ఈస్ట్​మన్​ కలర్​

ఈస్ట్​మన్​ కలర్​

సెకనుకో సెల్ఫీ తీసుకోవడం ఇప్పటి యూత్​ స్టైల్​. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి బెడ్​ మీదికి చేరేవరకు కొన్ని సెల్ఫీలు అయినా తీసుకోనిదే కొందరికి నిద్రపట్టదు. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకు 93 మిలియన్ల సెల్ఫీలు తీసుకుంటున్నారట. ఇది మొబైల్​ఫోన్స్​​ తెచ్చిన ట్రెండ్​. సెల్​ఫోన్​లు లేనప్పుడు కెమెరాతో ఫొటోలు తీసుకునేవాళ్లు. రెండు వందల ఏండ్లుగా మన చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాలను ఫొటోల్లో బంధించింది కెమెరా. అలాంటి కెమెరాల చరిత్రలో ​కొన్నేండ్లపాటు రారాజులా వెలిగింది ‘కొడాక్’​ కంపెనీ. సినిమాలకు రంగులద్దడంలో కూడా ‘కొడాక్’​ రీల్​దే మెయిన్​ రోల్​. దీని ఫౌండర్​ జార్జ్​ ఈస్ట్​మన్​ జీవితంలోని బ్లాక్​ అండ్ ​వైట్​, కలర్​ఫుల్​ సంగతులే ఈ వారం ఇన్​స్పిరేషన్​. అమెరికాలోని న్యూయార్క్ ​రాష్ట్రంలో ఉన్న వాటర్​విల్లే గ్రామంలో జులై 12, 1854లో పుట్టాడు జార్జ్​ ఈస్ట్​మన్​. తల్లిదండ్రులు జార్జ్​ వాషింగ్టన్​, మరియా. వీళ్లకు ఈస్ట్​మన్​ కంటే ముందు ఇద్దరు ఆడపిల్లలు కేటీ, ఎలెన్​  పుట్టారు. వీళ్లలో కేటీకి పోలియో వల్ల వీల్​చెయిర్​లోనే ఉండేది. 

ఆస్తంతా పోయి..

వాషింగ్టన్​కు సొంతూళ్లో పదెకరాల పొలం ఉండేది. కొన్ని రోజులకు దగ్గరలోని రోచెస్టర్​ టౌన్​లో బిజినెస్​ స్కూల్​ పెట్టాడు​.  పొలం, స్కూల్​ పనుల కోసం రోజూ సొంతూరి నుంచి రోచెస్టర్​కు తిరిగేవాడు. జీవితం బాగానే ఉందనుకునే టైంలో మెదడు సంబంధిత వ్యాధితో మంచాన పడ్డాడు. చికిత్స కోసం పొలం అమ్మేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కుటుంబం రోచెస్టర్​లోని ఒక అద్దె ఇంటికి మారింది. అయితే, ఆరోగ్యం బాగుపడక1862లో వాషింగ్టన్​ చనిపోయాడు. అప్పటికి ఈస్ట్​మన్​కు ఎనిమిదేండ్లు. వాషింగ్టన్​ చనిపోయాక కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. కారణం.. వాషింగ్టన్​ తాను సంపాదించిన సొమ్మును ఎక్కడ పెట్టాడో, ఎవరికి ఇచ్చాడో చెప్పలేదు.  అందుకే తండ్రి అంటే ఈస్ట్​మన్​కు కోపం. మరోవైపు భర్త చనిపోయాక​ స్కూల్ ​మీద వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది మరియా. అయితే, ఎన్ని కష్టాలున్నా కొడుకును చదివించడం మాత్రం ఆపలేదు.

అమ్మ కష్టాలు చూడలేక..

కుటుంబం కోసం అమ్మ పడుతున్న కష్టాలు చూసి ఈస్ట్​మన్​ బాధపడేవాడు.  తాను కూడా ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాడు. అప్పటికే పెద్దక్క ఎలెన్​కు పెండ్లి అయి క్లీవ్​లాండ్​ నగరానికి వెళ్లిపోయింది.1868లో స్కూల్​ మానేశాడు ఈస్ట్​మన్​. ఇన్సూరెన్స్​ కంపెనీలో మెసెంజర్​ బాయ్​గా చేరాడు. అక్కడ వారానికి 3 డాలర్లు ఇచ్చేవాళ్లు. ఆ మరుసటి ఏడాది ఇన్సూరెన్స్​ పాలసీలు అమ్మడం మొదలుపెట్టాడు. దానివల్ల వారానికి 6 డాలర్లు వచ్చేవి. జీతం పెరగడంతో క్రమంగా కుటుంబ బాధ్యతలన్నీ ఈస్ట్​మన్​ చేతుల్లోకి వచ్చాయి. అయితే, ఆదాయం, ఖర్చు వివరాలను కచ్చితంగా లెడ్జర్​ బుక్స్​లో రాసేవాడు. అలాగే రాత్రి స్కూల్​కి వెళ్లి అకౌంట్స్​పై పట్టు సాధించాడు. 

మరో కుటుంబం బాధ్యతలు

పోలియోతో బాధపడుతున్న చిన్నక్క కేటీ 1870లో చనిపోయింది. అదే టైంలో అగ్నిప్రమాదం వల్ల పక్కింట్లోని ‘హెన్రీ స్ట్రాంగ్’ ఫ్యామిలీ రోడ్డున పడింది. వాళ్లతో ఉన్న అనుబంధం వల్ల ఆ కుటుంబం బాధ్యతలను కూడా మరియా తీసుకుంది. దానివల్ల ఖర్చు పెరగడంతో1871లో మరో ఇన్సూరెన్స్​ కంపెనీలో చేరాడు ఈస్ట్​మన్​. మూడేండ్ల తర్వాత రోచెస్టర్ సేవింగ్స్​ బ్యాంక్​లో క్లర్క్​గా చేరాడు. ఏడాదిలోనే సెకండ్​ అసిస్టెంట్​ బుక్​కీపర్​ అయ్యాడు. దాంతో సంవత్సరానికి వెయ్యి డాలర్లు వచ్చేవి. ఆదాయం పెరగడంతో రియల్​ ఎస్టేట్​ బిజినెస్​ చేయాలనుకున్నాడు​. ఆ పని మీద దగ్గరలోని సిటీకి వెళ్లాలనుకున్నప్పడు ఒక ఫ్రెండ్​ సలహాతో కెమెరా కొనుక్కున్నాడు. అది ఈస్ట్​మన్​ జీవితాన్ని మలుపు తిప్పింది.

సొంత కంపెనీ​.. 

అప్పట్లో కెమెరాలు బాగా పెద్దవి. మూడుకాళ్ల నిలువెత్తు స్టాండ్​, దానిపైన టీవీ సైజులో కెమెరా, ప్లేట్​ హోల్డర్​, ఫొటోగ్రాఫిక్​ ప్లేట్స్​, డార్క్​రూమ్​ టెంట్​, ఫొటోలు కడగడానికి నీళ్ల కంటైనర్, వెట్​ ప్లేట్​​.. వీటన్నిటినీ తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. దాంతో చిన్న సైజులో కెమెరా, దానికి సరిపడా ఫిల్మ్​ తయారుచేయడంపై ప్రయోగాలు చేశాడు ఈస్ట్​మన్​. ఆ ప్రయత్నంలో డ్రై ప్లేట్స్​ కనుక్కున్నాడు. వెంటనే హెన్రీ స్ట్రాంగ్​తో కలసి కొడాక్​ కంపెనీ పెట్టాడు. అందులో తయారైన ‘డ్రై ప్లేట్స్​’కు తక్కువ రోజుల్లోనే డిమాండ్​ పెరిగింది. మరోవైపు బ్యాంక్​లో తనకు రావాల్సిన ప్రమోషన్​ను మేనేజర్​ తన బంధువుకు ఇవ్వడంతో జాబ్​కు రిజైన్​ చేశాడు. ఆ తర్వాత పూర్తి టైం కంపెనీ​ కోసమే పనిచేశాడు. ఆరుగురు ఉద్యోగులను చేర్చుకున్నాడు. అలాగే నాలుగంతస్తుల కొత్త బిల్డింగ్​లోకి​ కంపెనీని మార్చాడు. 

రోలబుల్​ ఫిల్మ్​, కెమెరా

కొన్ని రోజుల్లోనే బిజినెస్​లో ఇబ్బందులు మొదలయ్యాయి. డ్రై ప్లేట్స్​లో సమస్యలు వచ్చాయి. వాటిలో బొమ్మ రాకపోవడమో, సరిగా లేకపోవడమో జరిగేది. దాంతో ఆర్డర్లు తగ్గి, నష్టాలు మొదలయ్యాయి. డ్రై ప్లేట్స్​లో వాడే కెమికల్​ ఫార్ములాను ఇంగ్లండ్​లోని కంపెనీ మార్చినట్లు తెలిసింది. ఈ సమస్య మళ్లీ రాకుండా ఉండాలంటే ఆ కెమికల్​ అవసరం లేని ఫిల్మ్​ తయారుచేయాలనుకున్నాడు. వెంటనే కంపెనీలో పనిచేసే మరో ఉద్యోగితో కలసి ప్రయోగాలు చేశాడు. 469 సార్లు ఫెయిలయ్యాక చివరికి రోలబుల్​ ఫిల్మ్​ను సక్సెస్​ఫుల్​గా తయారుచేశాడు. దాన్ని కెమెరాకు లింక్​ చేయడానికి రోల్​ హోల్డర్​ను కూడా కనుక్కున్నాడు. వీటికి ఫుల్​ డిమాండ్​ రావడంతో కంపెనీ మళ్లీ లాభాల బాట పట్టింది. అమెరికాతోపాటు యూరప్​లోనూ ఆర్డర్లు పెరిగాయి. ఈస్ట్​మన్​ ఈసారి వెనుతిరిగి చూసుకోలేదు.  

