ఎమ్మెల్యే కంచర్ల సమక్షంలో తూతూమంత్రంగా విచారణ

ఎమ్మెల్యే కంచర్ల సమక్షంలో తూతూమంత్రంగా విచారణ
  • మృతురాలి శిశువుతో కుటుంబసభ్యుల ఆందోళన
  • శాపనార్థాలు పెట్టిన మృతురాలి బంధువులు 

నల్లగొండ అర్బన్​, వెలుగు: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చి శనివారం గర్భిణి శిరసు అఖిల(21) మృతి చెందగా, ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని డీఎంఈ(డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ హెల్త్​)రమేశ్​ క్లీన్ చిట్ ఇచ్చారు. గర్భిణి పట్ల  నర్సులు దురుసుగా ప్రవర్తించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, ఈ నెల 9న డెలివరీ చేస్తున్న టైంలో పరిస్థితి విషమించి చనిపోయింది.  వైద్యులు ఆమెకు సకాలంలో ప్రసవం చేయలేదని, పైగా డెలివరీ టైంలో నర్సులు సూటిపోటి మాటలతో వేధించి అఖిల మృతికి కారణమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సోమవారం డీఎంఈ  రమేశ్​రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కలిసి ఆసుపత్రిలో విచారణ నిర్వహించారు. ఉదయమే మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వార్డులను పరిశీలించారు. అక్కడ కాన్సులు జరుగుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తమ పట్ల వైద్యులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమీ బాగాలేదని మహిళలు ఏకరువుపెట్టారు. తమను బూతులు తిడ్తున్నారని వివరించారు. అనంతరం డీఎంఈ, ఎమ్మెల్యే  మీడియా సమావేశంలో మాట్లాడారు. రక్తహీనత ఉన్న గర్భిణులు ప్రసవం కోసం  చివరి నిమిషంలో ఆసుపత్రికి వస్తున్నారని, దీని వల్లే కొన్ని ఇబ్బందులు  తలెత్తుతున్నాయని రమేశ్​రెడ్డి చెప్పారు. ఏ ఆసుపత్రిలోనూ నార్మల్​ డెలివరీల కోసం డాక్టర్లు ఎక్కువ కాలం వేచి ఉండరని, సిజేరియన్​అవసరమైతే తప్పకుండా చేసి తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడుతామన్నారు. సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై తమ కు ఫిర్యాదులు వచ్చాయని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. సమస్యలు చెప్పుకునేందుకు ఫోన్​ చేస్తే మెడికల్ కాలేజ్​ ప్రిన్సిపాల్ గానీ, జీజీహెచ్ సూపరింటెండెంట్​గానీ లిఫ్ట్​ చేయని విషయాన్ని  మీడియా ప్రతినిధులు వారి దృష్టికి తెచ్చారు. కాగా, అదే సమయంలో మృతురాలు అఖిల కొడుకుతో ఆమె అత్త, మామ, భర్త కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ అఖిల మామ పోలీసుల కాళ్లపై పడి  ప్రాదేయ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో మృతురాలి బంధువులైన మహిళలు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు. 

అఖిల కుటుంబానికి న్యాయం చేయాలి  

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.  మృతురాలి బంధువులతో కలిసి ఆయన ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి మృతురాలు బంధువులతో మాట్లాడకుండా ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అఖిల మృతికి బాధ్యులైన వారిపి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గైనిక్ హెచ్ఓడి డాక్టర్ రజనీ, సూపరిటెండెంట్ డాక్టర్ లచ్చూ, డీఎస్సీ నర్సింహరెడ్డి, సీఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు .