భారతీయులకు వీసా అవసరం లేదు

భారతీయ పర్యాటకులు ఇకపై వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.  భారత్ నుండి వచ్చే పర్యాటకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ క్యాబినెట్ నిర్ణయించింది.  

 ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ఈ విషయాన్ని తెలిపారు. డిసెంబర్ 15న  జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం జర్ఘామి విలేకరులతో మాట్లాడుతూ, పర్యాటకుల రాకపోకలను పెంచడంతోపాటు ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

పర్యాటకాన్ని పెంచే ప్రయత్నాలు ఇరానోఫోబియా ప్రచారాలను నిర్వీర్యం చేయగలవని ఎజ్జతోల్లా జర్ఘామి అన్నారు.  దీంతో వీసా అవసరం లేకుండా ఇరాన్‌లో పర్యటించే అవకాశమున్న దేశాల సంఖ్య 45కి చేరింది.  కాగా గత కొద్దినెలలుగా పలు దేశాలు భారత పర్యాటకులకు వీసా మినహాయింపులును ఇస్తున్నాయి. శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, కెన్యాలు ఇప్పటికే భారత పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పించగా.. తాజాగా ఇరాన్‌ ఆ జాబితాలో చేరింది.