దక్షిణ గాజాపైనా దాడులు.. ఈజిప్ట్ బార్డర్​లోనే ఆగిన నిత్యావసరాల ట్రక్కులు

దక్షిణ గాజాపైనా దాడులు.. ఈజిప్ట్ బార్డర్​లోనే ఆగిన నిత్యావసరాల ట్రక్కులు
  • బార్డర్ తెరిచేందుకు ఇజ్రాయెల్ ససేమిరా .. 
  • తిండి నిల్వలు ఇంకో నాలుగైదు రోజులకే సరిపోతయ్

జెరూసలెం/గాజా/వాషింగ్టన్: గాజా స్ట్రిప్​లోని దక్షిణ ప్రాంతంపైనా ఇజ్రాయెల్ మంగళవారం బాంబు దాడులు చేసింది. రఫా, ఖాన్ యూనిస్ సిటీల్లో జరిగిన దాడుల్లో 57 మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ అధికారి బసీమ్ నయీమ్ వెల్లడించారు. నార్త్ గాజా నుంచి సౌత్ గాజాకు తరలివెళ్లాలంటూ హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. ఇక్కడా దాడులు చేస్తుండటంతో పాలస్తీనా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అయితే, హమాస్ కదలికలు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్పష్టం చేసింది. 

హమాస్ స్థావరాలు, కమాండ్ సెంటర్లను మాత్రమే తాము టార్గెట్ చేస్తున్నామని తెలిపింది. మరోవైపు ఉత్తరాదిన లెబనాన్ నుంచి హిజ్బొల్లా టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ బార్డర్ వద్ద దాడులను తిప్పికొడుతున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కాగా, పదిరోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో 2,778 మంది మృతి చెందారు. 9,700 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో 1200 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్ లో 1,400 మంది చనిపోయారు.

తగ్గిపోతున్న తిండి నిల్వలు

పది రోజులుగా నిర్బంధంలోనే ఉండడంతో గాజాలోని ప్రజలు తిండి, నీళ్ల కరువుతో అల్లాడుతున్నారు. క్షతగాత్రులతో ఆస్పత్రులన్నీ ఫుల్ అయిపోగా.. మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇప్పుడు తిండికి, నీళ్లకు కూడా తీవ్ర కొరత మొదలైంది. షాపుల్లో మిగిలి ఉన్న ఫుడ్ స్టాక్​ కూడా నాలుగైదు రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్ పీ)’ ఆందోళన వ్యక్తం చేసింది. సిటీలోని వేర్ హౌస్​లలో రెండు వారాలకు సరిపడేంత ఫుడ్ స్టాక్స్ ఉన్నప్పటికీ.. అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని పేర్కొంది. నిరంతరం బాంబుల మోతతో మారుమోగుతున్న గాజాలోని షాపుల వద్దకు ఫుడ్ స్టాక్స్ ను తేవడమే అసలైన సవాల్ గా మారిందన్నారు. 

ప్రస్తుతం ఓపెన్ చేసి ఉంచుతున్న అతికొద్ది బేకరీల వద్ద జనం పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు గాజాలోకి వెళ్లేందుకు ఈజిప్ట్ బార్డర్ లో ట్రక్కులు బారులు తీరి ఉన్నాయి. బార్డర్ ఓపెన్ చేసేందుకు ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవడంతో నాలుగైదు రోజులుగా ట్రక్కులు అక్కడే ఆగిపోయాయి. ఈ విషయంపై మంగళవారం అమెరికా, ఇజ్రాయెల్ ఒక ఒప్పందానికి రానున్నట్లు అమెరికన్ అధికారులు ప్రకటించారు. కాగా, ఆపరేషన్ అజయ్​లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మరో 286 మంది ప్యాసింజర్లు ఇండియాకు స్పెషల్ ఫ్లైట్​లో బయలుదేరారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మంగళవారం వెల్లడించారు. ఇదే విమానంలో 18 మంది నేపాల్ పౌరులు కూడా వస్తున్నారని తెలిపారు.

ఇజ్రాయెల్​లో బైడెన్ టూర్ 

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ బుధవారం ఇజ్రాయెల్, జోర్డాన్​లో పర్యటిస్తారు. హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్​కు మద్దతు తెలపడంతోపాటు గాజాలోని పాలస్తీనా పౌరులకు మానవతా సాయం అందించడంపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ‘హమాస్ కిరాతక టెర్రరిస్ట్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్​కు అండగా నిలిచేందుకు నేను బుధవారం ఆ దేశానికి వెళ్తున్నా’ అని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.

ఆస్పత్రిలో 200 మంది మృతి

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులతో సెంట్రల్​ గాజాలోని ఆస్పత్రి నేలమట్టం అయిందని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. దీంతో అందులో ఆశ్రయం పొందిన పాలస్తీ నా ప్రజలు 200 మందికి పైగా చని పోయారని పేర్కొంది. ఇంకా చాలా మంది లోపల చిక్కుకున్నారని, మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

నన్ను తీసుకెళ్లండి.. ప్లీజ్! హమాస్ చెరలో ఉన్న యువతి వీడియో

హమాస్ మిలిటెంట్ల వద్ద బందీగా ఉన్న ఇజ్రాయెల్ యువతి వీడియో ఒకటి బయటకొచ్చింది. ‘నా పేరు మియా. వాళ్లు (హమాస్ మిలిటెంట్లు) నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ట్రీట్మెంట్ చేశారు, మందులు ఇచ్చారు. ఇక్కడంతా బాగానే ఉంది. కానీ నాకు మా ఇంటికి వెళ్లిపోవాలని ఉంది. వీలైనంత తొందరగా నన్ను మా తల్లిదండ్రుల దగ్గరికి చేర్చండి’ అంటూ మియా అనే యువతి వీడియోలో అభ్యర్థించింది. మియా చేతికి అయిన గాయానికి ఓ వ్యక్తి కట్టుకడుతుండడం వీడియోలో కనిపించింది. గాజా బార్డర్ లోని ఇజ్రాయెల్ సిటీ స్డెరాట్ కు చెందిన మియాను మిలిటెంట్లు సూపర్ నోవా ఫెస్ట్ లో బందీగా పట్టుకెళ్లారు. కాగా, తామూ మనుషులమేనని చెప్పుకునేందుకు మిలిటెంట్లు ఈ వీడియో రిలీజ్ చేశారు. కానీ, రోజుల పసికందులను, గర్భంలో ఉన్న పిండాన్ని కూడా దారుణంగా హతమార్చిన విషయం ఎవరూ మర్చిపోరని ఐడీఎఫ్​ ట్వీట్​ చేసింది. మియాతో పాటు బందీలు అందరినీ విడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.