భావితరాలు క్షమిస్తాయా? .. మేధావులు మౌనం వీడాలి

భావితరాలు క్షమిస్తాయా? ..  మేధావులు మౌనం వీడాలి

మలిదశ తెలంగాణ ఉద్యమానికి కవులు, కళాకారులు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వకీళ్లు, డాక్టర్లు ఊపిరిలూదారు. వారు పోషించిన పాత్ర రాష్ట్ర సాధన చరిత్రలో మరువలేనిది. జనసభ, మహాసభ బహిరంగ సభలు, సూర్యాపేట, భువనగిరి ఉద్యమకారుల గర్జన జరపడానికి ఈ మేధావుల, కళాకారుల ప్రేరణ ఒక శక్తిగా పనిచేసింది. కళాకారుల మాట, పాట, పల్లెల్లో ధూమ్ ధామ్ కార్యక్రమాలు తెలంగాణ సమస్యలపై చైతన్యం తెచ్చాయి. ప్రజాయుద్ధనౌక గద్దర్, గూడా అంజన్న,  గోరటి వెంకన్న, అందెశ్రీ, విమలక్క లాంటి కళాకారులు తమ పాటల ద్వారా లక్షలాది మంది ఉద్యమకారులను కోట్లాది ప్రజలను చైతన్యం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్న మన బహుజన బిడ్డలైన మేధావులు మల్లేపల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్, దేశ్​పాండే, వి.

ప్రకాష్, జూలూరి గౌరీ శంకర్ లతోపాటు ఓయూ, కేయూ ప్రొఫెసర్లు, వందలాది అడ్వకేట్లు, డాక్టర్లు.. ఇలా ఎందరో తెలంగాణ ప్రాంత జిల్లాలన్నీ పర్యటించి తమ ఉపన్యాసాలు, రచనలు, వ్యాసాలు, పాటల ద్వారా రాష్ట్ర ఆవశ్యకతను విద్యార్థి లోకానికి యువతరానికి, ప్రజలకు తెలిపారు. తెలంగాణ జాక్ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్​తో పాటు వందలాది మంది రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి ఉద్యమ, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి అనేక సభలు పెట్టారు. ఎవరో ఒక్కరు లేదా ఒక్క కుటుంబం చావు నోట్లో తలకాయ దూరిస్తే.. ఊడిపడలేదు తెలంగాణ. అలా అని బుకాయిస్తే నమ్మేవారు ఎవరూ లేరు. 

పొర్లుదండాలు కనిపించడం లేదా?

తొమ్మిదేండ్లలో రాష్ట్రం నెత్తిన ఐదు లక్షల కోట్ల అప్పు, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్​కాకతీయ పథకాలపై అవినీతి ఆరోపణలు, ధరణి పోర్టల్ భూముల బదలాయింపు అక్రమాల ఆరోపణలు, ఓఆర్ఆర్ లీజ్,111 జీవో ఎత్తివేత, సర్ఫె ఖాస్ భూముల బదిలీ, ఇసుక, గ్రానైట్, మట్టి గనుల దురాక్రమణ, అక్రమ రవాణా తదితర అంశాలు.. పాలకుల వద్ద సేదతీరుతున్న మేధావులకు కనిపించకపోవడం శోచనీయం.

మరియమ్మ లాకప్ డెత్, ఖమ్మం రైతుల చేతులకు బేడీలు, నేరెళ్ల ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళిత బిడ్డలపై థర్డ్​డిగ్రీ, తలుపులు బద్దలు కొట్టి ప్రొఫెసర్ కోదండరాం అరెస్టులు, నిన్నగాక మొన్న గిరిజన మహిళపై పోలీస్​స్టేషన్​లో థర్డ్​డిగ్రీ ప్రయోగించడం, మహిళల పట్ల కొంతమంది ప్రజా ప్రతినిధుల అసభ్యకర ప్రవర్తనలు.. నిజాం కాలం నాటి రోజులను గుర్తు చేస్తున్నవి. సెక్రటేరియట్ ప్రారంభోత్సవ సందర్భంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, మన ప్రజా ప్రతినిధుల పొర్లు దండాలు అంతా గమనించే ఉంటారు.

తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్న చందాన తిరిగి తెలంగాణలో మునుపటి అయ్యా బాంచన్ సంస్కృతి మొదలైందేమోనన్న సందేహం కలుగుతోంది. అయినా రాష్ట్రంలో ఉన్న మేధావుల నుంచి ఉలుకు పలుకు లేదు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా 25 మంది కార్మికుల ఆత్మహత్యలు, వీఆర్వోల, వీఆర్ఏలు, అంగన్​వాడీ కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు నిత్యం ఎదుర్కొంటున్న బాధలు కూడా ఉద్యమకారులు, మేధావులు గమనిస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న వివక్ష, అణచివేత గురించి పోరాడిన మేధావులు.. ఇప్పుడు కూడా మౌనం వీడాలి. మాట్లాడి తీరాలి.

త్యాగాలు ఎవరివి.. అధికారం ఎవరిది?

ఏండ్ల తరబడి నిజాం పాలనలో పీడనకు, దోపిడీకి గురై..  సాయుధ రైతాంగ పోరాటంతో హైదరాబాద్ రాష్ట్రం నుంచి విముక్తి సాధించిన తెలంగాణ ప్రజలు.. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాల వివక్షకు గురవుతున్నామని ‘మా నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం, అవకాశాలు, వనరులు మాకు కావాలి’ అని మలి దశ తెలంగాణ ఉద్యమం చేశారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు పూర్తయింది. పాలకులు ఆర్భాటంగా దశాబ్ది ఉత్సవాల పేరిట రూ.120 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఉద్యమ కాలంలో ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ.. ప్రస్తుతం దేశ రాజకీయ పార్టీలన్నిటికీ తన సంపదతో శాసించగలననే  స్థాయికి ఎలా చేరిందన్నది సందేహం!.

ఈ విషయం మౌనంగా కూర్చున్న మన మేధావులకు అర్థం కాకపోయినప్పటికీ సాధారణ ప్రజలకు మాత్రం పూర్తిగా అర్థమవుతున్నది. అధికార పార్టీకి చెందిన అనేకమంది నాయకులు ప్రభుత్వ భూములను, రాష్ట్ర సంపదను సొంతం చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. కట్టు బట్టలతో పాత స్కూటర్, పాత చెప్పులతో ఉద్యమ రాజకీయాలకు వచ్చిన కొంతమంది నాయకుల ఎస్టేట్​లు, ఫామ్ హౌస్ లు, వందల వేలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయల విలువ చేసే వాహనాలు, వారి బంధువుల ఆర్బాటాలు చూస్తే.. త్యాగాలు చేసిందెవరు? అనుభవిస్తున్నదెవరనే ప్రశ్న జనిస్తుంది. దానికి సమాధానం వెతికే క్రమంలో రాష్ట్రం కోసం బలైన వారి ఆత్మలు తప్పక ఘోషిస్తాయి.

భావితరాలు క్షమిస్తాయా? 

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నా.. గత తొమ్మిదేండ్లలో వేల సంఖ్యలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరిగాయన్నదాని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. రైతు బంధు గొప్పతనాన్ని కీర్తిస్తున్న మేధావులు.. రైతు ఆత్మహత్యలు ఆగకపోవడాన్నీ మాట్లాడాలి కదా! పేద వర్గాలకు దిక్కైన వేలాది బడులు, వందల జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు ప్రభుత్వ ఆదరణ లేక, నియామకాలు లేక, నాణ్యమైన విద్య అందించలేక కునారిల్లుతున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్, ట్యూషన్​ ఫీజుల బకాయిలు పేరుకుపోయాయి. విద్యకు నిధులు ఏటా తగ్గుతూనే ఉన్నా.. తెలంగాణ మేధావులు మౌనం వీడటం లేదు.

ఎవరి స్వార్థం వారే చూసుకునే వారు మేధావులు కారని, అవకాశవాదులని ఓ ప్రముఖ కవి చెప్పినట్టు గుర్తు. బానిస మేధావులుగా కొనసాగే వారిని తెలంగాణ భావితరాలు క్షమించరు. పాలకులు వెదజల్లే తాయిలాలకు ఆశపడి మేధావులు మౌనంగా ఉం డిపోకూడదు. ప్రజాస్వామ్యాన్ని, సాధించుకున్న తెలంగాణను నిరంకుశ పాలకుల నుంచి రక్షించుకొని పౌరుల హక్కులను కాపాడడానికి ప్రజలను చైతన్యం చేసే బాధ్యత మేధావులదని గుర్తించాలి.

- కూరపాటి వెంకట్ నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్, కేయూ