ఆహార ధాన్యాలంటే కేవలం బియ్యం, గోధుమలేనా ?: రైతు స్వరాజ్య వేదిక

ఆహార ధాన్యాలంటే కేవలం బియ్యం, గోధుమలేనా ?:  రైతు స్వరాజ్య వేదిక

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి మూలం సురక్షితమైన , పౌష్టికమైన, వైవిధ్యమైన ఆహారం తగినంత అందరికీ అందుబాటులో ఉండడం. భారత దేశంలో మూడింట రెండు వంతుల మంది ప్రజలు  ఆహార భద్రతా చట్టం పరిధిలో ఉన్నారు.  అందుకే ఈ ఆహారం తక్కువ ధరలకు కూడా దొరకాలి. ప్రజలకు ఆహార భద్రత కల్పించడమంటే ఇప్పటి వరకూ కొన్ని రాష్ట్రాల్లో గోధుమలను, కొన్ని రాష్ట్రాల్లో  బియ్యాన్ని రేషన్ కార్డులపై సరఫరా చేయడమనే  అర్థం . దాని వల్ల , దేశంలో ఆకలి చావులు కొంత తగ్గుముఖం పట్టవచ్చు కానీ, నిజంగా ప్రజల ఆకలి తీరినట్లు కాదు.

ఇప్పటికీ ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం మొత్తం 119 దేశాలతో పోల్చినప్పుడు 107 వ స్థానంలో ఉండడం దీనినే సూచిస్తున్నది. ఎందుకంటే, సూచీని తయారు చేయడానికి వాళ్ళు తీసుకునే ప్రమాణాలు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయి. మనం ఇంకా ఆ ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. 

సంపన్న రాష్ట్రంలో పేదల పెరుగుదల?

మన రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం క్రింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి 90,01,608 రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ కార్డుల పరిధిలో  2,83,39,404 మంది ప్రజలు ఉన్నారు.  2021 నాటికి రాష్ట్ర జనాభా 3,85,00,000. అంటే  కేవలం కోటి మంది మాత్రమే ఈ చట్టం వెలుపల ఉన్నారు. నిజంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నదనుకుంటే, ప్రజల ఆదాయాలు పెరిగి , ప్రతి సంవత్సరం రేషన్ బియ్యం పై ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గాలి.

కానీ క్రమంగా ఈ సంఖ్య పెరుగుతున్నది. ఇలా ఎందుకు జరుగుతుందో రాజకీయ పార్టీలు లోతుగా సమీక్షించడానికి సిద్దంగాలేవు. ఎన్నికల అవసరాలు దీనికి ప్రధాన కారణం. పరిస్థితి ఇలా ఉంటే, ఆహార భద్రతా పథకం క్రింద రేషన్ కార్డుల కోసం ఇంకా ఇప్పటికీ లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసి ఉన్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించి కూడా వీరికి గత నాలుగేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదు.

దీని వల్ల నిజమైన పేదలు ఆహార భద్రతకు దూరం అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం  నిర్ధిష్ట కాలపరిమితి పెట్టుకుని రాష్ట్రమంతటా రేషన్ కార్డుల సమీక్ష పూర్తి చేయాలి. రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం తీసుకుంటున్న వాళ్ళు కూడా అనేక మంది తమ బియ్యాన్ని స్వంతంగా వినియోగించుకోవడం లేదు. కొంత ఎక్కువ డబ్బులకు మార్కెట్ లో అమ్ముకుంటున్నారు.

ఇదొక విష వలయం . మొత్తంగా ఇది బియ్యం రీ సైక్లింగ్ కు దారి తీస్తున్నది. ఈ ప్రక్రియలో అవినీతి ఉంది. ఇందులో రాజకీయ నాయకులు, అధికారులు, రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు భాగస్వాములుగా ఉన్నారు. రైస్ మిల్లర్లు ఎఫ్‌‌సీఐకి సరఫరా చేసే క్వింటాలు ముడి బియ్యంలో 25 కిలోల నూకలు ఉంటే, పార్ బాయిల్డ్ బియ్యంలో 16 కిలోలు ఉంటాయి. ముడి బియ్యంలో పొట్టు తీయని ధాన్యం 13 కిలోలు ఉంటే , పార్ బాయిల్డ్ బియ్యంలో 16 కిలోలు ఉంటాయి.