ఈస్ట్​మన్​ కొడాక్​

కొడాక్​ కంపెనీ మొదటి విదేశీ స్టోర్​ను1888లో లండన్​లో పెట్టింది. ఆ తర్వాత పారిస్​, మాస్కో, మాడ్రిడ్​, .. అలా యూరప్​ అంతటా స్టోర్స్​ మొదలయ్యాయి. 1892లో కంపెనీ పేరు ‘ఈస్ట్​మన్​ కొడాక్​’గా మార్చారు. 1895 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95శాతం కెమెరాల్లో కొడాక్​ ఫిల్మ్​నే వాడేవాళ్లు. 1913 నాటికి అమెరికా స్టాక్​ ఎక్ఛ్సేంజ్​లో కొడాక్​ విలువ 175 మిలియన్​ డాలర్లకు చేరింది. దాంతో అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో ఒకడిగా ఈస్ట్​మన్​ చేరాడు. కొడాక్​ను బిలియన్​ డాలర్ల కంపెనీగా మార్చిన ఈస్ట్​మన్​ మార్చి14, 1932లో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నేండ్లకు కొత్త కంపెనీలు, మొబైల్స్​ రావడంతో కొడాక్​కు కష్టాలు మొదలయ్యాయి. చివరికి 2012లో కంపెనీ దివాళా వరకు వెళ్లింది. అయితే, 2020లో మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈసారి డిజిటల్​ కెమెరాలకు తోడు, ఫార్మసీ బిజినెస్​లోకి కూడా దిగింది. 

మారుపేరుతో వేలకోట్ల దానం

బిలియనీర్​ అయ్యాక జీవితాన్ని తనకు నచ్చినట్లు గడిపాడు ఈస్ట్​మన్​. ఎక్కువగా టూర్​లు వెళ్లేవాడు. యూరప్​, ఆఫ్రికా మొత్తం తిరిగాడు. జపాన్​లో ఎక్కువ రోజులు గడిపాడు. అయితే, తన సంపాదనలో ఎక్కువ భాగం దానాలకు ఖర్చు చేశాడు. అలాగని పనికిరాని వాటికి ఇచ్చేవాడు కాదు. రోచెస్టర్​లో చిన్నపిల్లల కోసం ఉచితంగా డెంటల్​ క్లినిక్​లు పెట్టాడు. దేశంలో జనాభా నియంత్రణ ఉద్యమానికి మద్దతుగా వేల డాలర్లు ఇచ్చాడు. బ్లాక్​ టస్కీగీ, హాంప్టన్ ఇనిస్టిట్యూట్స్​కు భారీగా డబ్బు పంచాడు. చాలా అనాథాశ్రమాలు, హాస్పిటల్స్​, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాజెక్టులకు ఎంతో సొమ్ము ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా మస్సాచుసెట్స్​ ఇని​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఎంఐటీ)కి కొత్త క్యాంపస్​ కట్టించాడు. అలాగే మరో కొత్త బిల్డింగ్​ కోసం దాదాపు 3లక్షల డాలర్లు ఇచ్చాడు. ఇవన్నీ ‘మిస్టర్​ స్మిత్​’ అనే మారుపేరుతో చేశాడు. ఈ పేరుతో ఒక్క ఎంఐటీ యూనివర్సిటీకే సమారు 20మిలియన్​ డాలర్లు ఇచ్చినట్లు ఆ తర్వాత బయటకు తెలిసింది. అలాగే 3,500 మంది కూర్చొనే సౌకర్యం ఉన్న ఈస్ట్​మన్​ థియేటర్​ను 17 మిలియన్​ డాలర్లతో కట్టించాడు. ఇందులో ఎక్కువగా కచేరీలు జరిగేవి. సినిమాలు కూడా వేసేవాళ్లు. 
 
žతప్పుగా పలకొద్దని.

ప్రతి కంపెనీ పేరుకు ఏదో ఒక అర్థం ఉండడం మామూలే. కానీ, ‘కొడాక్​’కు మాత్రం ఎలాంటి అర్థం లేదు. కంపెనీ పేరును ఎవరూ తప్పుగా పలకకూడదని ఆ పేరు పెట్టాడు ఈస్ట్​మన్​. అంతేకాదు,ఇంగ్లీష్​ అక్షరం ‘కె’ అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే మొదట, చివర అదే అక్షరం వచ్చేలా పేరు పెట్టాడు. అంతేకాదు, కొడాక్​ కంపెనీ 1900 నుంచి 1999 సంవత్సరాల మధ్య 19,576 పేటెంట్లు పొందింది.