- మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : ‘ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదు.. అది నిరుపేద కుటుంబం జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమ’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై బుధవారం ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కొల్లాపూర్ నియోజకవర్గంలో మొదటి విడత కింద మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు మంజూరైనా నిర్మాణాలు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని, అనుమతి పొందిన ప్రతి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
గడువులోగా ప్రారంభం కాని ఇండ్లను ఇతర గ్రామాలకు కేటాయిస్తామని హెచ్చరించారు. టెక్నికల్ కారణాలతో పేమెంట్లు నిలిచిపోయిన 57 మంది లబ్ధిదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, గృహ నిర్మాణ శాఖ మంత్రితోనూ చర్చిస్తున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
సొంతంగా ఇల్లు కట్టించుకోలేని వారికి ప్రత్యేక ఏజెన్సీ ద్వారా రూ.5 లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించే విధానాన్ని వివరించారు. రెండో విడత కింద మంజూరైన రెండు వేల ఇండ్లను గుడిసెల్లో నివసించే వారికే కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి పాల్గొన్నారు.
మినీ స్టేడియానికి నాలుగు ఎకరాలు విరాళం
కొల్లాపూర్/కోడేరు , వెలుగు : మినీ స్టేడియం నిర్మాణం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు తన నాలుగు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. వీపనగండ్ల మండల కేంద్రంలోని 532 సర్వే నంబర్‌లో ఉన్న రూ. 1.50 కోట్ల విలువైన భూమిని 4 ఎకరాలను వనపర్తి జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి అందజేశారు. ఈ మేరకు బుధవారం కోడేరు తహసీల్దార్ ఆఫీస్‌లో డిజిటల్ సంతకం చేసి విరాళం ప్రక్రియను
పూర్తి చేశారు.
