ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్ అధ్యక్షుడు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్ అధ్యక్షుడు.. అసలేం జరిగిందంటే..

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల ఒక మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కారణం వెరీ వెరీ సిల్లీ.. ‘హిజాబ్ ధరించలేదు’ అని ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు రైసీ నో చెప్పేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిపై హాట్ డిబేట్ జరుగుతోంది. ఇరాన్ అధ్యక్షుడి తీరుపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.మహిళా జర్నలిస్టులకు హిజాబ్ నిబంధన పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇంటర్వ్యూకు నో చెప్పడానికి.. హిజాబ్తో పాటు ఇంకొన్ని కారణాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇరాన్లో గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామం వల్ల కూడా.. హిజాబ్ ధరించని జర్నలిస్టుకు ఇంటర్వ్యూ  ఇచ్చేందుకు రైసీ నో చెప్పి ఉండొచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ కారణమేంటి? 

ఇంటర్వ్యూ కోసం సర్వం సిద్ధం
ఆమె పేరు క్రిస్టినా అమన్పోర్. పుట్టి పెరిగింది ఇరాన్ రాజధాని తెహ్రాన్. సీఎన్ఎన్ లో జర్నలిస్టుగా చేరిన తర్వాత ఆమెకు తొలి పోస్టింగ్ తెహ్రాన్ లోనే ఇచ్చారు. అక్కడ న్యూస్ రిపోర్టింగ్ చేసేప్పుడు ఆమె హిజాబ్ ధరించేవారు. ఇరాన్ ఉన్నతాధికారులను ఇంటర్వ్యూ చేసే క్రమంలోనూ స్కార్ఫ్ వేసుకునేవారు. అయితే కొంతకాలం తర్వాత క్రిస్టినా అమన్పోర్ను ప్రమోషన్ ఇచ్చిన సీఎన్ఎన్ అమెరికాకు పిలిచింది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ న్యూయార్క్ నగరానికి వచ్చారు. ప్రస్తుతం సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ హోదాలో ఉన్న క్రిస్టినా అమన్పోర్ కు ఈనెల 22న ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇబ్రహీం రైసీ ముందుగానే అపాయింట్మెంట్ ఇచ్చారు. రైసీని ఇంటర్వ్యూ చేసేందుకు క్రిస్టినా దాదాపు 3 వారాలు ప్రిపేరయ్యారు. ఇంటర్వ్యూలో రైసీ ఇరానీ భాషలో మాట్లాడుతుంటే ఇంగ్లిష్లోకి అనువాదించేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు 8 గంటల పాటు టెక్నికల్ టీమ్ కష్టపడి ఇంటర్వ్యూను లైవ్ లో ప్రసారం చేసేందుకు అవసరమైన లైటింగ్, కెమెరాలను అమర్చారు. 

హిజాబ్ ధరించాలని రైసీ కండీషన్ 
తొలిసారిగా అమెరికా గడ్డపై నుంచి రైసీ ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోందంటూ సీఎన్ఎన్ చానల్ కొన్ని వారాల పాటు ప్రోమోలను ప్రసారం చేసింది. సెప్టెంబరు 22 రానే వచ్చింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ఇంటర్వ్యూ చేసేందుకు క్రిస్టినా స్టూడియోలోకి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇబ్రహీం రైసీ కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇబ్రహీం రైసీ పర్సనల్ అసిస్టెంట్ న్యూయార్క్ లోని సీఎన్ఎన్ స్టూడియోకు వచ్చారు.  క్రిస్టినాను హిజాబ్ ధరించాలని చెప్పాడు. అయితే అందుకు క్రిస్టినా నో చెప్పడంతో ఇంటర్వ్యూ ఇవ్వలేనని చెప్పి ఇబ్రహీం రైసీ పీఏ వెళ్లిపోయారు. ఆ తర్వాత జర్నలిస్ట్ క్రిస్టినా అమన్పోర్ ఒక్కరే కుర్చీపై కూర్చొని ఉన్న ఫొటో మీడియాలో వైరల్ అయింది. హిజాబ్ ధరించలేదనే కారణంతో రైసీ ఇంటర్వ్యూ ఇవ్వలేదనేది అందరికీ తెలిసిపోయింది. దీనిపై జర్నలిస్ట్ అమన్ పోర్ వరుస ట్వీట్లు కూడా చేశారు. ‘‘హెడ్ స్కార్ఫ్ ధరించకుంటే ఇంటర్వ్యూకు అనుమతి దొరకదని ఇరాన్ అధ్యక్షుడు రైసీ సహాయకుడు నాకు చెప్పాడు. అయితే ఆ ప్రతిపాదనను నేను తిరస్కరించాను’’ అని అందులో ఆమె స్పష్టం చేశారు. గతంలో ఎంతోమంది ఇరాన్ అధ్యక్షులను తాను ఇంటర్వ్యూ చేశానని.. ఎవరు కూడా హిజాబ్ సాకుతో ఇంటర్వ్యూను ఇలా క్యాన్సిల్ చేయలేదని క్రిస్టినా వాపోయారు.

ఇరాన్లో పెల్లుబికిన ఆందోళనలు
మరోవైపు సెప్టెంబరు మూడోవారంలో ఇరాన్ జరిగిన ఓ ఘటనపై ఆందోళనలు పెల్లుబికాయి. కొందరు ఇరాన్ మహిళలు తమ జుట్టును కత్తిరించుకుంటూ నిరసన తెలిపారు. ఇంకొందరు మహిళలు స్కార్ఫ్ లను దహనం చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని ఇరాన్ టీవీ చానళ్లు కూడా వాటిని ప్రసారం చేశాయి. ఇంతకీ ఎందుకీ నిరసనలు జరిగాయి.. అనుకుంటున్నారా ? మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా హిజాబ్ ధరించాలనే నిబంధన ఇరాన్ లో అమల్లో ఉంది. మహ్సా ఆమిని అనే 22 ఏళ్ల మహిళ దీన్ని పాటించలేదు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే మహ్సా ఆమిని గుండెపోటుతో చనిపోయింది. ఈ వార్త మీడియాలో ప్రసారం కావడంతో ఇరాన్వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ చర్యకు నిరసనగానే కొందరు ఇరాన్ మహిళలు జుట్టు కత్తిరించుకొని.. స్కార్ఫ్ లు దహనం చేశారు. దాదాపు వారం రోజుల పాటు ఈ నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనల్లో దాదాపు 26 మంది చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానళ్లలో కథనాలు వచ్చాయి. ఈ నిరసనలు ఉధృతమవుతున్న సమయంలోనే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని జర్నలిస్ట్ క్రిస్టినా అమన్పోర్ ఇంటర్వ్యూ చేసే టైం వచ్చింది. ఇరాన్ హిజాబ్పై ఆందోళనలు పెల్లుబికిన నేపథ్యంలో.. అమెరికా యాంకర్ క్రిస్టినాకు కూడా హిజాబ్ ధరించాలనే డిమాండ్ ను ఇబ్రహీం రైసీ పెట్టారు. అతివాద షియా నేతగా తనకు ఇరాన్ లో ఉన్న గుర్తింపును నిలుపుకునేందుకు ఆయన ఇలా చేసి ఉంటారని మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.