జడ్చర్ల పట్టణంలో అంతర్రాష్ట్ర బస్సు దొంగల ముఠా అరెస్ట్

జడ్చర్ల పట్టణంలో అంతర్రాష్ట్ర బస్సు దొంగల ముఠా అరెస్ట్
  •     10 తులాల బంగారం స్వాధీనం

జడ్చర్ల. వెలుగు : ​  మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పట్టణంలో వరుస బస్సు దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7న జడ్చర్ల న్యూ బస్టాండ్‌‌‌‌లో ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగు నుంచి ఆరు తులాల బంగారం, రెండు రోజుల కింద మరో మహిళ నుంచి మూడు తులాల బంగారు నగలను ఈ ముఠా దొంగిలించింది. 

బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, జాతీయ రహదారి 44పై వాహనాల తనిఖీ చేస్తుండగా కియా కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న సందీప్, అశోక్, ప్రవీణ్, రాజేశ్, సునీల్, సచిన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 తులాల బంగారు నగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముఠా నాయకుడు సందీప్​పై గతంలో 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను రిమాండ్‌‌‌‌కు తరలించి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన జడ్చర్ల ఎస్ఐ మల్లేశ్, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.