ఇన్సూరెన్స్ కంపెనీలకు షాక్.. ఆ సాకు చెప్పి క్లెయిమ్ ఆపటం ఇక కుదరదు: బాంబే హైకోర్టు

ఇన్సూరెన్స్ కంపెనీలకు షాక్.. ఆ సాకు చెప్పి క్లెయిమ్ ఆపటం ఇక కుదరదు: బాంబే హైకోర్టు

ఇన్సూరెన్స్ కంపెనీల డెడ్ లైన్ రూల్స్‌కు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు క్లెయిమ్ ఫైల్ చేయడం ఆలస్యమైందన్న సాకుతో ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడం ఇకపై సాధ్యం కాదు. పాలసీ గడువు ముగిసినా లేదా డాక్యుమెంట్లు సమర్పించడంలో ఆలస్యమైనా.. ఆ కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరించడం చెల్లదని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ఈ వివాదం సి.పి. రవీంద్రనాథ్ మీనన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆయనకు 'ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ద్వారా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. 2021-22 కాలానికి చెందిన మెడికల్ ఖర్చుల కోసం మే 2022లో ఆయన క్లెయిమ్ చేశారు. అయితే 90 రోజుల గడువు దాటిపోయిందని చెబుతూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రూ.లక్షా 13వేల క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసింది. దీనిని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

భారతీయ ఒప్పంద చట్టం, 1872లోని సెక్షన్ 28(బి)ను.. జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది. అగ్రిమెంట్ ప్రకారం ఒక వ్యక్తికి ఉన్న హక్కులను కాలపరిమితి(టైమ్ లిమిట్స్) పేరుతో హరించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. పాలసీదారుడు అంగీకరించినప్పటికీ, ఇలాంటి నిబంధనలు చెల్లవని తేల్చి చెప్పింది. బాధితుడికి 6% వార్షిక వడ్డీతో కలిపి 8 వారాల్లో డబ్బులు తిరిగి చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది బాంబే హైకోర్టు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఇన్సూరెన్స్ పాలసీదారులకు పెద్ద ఊరట. 

సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు టెక్నికల్ కారణాలు, డెడ్ లైన్లను చూపి క్లెయిమ్స్ ఎగ్గొడుతుంటాయి. కానీ ఇప్పుడు హైకోర్టు 'విధానపరమైన ఆలస్యం కంటే క్లెయిమ్ యదార్థత (Merit) ముఖ్యం' అని చాటిచెప్పింది. అంటే మీ క్లెయిమ్ నిజమైనదైతే, కేవలం దరఖాస్తు ఆలస్యమైందన్న కారణంతో కంపెనీలు ఇకపై తప్పించుకోలేవు.

ఇన్సూరెన్స్ రంగంలో ఇదొక మైలురాయి లాంటి తీర్పు. గ్రూప్ ఇన్సూరెన్స్ అయినా. పర్సనల్ హెల్త్ పాలసీ అయినా.. కంపెనీలు తమ రూల్స్ పునఃసమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ఈ తీర్పు చెబుతోంది. పాలసీదారులకు ఇది ఒక రక్షణ కవచంలా మారుతుంది. గడువులోగా ఫైల్ చేయడం ఎప్పుడూ మంచిదే అయినప్పటికీ.. అనుకోని కారణాల వల్ల ఆలస్యమైతే మాత్రం మీ హక్కును ఎవరూ కాదనలేరని కోర్టు భరోసా ఇచ్చింది పాలసీ హోల్డర్లకు.