ఇవే కాక దెబ్బ తిన్న బియ్యం 4 కిలోలు, రంగు మారిన బియ్యం 5  కిలోలు, ఎర్ర బియ్యం 4 కిలోలు, ఇతర పదార్ధాలు 1 కిలో ఉంటాయి. మొత్తం 100 కిలోల్లో నాణ్యమైన బియ్యం కేవలం 55 కిలోలు మాత్రమే ఉంటాయన్నమాట.  ఈ విధంగా పేదలు ఈ బియ్యాన్ని వినియోగించుకోక పోవడానికి కారణం నాణ్యత లేకపోవడమే. నిజంగా మిల్లు నుంచి నాణ్యమైన బియ్యం ఎఫ్‌‌సీ‌‌ఐ కి సరఫరా అయితే అందరూ అవే బియ్యాన్ని వినియోగించుకుంటారు.

100 కిలోల ధాన్యం మిల్లు పట్టిస్తే  67 కిలోల మంచి బియ్యం వస్తాయి. ఉప ఉత్పత్తులుగా వచ్చే నూకలు, తవుడు, ఊక కు ఎలాగూ మార్కెట్ ఉంటుంది కాబట్టి రైస్ మిల్లర్లు నష్టపోయేదీమీ ఉండదు. ఎఫ్‌‌సీ‌‌ఐ నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల పేరుతో, , మిల్లర్లు చెత్తా చెదారం అంతా సంచుల్లో నింపి ఎఫ్‌‌సీ‌‌ఐ కి సరఫరా చేయడం వల్ల,  అవి తినడానికి పనికి రాని పద్ధతిలో ఎఫ్‌‌సీ‌‌ఐ గిడ్డంగులకు చేరుతున్నాయి.

వాటినే రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. పేదల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి, అమానవీయత, వ్యాపారుల లాభాలు, అధికారుల అవినీతి కలసి బియ్యం నాణ్యతను దెబ్బ తీస్తున్నాయి. “ రేషన్ బియ్యం ఇచ్చినా తినరండీ” అని పేదల గురించి, మిగిలిన వాళ్ళు  వ్యాఖ్యానిస్తారు కానీ, ఆ బియ్యం నాణ్యతను ఎప్పుడూ ప్రశ్నించరు.

చిరుధాన్యాలు తప్పనిసరి

తెలంగాణాలో చిరుధాన్యాలు పండించే ప్రాంతాలు ఉన్నాయి.  పండించే అనుభవమున్న  రైతులు ఉన్నారు. మనిషిలో ఆరోగ్య స్పృహ పెరిగిన కొద్దీ, మధు మేహం  లాంటి వ్యాధులు విస్తరించిన కొద్దీ , ఈ చిరు ధాన్యాల వైపు మధ్యతరగతి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.  గత 20 ఏళ్ళలో మన రాష్ట్ర పంటల పొందికలో వచ్చిన మార్పుల వల్ల వాటి పంటల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. ఉదాహరణకు 2022 ఖరీఫ్ లో   పంటల విస్తీర్ణం ఇలా..  జొన్న 36,100 ఎకరాలకు, రాగి 668 ఎకరాలకు, సజ్జ 1008 ఎకరాలకు, మిగిలిన చిరు ధాన్యాలు 3497 ఎకరాలకు పడిపోయింది.

రాష్ట్రంలో  గోధుమ పంట సాధారణ విస్తీర్ణం కేవలం 12,375 ఎకరాలు మాత్రమే. ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో ప్రజలు కొనుగోలు చేస్తున్న చిరు ధాన్యాలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. వరి, మొక్కజొన్న లాంటి పంటలతో పోల్చినప్పుడు, ఈ పంటల సగటు దిగుబడులు కూడా తక్కువే.  కొన్ని పంటలకు తప్ప , చిరు ధాన్యాల పంటలన్నిటికీ కేంద్రం ఎం‌‌ఎస్‌‌పి ప్రకటించడం లేదు. వీటిని  పండించిన రైతులకు కూడా  కనీస మద్దతు ధరలు అందడం లేదు.

రైస్ మిల్లుల లాగా , జిల్లాల స్థాయిలో చిరు ధాన్యాల ప్రాసెసింగ్ కు తగిన మిల్లులు ఏర్పడ లేదు. పైగా మెజారిటీ ప్రజల ఆహార అలవాట్ల నుండి ఇవి ఎగిరిపోయి, కేవలం సన్న తెల్ల బియ్యం అన్నం తినే అలవాటుపెరిగింది. ఫలితంగా వీటిని పండించిన రైతులు కూడా నేరుగా వినియోగ దారులకు మార్కెట్ చేసుకోలేక పోతున్నారు.

కేంద్రం ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరు ధాన్యాలను కూడా చేర్చి పంపిణీ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ మన రాష్ట ప్రభుత్వం అమలు చేయడం లేదు.  ప్రభుత్వం వీటి విస్తీర్ణం పెంచాలని అనుకుంటే ప్రభుత్వ సేకరణకు హామీ ఇచ్చి ప్రోత్సహించాలి. సేకరించాలి. స్థానికంగా ఎక్కడికక్కడ సహకార సంఘాలు, ఎఫ్‌‌పి‌‌ఓ ల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. అంగన్ వాడీ , మధ్యాహ్న భోజనం లాంటి ఆహార పథకాల్లో  వీటిని భాగం చేయాలి. ప్రతి నెలా నిర్ధిష్టంగా కొన్ని కిలోల చిరు ధాన్యాలు (కనీసం జొన్నలు , సజ్జలు, రాగులు, కొర్రలు)  ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, అన్ని కుటుంబాలకు అందేలా చేయగలిగితే, వీటికి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడే మన రాష్ట్ర అవసరాల మేరకు చిరుధాన్యాలను  పండించడానికి రైతులు ముందుకు వస్తారు. ఖరీదైన సాగు నీటి తో పండించే వరి, పత్తి పంటల విస్తీర్ణాన్ని తగ్గించడానికి ఇదొక మంచి మార్గం.

పోషకాహారం ఏది?

ఆహారం అంటే కేవలం కడుపు నిండడం కాదు. ఆహారం మనిషి శ్రమ చేయడానికి తగిన శక్తిని ఇవ్వాలి. బి‌‌ఎం‌‌ఐ సరిగా ఉందా లేదా అనేది మనం తీసుకునే ఆహారం ద్వారా అందే క్యాలరీల మీద ఆధారపడి ఉంటుంది. క్యాలరీలు ఒక్కటే మనకు సరిపోవు. సూక్ష్మ పోషకాలు, విటమిన్లు , కొవ్వు , రోగ నిరోధక శక్తిని అందించే యాంటీ యాక్సిడెంట్స్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కేవలం బియ్యం లేదా గోధుమల ద్వారా మనకు అందవు.  

భారత వైద్య పరిశోధనా సంస్థ (ఐ‌‌సి‌‌ఎం‌‌ఆర్ ) సిఫారసుల ప్రకారం ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం తప్పని సరి అవసరం.  వయసును బట్టి, చేసే శ్రమని బట్టి, శ్రమ చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంత పరిమాణంలో వైవిధ్యమైన ఆహారం అవసరం.

ఆహార ధాన్యాలంటే కేవలం బియ్యం, గోధుమలుగా చూడకూడదు. జొన్న, కొర్ర, సజ్జ, రాగి, ఆరికలు, సామ, అండు కొర్ర, ఊదలు లాంటి చిరు ధాన్యాలు కూడా ఆహార ధాన్యాల్లో  భాగంగా చూడాలి.  

- కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక