ఉద్యమం ఉప్పెనగా మారింది ఇక్కడే...

ఉద్యమం ఉప్పెనగా మారింది ఇక్కడే...

ఉద్యమానికి ఊపిరిలూదిన దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ఈ గీతం పురుడుపోసుకుంది ఇక్కడే తెలంగాణ విమోచన ఉద్యమంలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన స్ఫూర్తి గీతం ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ ఇందూరు గడ్డపైనే పురుడు పోసుకుంది.  తెలంగాణకు విముక్తికి జిల్లా జైలు వేదికగా నిలిచి అణచివేత నుంచి ఉద్యమం ఉప్పెనగా మారి నిజాం నవాబుల మెడలు వంచింది. ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది.

నిజామాబాద్,  వెలుగు: నిజామాబాద్ జిల్లా జైలుగా పిలిచిన ఖిల్లా జైలులో తెలంగాణ ఉద్యమానికి నాందిపడింది. మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఈ జైలు గోడలపైనే బొగ్గుతో అనేక స్ఫూర్తి గీతాలు రాశారు. అందులో ప్రధానమైంది.. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే గేయం.. ఇది ఆ నాడు నిజామాబాద్ జైలు గోడల మధ్య ప్రతిధ్వనించి ఇప్పటికీ తెలంగాణ జనం నోళ్లలో నానుతూ వస్తోంది. ఆంధ్ర మహాసభలో చురుగ్గా పాల్గొంటున్న దాశరథిని నిజాం పాలకులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 150 మందిని అత్యంత కట్టుదిట్టమైన నిజామాబాద్ ఖిల్లా జైలుకు తరలించారు. ఈ జైలులోని గదులు చాలక పోవడంతో ఆరుబయట వరండాలు, స్నానాల గదుల్లో ఉద్యమకారులను నిర్బంధించారు. అప్పటికే అనేక ఉద్యమ గీతాలతో జనాన్ని చైతన్య పరుస్తున్న దాశరథి జైలు గోడల మధ్య అనుభవిస్తున్న వ్యధను తోటి ఉద్యమకారులతో పంచుకునేవారు. పాటలు, గేయాల రూపంలో వారిని ఉత్సాహ పరిచేవారు. ఈ క్రమంలోనే పల్లు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతో కొన్ని గేయాలు జైలు గోడలపై రాశారు. 

ప్రత్యక్ష పోరాటంలో...

ఇందూరుతో పాటు ఆర్మూర్, వేల్పూర్, భీంగల్, ధర్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు. యువకులను ఉద్యమకారులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక వ్యాయామ శాలలు, కర్రసాము నేర్పే కేంద్రాలు నడిపించారు. కుమార్‌‌‌‌‌‌‌‌గల్లిలోని భజరంగ్ వ్యాయామ శాల వందల మందిని కండలవీరులుగా తీర్చిదిద్దింది. ఇందులోని ముఖ్యులు గంజుల నారాయణ, గంజుల పోశెట్టి, విఠల్ దాస్, శంకర్ తదితరులు రజాకార్లను ఎదిరించారు. ఈ ఉద్యమంలో ఈ ప్రాంత వాసులు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. నల్ల నర్సింహారెడ్డి 1931లో రజాకర్ల చేతుల్లో మరణించాడు.  1939లో సమాజ్ కార్యకర్త రాధాకిషన్ మొదాని అమరుడయ్యారు. వారి స్మృతికి చిహ్నంగా ఆర్యసమాజ్‌‌‌‌లో రాధాకృష్ణ పాఠశాల, సుభాష్ నగర్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయంలో జైలు ఏర్పాటు చేయగా అప్పటి నుండి జైలు శాఖ ఆధీనంలో ఉంది. అయితే శ్రీరామ నవమి రోజున భక్తుల ప్రవేశానికి అనుమతించే వారు. కాలక్రమేణా జైలు ను  సారంగాపూర్‌‌‌‌‌‌‌‌కు   తరలించి ఇక్కడ రామాలయాభివృద్ధి చేపట్టారు. రఘునాథ ఆలయం నిత్యపూజలతో వర్ధిల్లుతోంది.

పిడికిలెత్తిన పిట్లం..నిజాంతో పోరాడి జైలుకు వెళ్లిన యోధులు

పిట్లం, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటంలో పిట్లంకు ప్రత్యేక చరిత్ర ఉంది. రజాకార్ల దౌర్జాన్యాలకు వ్యతిరేకంగా జరిగిన నాటి పోరాటంలో నిజాం ప్రభుత్వం బాన్సువాడ సబ్​డివిజన్‌‌‌‌లో 8 మందిని జైలులో పెట్టింది. అందులో ఆరుగురు పిట్లంకు చెందిన నీలకంటి నారాయణ, గంగ నాగయ్య, ఉప్పు లక్ష్మయ్య, కొండ నారాయణ, కుమ్మరి లక్ష్మారెడ్డి, నీలకంటి లక్ష్మయ్య, బాన్సువాడకు చెందిన జి.కృష్ణారావు, కామినేని సుబ్బారావు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ఎవరు జీవించిలేరు.

రాష్ట్రపతి చేతుల మీదుగా తామ్రపత్రం

నిజాం పాలనకు వ్యతిరేకంగా వీరు చేసిన పోరాటాలను కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. వీరి త్యాగాలకు గుర్తుగా ఢిల్లీలో 1972లో రాష్ట్రపతి చేతుల మీదుగా తామ్రపత్రం అందజేసి గౌరవించింది. నిజాం నిరంకుశ పాలన అందరికి గుర్తుండే విధంగా స్ఫూర్తి కలిగేలా ప్రభుత్వం ఇచ్చిన పారితోషికంతో పిట్లం ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశభక్తిని చాటుకున్నారు. గాంధీ జయంతి, జాతీయ పండగల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వారి త్యాగాలను స్మరించుకుంటారు. ఈ త్యాగదనులను గుర్తుంచుకునేలా బాన్సువాడ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందు ఏర్పాటు చేసిన శిలాఫలకంపై వారిపేర్లను చెక్కించారు. సెప్టెంబర్​17ను తెలంగాణ నుంచి విడిపోయి కొన్ని భాగాలు మహారాష్ట్ర, కర్నాటకలో కలవగా అక్కడి ప్రభుత్వాలు ఈ రోజును స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విమోచన దినం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంపై అమరుల వారసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

గర్వంగా ఉంది

నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మా తాతతో పాటు మరికొందరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇది చెప్పుకోవడం నాకు గర్వంగా అనిపిస్తుంది. వారు చేసిన త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. గతంలో ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇప్పటికైనా సర్కారు గుర్తించడం సంతోషం.

- నీలకంఠి వెంకటేశ్ (నీలకంటి లక్ష్మయ్య మనవడు)

భావితరాలకు తెలియజేయాలి

నిజాం నిరంకుశ పాలన, రజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని భావితరాలకు తెలియజేయాలి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత విమోచన దినం నిర్వహిస్తుండడం సంతోషకరం. తెలంగాణ ఆత్మ గౌరవ నినాదంతో వచ్చిన ప్రభుత్వతం నాటి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు అందించాలి. 

- చంద్రశేఖర్, 
(ఉప్పు లక్ష్మయ్య కుమారుడు)