9ఏOడ్లల్లో...  ఖజానా ఖల్లాస్.. 60 శాతం ప్రజలకు బడ్జెట్ లో 2 శాతమే 

9ఏOడ్లల్లో...  ఖజానా ఖల్లాస్.. 60 శాతం ప్రజలకు బడ్జెట్ లో 2 శాతమే 

మన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లు పూర్తికాగానే రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలను, అభివృద్ధి రంగాలను, నాలుగు కోట్ల ప్రజలను బందీలుగా చేసిన ఒక్క కుటుంబ పాలనలో వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈ వేడుకలు జరుగుతున్నయి. 2014లో దాదాపు 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో మొదలైన మన రాష్ట్ర ఆర్థిక ప్రస్థానం.. 5 లక్షల 50 వేల కోట్ల రూపాయల అప్పును నాలుగు కోట్ల ప్రజల నెత్తిపై మోపే వరకు వెళ్లింది. ఇవి గాక 40 వేల కోట్ల రూపాయలు అప్పు విద్యుత్ సంస్థలపై ఉంది. ఆర్టీసీ పదివేల కోట్ల రూపాయల అప్పులతో మూలుగుతున్నది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ కూడా పదివేల కోట్ల రూపాయల అప్పు చేయాల్సి వచ్చింది. ఆరు దశాబ్దాల పాటు అనేక త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ప్రజల పరిస్థితి.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. రైతులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు, ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న స్టూడెంట్లు నిరాదరణకు గురై తీవ్ర ఆందోళనలో ఉన్న సంగతి పాలకులకు కనబడటం లేదు కావచ్చు.

300 శాతం పెరిగిన పన్నులు

కేసీఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్లలో అన్ని రకాల పన్నులను 300 శాతం పెంచింది. ప్రభుత్వ భూములను కారు చౌకగా అస్మదీయులకు, బంధువులకు అమ్మేసింది. అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను అగ్గువకు లీజుకి ఇచ్చింది. ధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా ఉందంటూ పంచరంగుల వన్నెలతో పబ్లిసిటీ ఇచ్చేందుకు ప్రకటనల కోసం వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నది. ఓడిపోయిన, పదవులు లభించని నాయకులు, అవినీతి, రిటైర్డ్ ఉన్నతాధికారులను సలహాదారులుగా నియమించుకొని వారి జీతభత్యాలు, రకరకాల వసతుల కోసం ఏటా 500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నది. 2023–24 బడ్జెట్ 2లక్షల 90 వేల కోట్ల రూపాయలు. వాస్తవానికి అందులో 90 వేల కోట్ల రూపాయలు ఉతుత్తదే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకునే అప్పులను అధికంగా చూపిస్తోంది. బడ్జెట్ ను పెంచి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నది. రాష్ట్ర ప్రణాళిక మండలిలో ఆర్థిక మంత్రిగా హరీశ్​రావు, ప్రణాళిక మండలి చైర్మన్ చంద్రశేఖర రావు, వైస్ చైర్మన్ వినోద రావు(ముగ్గురు బంధువులే) తప్ప ఇంకొకరికి స్థానమే లేదు. ఈ తొమ్మిదేండ్లలో వీరు రాష్ట్రానికి సంబంధించి ఒక్క ముసాయిదా ప్రణాళిక కూడా తయారు చేయలేకపోయారు.

నిరుద్యోగులకు నిరాశే..

గత తొమ్మిది సంవత్సరాల నుండి నిరుద్యోగులకు లభించిన అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు 70 వేలకు మించలేదు. హైదరాబాదులో హైటెక్ సిటీ ఫార్మాసిటీ అభివృద్ధి వల్ల తెలంగాణ నిరుద్యోగులకు లభించిన జాబ్స్​ కేవలం 10 శాతం మించవు. వివిధ జిల్లాల్లో పరిశ్రమల వికేంద్రీకరణ జరిగినట్లయితే స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగాలు లభించేవి. పారిశ్రామిక విస్తరణ, వికేంద్రీకరణ, ఉపాధి ఉద్యోగాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం చేసింది శూన్యమే అని ప్రస్తుతం జరుగుతున్న నిరుద్యోగుల నిరసనలే తెలియజేస్తున్నాయి.

డొల్ల కంపెనీలకు వేలాది ఎకరాలు

పరిశ్రమల విషయానికి వస్తే రాష్ట్రంలో హైదరాబాదు చుట్టుపక్కల వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు తప్ప మిగతా జిల్లాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఖాయిలా పడిన అనేక పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తామని ఉద్యమ కాలంలో కేసీఆర్ నమ్మబలికారు. రాష్ట్రం ఏర్పడ్డాక వాటి రీఓపెన్​ అటుంచి.. ఎటూరునాగారంలోని కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీ మూతబడింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. సీఎం, మంత్రులు ఎంతో ఆర్భాటంగా రాష్ట్రమంతటా వివిధ పరిశ్రమలకు వేసిన శిలఫలకాల రాళ్లు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. అనేక డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు రిజిస్టర్ చేసుకొని హైదరాబాద్​చుట్టు ఎంతో విలువైన వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టారు. సింగపూరు, థాయిలాండ్, యూరోపియన్ దేశాలు, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ లతో  ఫొటోలు దిగి ప్రకటనలు ఇస్తే పరిశ్రమలు రావు. ఇవన్నీ తొమ్మిదేండ్ల నుంచి సాగుతున్న ప్రజలను మభ్యపెట్టే తతంగాలే.

వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం గమనించడం లేదు. అన్ని రకాల పంటలు మాన్పించి కేవలం వరినే ప్రోత్సహించడం వల్ల వరి ఉత్పత్తి పెరిగి ఉండవచ్చు కానీ రైతుల ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, అకాల వర్షాలు, కొనుగోలు సెంటర్లలో దోపిడీ, గిట్టుబాటు ధర రాకపోవడం, రుణమాఫీ చేయకపోవడం, పంటల బీమా పథకాన్ని నిర్లక్ష్యం చేయడం, ఎరువులు, విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీలు ఎత్తివేశారు. ఇలాంటి చిన్న సన్న కారు రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం నష్టదాయకంగా మారి ఈ తొమ్మిదేండ్లలో 9,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతు సూసైడ్స్​లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

రైతులకు ప్రయోజనం లేని కాళేశ్వరం

కాంట్రాక్టర్లకు లాభాలు.. నేతలు, అవినీతి ఆఫీసర్లకు కమీషన్లు లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ మార్చుతున్నారు. రీడిజైన్​ పేరుతో అంచనాలను 300 శాతం పెంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఖర్చును 1లక్ష 20 వేల కోట్ల రూపాయలకు చేర్చింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వం ఎన్ని కాకి లెక్కలు చెప్పినా వాస్తవానికి ఈ ప్రాజెక్టు 59 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇస్తున్నది. అయితే 18 లక్షల ఎకరాలకు నీరు వస్తుందని ఇప్పటికీ కోట్ల రూపాయాలు ఖర్చు చేసి ఫేక్​ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ చార్జీలకే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే అప్పులపై వడ్డీలు పదివేల కోట్ల రూపాయలు తోపాటు పంపు హౌస్ లో నిర్వహణకు ఇంకో రూ.5000 కోట్లు ఇలా ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు పేరు మీద దాదాపు 25 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేని నిరర్థకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను చూసి సాగునీటి రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. పాత పైపులు పీకేసి కొత్త పైపులు వేయడం మాత్రమే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని రూ.40 వేల కోట్లు అప్పుచేసి ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ఇంకా అసంపూర్తిగానే ఉంది.

లిక్కర్ పాలసీతో కుటుంబాలు ధ్వంసం

లిక్కర్ ​వ్యాపారాన్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రోత్సహిస్తున్నది రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏటా రూ.8వేల కోట్లు ఉన్న ఉన్న లిక్కర్​ఆదాయం.. ఏడాదికి రూ.45 వేల కోట్లకు చేరేలా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. ముఖ్యంగా బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్ రెస్టారెంట్లు, పబ్బులు రాష్ట్రమంతా విస్తరించే విధానాలు అవలంభించింది. ఈ విషయంలో మాజీ సీఎస్​సోమేశ్ కుమార్ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. మద్యం వ్యాపారం విస్తరించడం వల్ల సమాజం ఎంత విధ్వంసానికి గురి అవుతుందో వేరే చెప్పనవసరం లేదు. రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్  వ్యాపారాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నది. కొత్త జిల్లాలు, కొత్త మండలాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు కానీ రైతుల వ్యవసాయ భూములన్ని చెక్కలు ముక్కలై సాగుకు దూరమయ్యాయి.

60 శాతం ప్రజలకు బడ్జెట్​లో 2 శాతమే

ప్రస్తుత ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈ సంవత్సరం రూ.30 వేల కోట్ల వడ్డీ (ప్రతి నెల 2500 కోట్లు) కట్టాల్సి వస్తున్నది. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం మిత్తీలకే పోతున్నది. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి అంతా కలిపితే సంవత్సరం బడ్జెట్లో 2శాతం కూడా కాదు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న పేదల సంక్షేమానికి తొమ్మిదేండ్లుగా ఈ పాలకులు చేస్తున్న ఖర్చు బడ్జెట్ లో 2శాతం నిధులు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమల అభివృద్ధితో పాటు పేద ప్రజల జీవన విధానం మెరుగుపరచడానికి సంక్షేమ పథకాలు శాస్త్రీయ పద్ధతిలో అమలుపరచాలి.. కానీ అవేవి జరగలేదు. ఐదున్నర లక్షల కోట్ల అప్పు చేసి.. ఆదాయాన్ని పెంచే ఉపయోగకరమైన పనులు చేయకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు అంతా అంధకారంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి ఈ నాయకులు వెళ్లిపోతారు. ఈ అప్పుల వడ్డీల భారం అంతా పేద ప్రజలపై, భవిష్యత్తు తరాలపై పడుతుంది.

పదవి విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ తదితర చెల్లింపులు ఆగిపోయాయి. ప్రావిడెంట్ ఫండ్ నుంచి రుణాలు ఇవ్వలేకపోతున్నారు. రెండు సంవత్సరాల నుంచి రావలసిన డీఏ బకాయిలు ఇవ్వలేదు. మహిళా సంఘాల జీరో వడ్డీ బకాయిలు 2018 నుంచి రూ.3 వేల కోట్లు పేరుకుపోయాయి. రైతు రుణమాఫీ పెండింగ్ లో ఉంది. గ్రామపంచాయతీలకు చెల్లించవలసిన రూ.1370 కోట్లు విడుదల చేయలేదు. 2023–24 సంవత్సరానికి గాను బడ్జెట్లో చూపించిన రూ.17వేల కోట్ల దళిత బంధు నిధులు విడుదల చేయలేదు. ఎన్నికల ముందు రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం వలన నాయకుల అధికారుల ముందున్న ప్రత్యామ్నాయాలు.. విలువైన ప్రభుత్వ భూములను అమ్మడం లేదా దీర్ఘకాలంగా లీజుకు ఇవ్వడం మాత్రమే. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు టోలు వసూలు కాంట్రాక్టును కారు చౌకగా 30 సంవత్సరాల లీజ్ కు ఇచ్చారు. జీవో 111 రద్దుచేసి 84 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ దందాకు తెరతీసింది. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితులు కూడా రావచ్చు. ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు, నిజాయితీగల మేధావులు, ఉద్యోగులు, యువత.. రాష్ట్రాన్ని, సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగే ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవలసిన బాధ్యతను మరవొద్దు.
- ప్రొఫెసర్ కూరపాటి
వెంకటనారాయణ