మహిళా సాధ్వి బ్యాగ్‌లో మనిషి పుర్రె, ఎముకలు

మహిళా సాధ్వి బ్యాగ్‌లో మనిషి పుర్రె, ఎముకలు

ఇండోర్: విమానం ఎక్కబోతున్న ఓ మహిళా సాధ్వి బ్యాగులో మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. ఇండోర్‌లోని దేవీ అహల్యా బాయ్ హోల్కర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఉజ్జయినికి చెందిన సాధ్వి యోగమాత సచ్‌దేవ సోమవారం ఉదయం ఇండోర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి ఎయిర్‎పోర్టుకు వచ్చారు. అందుకోసం ఆమె విస్తారా ఎయిర్‌లైన్స్‎లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే సాధ్వి ఎయిర్‎పోర్టులోకి ప్రవేశించే సమయంలో ఆమె బ్యాగును అధికారులు స్క్రీనింగ్ చేశారు. ఆ స్క్రీనింగ్ లో అధికారులు అనుమానాస్పదంగా బ్యాగులో ఏదో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సాధ్విని పిలిచి.. బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగు నుంచి మానవ పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. దాంతో స్క్రీనింగ్ అధికారులు వెంటనే ఎయిర్‌లైన్స్ మరియు సీఐఎస్ఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. 

సాధారణంగా ఎవరైనా సరే తమకు కావలసిన వారి బూడిదను హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే తీసుకెళ్లవచ్చని ఎయిర్‎పోర్టు అధికారులు తెలిపారు. కానీ, మీరు మాత్రం ఎముకలు, పుర్రె తీసుకెళ్తున్నారని.. అందుకే మీకు విమానం ఎక్కడానికి అనుమతి లేదని వారు చెప్పారు. దాంతో తాను ఎముకలను నిమజ్జనం చేయడానికి హరిద్వార్ వెళ్తున్నానని సాధ్వి చెప్పుకొచ్చింది. అయినా కూడా విమానాశ్రయ అధికారులు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. మీరు వెళ్లడం తప్పనిసరి అయితే.. మీ వెంట ఉన్న ఈ పుర్రెను, ఎముకలను మీకు తెలిసినవారికి ఇచ్చి, మీరు విమానం ఎక్కొచ్చని అధికారులు తెలిపారు. దాంతో సాధ్వి తనకు తెలిసిన వ్యక్తిని రప్పించి.. ఆయనకు ఎముకలు, పుర్రె ఇచ్చి పంపింది. అయితే అప్పటికే బాగా ఆలస్యం  కావడంతో ఆమె ఎక్కాల్సిన విమానం వెళ్లిపోయింది. దాంతో విమానశ్రయ అధికారులు రాత్రి 8.30 గంటలకు ఆమెను మరో ఫ్లైట్‎లో ఢిల్లీకి పంపించారు.