గాజా ఆస్పత్రిపై వైమానిక దాడి.. 500 మంది మృతి

గాజా  ఆస్పత్రిపై వైమానిక దాడి.. 500 మంది మృతి

గాజాలోని అల్ అహ్లీ అరబ్ ఆస్పత్రిపై వైమానిక దాడి జరగడంతో భారీ పేలుడు సంభవించింది.. ఈ  ఘటనలో 500 మందికి పైగా చనిపోయారని    హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. ఇజ్రాయేలే ఈ దాడికి పాల్పడిందని ఆరోపించింది.  ఇదొక యుద్దంగా పేర్కొంది.  ఆస్పత్రి భవనం పూర్తిగా ధ్వంసం అయి చెల్లాచెదురుగా  పడిన మృతదేహాలున్నట్లు  ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ వో  డైరక్టర్ జనరల్ టెడ్రోస్ ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అయితే గాజాలో జరిగిన ఆస్పత్రి దాడికి తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇంటెలిజెన్స్  రిపోర్టుల ప్రకారం ..ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిందని.. ఆ రాకెట్ విఫలమవడంతో.. దిశను మార్చుకుని  ఆస్పత్రి వైపు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. 


ఇజ్రాయెల్,గాజా మధ్య దాడులు 11వ రోజుకు చేరాయి.  ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో 2,778 మంది మృతి చెందారు. 9,700 మందికి గాయాలయ్యాయి.  శిథిలాల కింద మరో 1200 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్ లో 1,400 మంది చనిపోయారు.

ఇజ్రాయెల్​లో బైడెన్ టూర్ 

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ బుధవారం ఇజ్రాయెల్, జోర్డాన్​లో పర్యటిస్తారు. హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్​కు మద్దతు తెలపడంతోపాటు గాజాలోని పాలస్తీనా పౌరులకు మానవతా సాయం అందించడంపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. ‘హమాస్ కిరాతక టెర్రరిస్ట్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్​కు అండగా నిలిచేందుకు నేను బుధవారం ఆ దేశానికి వెళ్తున్నా’ అని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు.