టస్సర్ మగ్గాలకు చేయూత అందట్లే

టస్సర్  మగ్గాలకు చేయూత అందట్లే

చేనేతకు చేతినిండా పనిలేక టస్సర్ పట్టు మగ్గం కుమిలిపోతోంది. రాట్నం మౌనంగా రోధిస్తోంది. చేనేత కార్మికుల బతుకులు భారంగా మారుతున్నాయి. మగ్గం నడవక నేతన్నల గుండె చప్పుళ్లు శ్రుతి తప్పుతున్నాయి. ఒకవైపు యంత్రాల పోటీ.. మరోవైపు ప్రభుత్వ చిన్నచూపు వెరసి చేనేత రంగం సంక్షోభంలో ఇరుక్కుంది.షాపింగ్ మాల్స్ పేరిట నగరాల్లోని బహుళ అంతస్తుల భవనాల్లో, మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులో, డిస్కౌంట్ల ఎరవేసి, బహుమతుల వల వేసి కస్టమర్లను దోచుకునే నేటి రోజుల్లో నిష్కల్మషంగా పోగుకో చెమట చుక్క ధారపోసి నేసిన చేనేత వస్త్రాలు వెలవెలబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో చేనేతకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. బతుకమ్మల చీరల తయారీ మొదలైన పనులను వారి చేత చేయిస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేనేత కార్మికుల పరిస్థితిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా టస్సర్ పట్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. 

గతంలో 40.. ఇప్పుడు ఆరే

గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 వరకు టస్సర్ మగ్గాలు ఉంటే.. ప్రస్తుతం ఆరు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా నిలిచిపోతే ప్రత్యేక గుర్తింపు గల బంగారు రంగులో మెరిసే టస్సర్ పట్టు గత వైభవంగా మిగిలిపోనుంది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఉట్నూరు, బెజ్జూరు, చెన్నూరు, కుశ్నపల్లిలో మాత్రమే టస్సర్ పట్టు ఉత్పత్తి అయ్యేది. వీటిల్లో 40 వరకు మగ్గాలు ఉండేవి. చెన్నూరు, ఉట్నూరు, బెజూరులో టస్సర్ వస్త్రం నేయడాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం నెన్నెల మండలం కుశ్నపల్లిలో మాత్రమే టస్సర్ వస్త్రాలు నేస్తున్నారు. కుశ్నపల్లిలో సైతం గతంలో 18 టస్సర్ మగ్గాలు ఉంటే ఇప్పుడు అవి 6కు తగ్గాయి. సొంత ప్రక్రియతో సహజ రంగులద్ది టస్సర్ వస్త్రాన్ని తయారు చేస్తారు. దానిమ్మ చెక్క, మోదుగపూలు, ఎర్ర ఉల్లిగడ్డ పొరలు, కరక్కాయలతో సహజసిద్ధమైన రంగులు తయారు చేసి టస్సర్ వస్త్రాలకు అద్దేవారు. 

దేశవిదేశాల్లో మస్తు డిమాండ్

కృత్రిమ పోకడలకు పోకుండా సహజ సిద్ధంగా రూపొందించడంతో టస్సర్ వస్త్రాలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాల్లో పెట్టే హ్యాండ్ లూమ్ ప్రదర్శనల్లో మన్నికైన టస్సర్ చీరలు, షర్టు బట్టలను అడిగి మరీ కొనుగోలు చేసేవారు. దర్జా, దర్పం కోసం రాజకీయ నాయకులు టస్సర్ చొక్కాలు ఇష్టంగా ధరించేవారు. కొన్నాళ్ల పాటు టస్సర్ హవా కొనసాగింది. అప్పట్లో నేత కార్మికులు చేతినిండా పనితో కడుపు నిండా కూడుతో ఆనందంగా గడిపేవారు. రానురాను పెట్టుబడులు భారీగా పెరిగాయి. యంత్రాలతో తయారు చేసిన వస్త్రాలు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తుండటంతో నేత బట్టలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు గుదిబండలై కూర్చున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కొరవడటంతో నేత పనిని వదులుకుంటున్నారు. 

ప్రభుత్వ సాయం అందుతలేదు

చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ఇచ్చిన రుణాల్లో సగం ప్రభుత్వం మాఫీ చేసేది. అలాంటి రుణమాఫీని ఎత్తేశారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేయాల్సి ఉంది. కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరి దరికి చేరడం లేదు. ప్రతి కుటుంబానికి 30 కేజీల బియ్యం ఇతర జిల్లాల్లో ఇస్తుండగా ఆదిలాబాద్​ జిల్లాలో మాత్రం ఆ పథకం అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బునకర్ యోజన గూర్చి ఇక్కడి చేనేత కార్మికులకు సమాచారమే లేదు. పదేండ్ల కిందట వీవింగ్ మెషీన్లు ఇచ్చినప్పటికీ వాటి నుంచి దారం తీసే ప్రక్రియ గూర్చి నేత కార్మికులకు శిక్షణ ఇవ్వకపోవడంతో అవి మూలన పడ్డాయి. మెషీన్లు నడిస్తే మూడు రోజుల్లో తీసే దారం ఒకే రోజులో తీయవచ్చని వారంటున్నారు. నిధుల లేమితో కుశ్నపల్లిలో కమ్యూనిటీ భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిపేయడంతో అది నిర్మాణ దశలోనే శిథిలావస్థకు చేరింది. ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న ఆధునిక విధానాలపై శిక్షణ ఇచ్చి, ముడి సరుకు కొనుగోలు సరళతరం చేయాలని నేత కార్మికులు కోరుతున్నారు. ఆర్థిక చేయూతనిస్తూ మార్కెటింగ్ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే మూలనపడ్డ మగ్గాలకు జీవం పోయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టస్సర్ పట్టు చేనేత కార్మికులపై దృష్టి పెట్టాలి.

గిట్టుబాటు కావట్లేదని..

ఇంటిల్లిపాది కష్టపడితే రోజుకు రెండు మీటర్ల వస్త్రం తయారవుతుంది. ఒక్కొక్కరికి రూ.100 కూడా గిట్టుబాటు కావడం లేదు. కూలీపనికి వెళ్లిన వారికంటే తక్కువ డబ్బులు వస్తుండటంతో చేనేతపై ఆసక్తి సన్నగిల్లుతోంది. టస్సర్ వస్త్రం తయారీకి కావల్సిన పట్టుకాయల ధర రెట్టింపయింది. గతంలో రూ.1,200కు వెయ్యి పట్టుకాయలు వచ్చేవి. ప్రస్తుతం వెయ్యి కాయల ధర రూ.2,300కు పెరిగింది. కానీ, టస్సర్ వస్త్రం ధర అప్పట్లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. రూ.700కు మీటర్ ధర పలుకుతోంది. చెన్నూర్ వెళ్లి అక్కడి నుంచి పట్టుకాయలు కొనుగోలు చేయడం, కాయలను ఉడకబెట్టడం, దారం వడకడం, దారాలకు నిలువు పడుగు వేయడం, సరిచేయడం, అచ్చు అతకడం, పేక వేసి మగ్గంపైన సర్దడం లాంటి సుదీర్ఘ ప్రక్రియ వస్త్రం నేయడంలో ఉంటుంది. 15 నుంచి 20 రోజులు అలుపు లేకుండా మగ్గం నడిపితే 12 మీటర్ల వస్త్రం వస్తుంది. అది అమ్మితే వచ్చిన డబ్బులతో బతుకు బండి భారంగా నెట్టుకు రావల్సి వస్తోంది. ఇంత తతంగం కంటే రోజు కూలికి వెళితే నయమని నేతన్నలు భావిస్తున్నారు. నేతలకు చేనేతలు కట్టడం తెలుసుగానీ, వారికి చేయూత నివ్వడం మాత్రం పట్టదు. 
- ఎండీ మునీర్,
సీనియర్​ జర్నలిస్ట్