ఆసిఫాబాద్​ బీఆర్ఎస్​లో అంతర్గత పోరు

ఆసిఫాబాద్​ బీఆర్ఎస్​లో అంతర్గత పోరు
  • రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్న పార్టీలు
  • టికెట్​ కోసం ఎమ్మెల్యే సక్కు, ​కోవలక్ష్మి నడుమ పోటాపోటీ
  • మూడో వ్యక్తిని రంగంలోకి దించుతారనే ప్రచారం
  • సిర్పూర్​పై బీఎస్పీ చీఫ్​ ప్రవీణ్​కుమార్​ కన్ను
  • సిట్టింగులకు తలనొప్పిగా పోడుభూముల ఇష్యూ, పెండింగ్ ​ప్రాజెక్టులు
  • పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్​ తీవ్ర కసరత్తు

ఆసిఫాబాద్, వెలుగు : రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ ఏడాదే ఎన్నికలు జరగనుండడం, ముందస్తుకు కూడా సంకేతాలు వస్తుండడంతో నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా సెగ్మెంట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ ​పెడుతున్నారు. ఓటర్ల దృష్టిలో పడేందుకు ఇప్పటి నుంచే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యర్థులపై పై చేయి సాధించేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు టికెట్లు కన్ఫమ్​చేసుకునేందుకు కూడా రాయబారాలు నడుపుతున్నారు. ప్రతిపక్షాలైతే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత  తమకు కలిసి వస్తుందని భావిస్తున్నాయి. వాటినే ప్రచారాస్త్రాలుగా  వాడుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ ​జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనం. 

 సమస్యల జిల్లా.. 

జిల్లాలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో ఆసిఫాబాద్​ఎస్టీలకు రిజర్వ్​కాగా..సిర్పూర్​జనరల్​సీటు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు రైతులు అటవీ హక్కు పత్రాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నా భూములను సర్వే చేయడం లేదని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులేవీ పూర్తి కాకపోవడంతో నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయకపోవడం, వైద్య సదుపాయాలు అసలే లేకపోవడం లాంటి అంశాలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి.  

సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. 

ఆసిఫాబాద్​లో బీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక్​ విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్​చార్జి ఆజ్మీర అత్మారామ్ నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మోడీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పనితీరు మీద వీరు నమ్మకం పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా  బలంగా ఉంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి, డాక్టర్ గణేశ్​రాథోడ్, శేషారావు రాథోడ్  పోటీ పడుతున్నారు. 2018లో టీఆర్ఎస్​ హవాలోనూ ఆసిఫాబాద్​లో కాంగ్రెస్​ విజయం సాధించింది. దీంతో ఇక్కడ తమ ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని, వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని కాంగ్రెస్​ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

సిర్పూర్ పై బీఎస్పీ కన్ను

సిర్పూర్ టి నియోజకవర్గంపై బీఎస్పీ చీఫ్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన ఈ నియోజకవర్గంలో సుమారు12 రోజుల పాటు ఉన్నారు. సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 2014 లో బీఎస్పీ అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచారు.  కొద్దిరోజులకే అధికార పార్టీ టీఆర్ఎస్​లో చేరారు. ఇక్కడ బలహీనవర్గాల ఓటర్లే కీలకం కావడం, పార్టీ గుర్తు ఓటర్లపై బలమైన ముద్ర వేసి ఉండడంతో  బీఎస్పీకి కలిసివచ్చే అవకాశం ఉంటుందని ప్రవీణ్​కుమార్​ ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో క్రమం తప్పకుండా పర్యటిస్తూ లోకల్​ ఎమ్మెల్యే కోనప్పపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. ఎప్పట్లాగే తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 

బలపడుతున్న బీజేపీ 

మరోవైపు సిర్పూర్​నియోజకర్గంలో బీజేపీ రోజు రోజుకూ బలపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి హరీశ్​ బాబు ఈసారి  బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండాలని ఆశపడుతున్నారు.  గత ఎన్నికల్లో బీజేపీ నుంచిపోటీ చేసిన పార్టీ  జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కూడా పోటీకి సై అంటున్నారు. వీరిద్దరూ గ్రామాల్లో పర్యటిస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.  కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ రావి శ్రీనివాస్ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు.  

