భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి

భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలు రాయి

భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ జోరుగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన దేశం తాజాగా మరో మైలు రాయి దాటేసింది. దేశంలో అర్హులైన జనాభాలో..50శాతం మందికిపైగా రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు. ‘భారత టీకా కార్యక్రమం మరో మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుపుతోన్న పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వేగాన్ని కొనసాగించడం ముఖ్యం. అందుకే మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి ఇతర కొవిడ్ నిబంధనలను అనుసరించండి’ అని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా నిన్నటివరకు 127 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 47.9 కోట్ల మందికి రెండు డోసులు, 80 కోట్లమంది మొదటి డోసు వేయించుకున్నారు.  ఇప్పటివరకు ఆరుసార్లు ఒక్కరోజే కోటికిపైగా డోసులు ప్రజలకు అందాయి. ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 127.66 కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో 84.4 మంది ఇప్పటి వరకు కనీసం ఒక డోసు తీసుకున్నారని వివరించింది. ఇప్పటి వరకు 47.59కోట్ల మంది రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క రోజులో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ఇది ఆరోసారి అని పేర్కొంది. ఇదిలా ఉండగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదవగా.. 2,796 మరణాలు నమోదయ్యాయి.