ఆసిఫాబాద్​లో నువ్వా.. నేనా

ఆసిఫాబాద్ మీద మూడు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. రూలింగ్​పార్టీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి టికెట్ ఆశిస్తున్నారు. తిరిగి సిట్టింగ్​లకే  టికెట్​ఇస్తామని ఇటీవల కేసీఆర్​ప్రకటించడంతో సక్కు ధీమాగా ఉండగా..కోవ లక్ష్మి ప్రయత్నాలు చేయడం మాత్రం మానుకోలేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సక్కు టీఆర్ఎస్​నుంచి పోటీ చేసిన కోవ లక్ష్మిపై గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్​లో చేరగా..లక్ష్మీ జడ్పీ చైర్​పర్సన్​ అయ్యారు. నాటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. కానీ, బీఆర్ఎస్​లో ఈ సారి సీటును లక్ష్మి, సక్కులకు కాకుండా మరో వ్యక్తికి ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టికెట్ దక్కకపోతే వేరే పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు ఇద్దరూ రెడీగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. 

2018లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు

ఆసిఫాబాద్ నియోజకవర్గం..
ఆత్రం సక్కు    కాంగ్రెస్    65,788
కోవ లక్ష్మి     బీఆర్ఎస్    65,617
అజ్మీర ఆత్మరామ్ నాయక్    బీజేపీ    6,711
కోట్నాక్ విజయ్ కుమార్    టీజేఎస్    6,182
అజ్మీర రామ్ నాయక్    బీఎస్పీ    3,629
సిర్పూర్ టి నియోజకవర్గం..
కోనేరు కోనప్ప    బీఆర్ఎస్    83,088
హరీశ్​బాబు    కాంగ్రెస్    59,052
కొత్తపల్లి శ్రీనివాస్    బీజేపీ    6,279
రావి శ్రీనివాస్    బీఎస్పీ    5,379

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా

జిల్లా జనాభా     5,15,812 
పోలింగ్ కేంద్రాలు    584
మొత్తం ఓటర్లు    4,20,216
మహిళలు    2,09,118
పురుషులు    2,11,077
ఇతరులు    21

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అనుకూల అంశాలు

l వివాదాలకు అతీతమైన వ్యవహార శైలి l భూ వివాదాలు కబ్జాలకు     దూరంగా ఉండడం, భూ మాఫియాకు కళ్లెం వేయడం ప్రతికూల అంశాలు...
l గెలిపించిన వారిని దూరంగా పెట్టడం
l  ప్రత్యర్థి వర్గంలో పని చేసిన  వారిని చేరదీయడం
l ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం,  సమస్యలపై స్పందించక పోవడం
l  డబుల్ ఇండ్లు పూర్తి కాకపోవడం, పోడు భూముల ఇష్యూ , పెండింగ్​ ప్రాజెక్టులు 

సిర్పూర్ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప అనుకూల అంశాలు..

l    ప్రజలతో మమేకమై   పని చేయడం
l    సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండడం
l    మొత్తం కుటుంబం ప్రజలతో కలిసి ఉండడం ప్రతికూల అంశాలు..
l    ప్రభుత్వ వ్యతిరేకత, అందరికీ పథకాలు అందకపోవడం
l    ఎస్పీఎం కంపెనీలో స్థానికేతరులకు ఉద్యోగాలిచ్చి స్థానికులకు ఇవ్వడం లేదన్న ఆరోపణలు
l    ప్రాణహిత రీ డిజైన్ వల్ల ప్రాజెక్ట్ తరలింపు తర్వాత జిల్లా ప్రయోజనాలను   పట్టించుకోకపోవడం
l     డబుల్​ ఇండ్లు, పోడు భూముల సమస్య, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం