గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు.. సురక్షిత ప్రాంతాలకు 12వేల మంది తరలింపు

గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు.. సురక్షిత ప్రాంతాలకు 12వేల మంది తరలింపు

గుజరాత్‌ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు వడోదర, భరూచ్‌, నర్మద, దాహోద్‌, పంచమహల్‌, ఆనంద్‌, గాంధీనగర్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 12 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా చోట్ల వరద నీటిలో చిక్కుకుపోయిన 270 మందిని సహాయక బృందాలు రక్షించాయి. 

భారీ వర్షాలు, ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు కూలిపోయాయి. కూలిన చెట్లను తొలగించే పనులు వేగవంతం చేశారు. గత రెండు రోజుల్లో భరూచ్‌ జిల్లాలో నర్మదా నదీ తీరం వెంట నివసిస్తున్న సుమారు ఆరు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సర్దార్‌ సరోవర్‌ జలాశయంలో నీటిమట్టం 40 అడుగులకు చేరింది. 

భారీ వర్షాల కారణంగా నర్మదా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోల్డెన్‌ బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరిగింది. గోల్డెన్‌ బ్రిడ్జి నీటి మట్టం 28 అడుగులు.. ఇప్పుడు 37.72 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. సర్దార్‌ సరోవర్ జలాశయం నుంచి అత్యధిక స్థాయిలో నీరు విడుదల కావడంతో ఆదివారం (సెప్టెంబర్ 17న) ఇక్కడ నీటిమట్టం 40 అడుగులకు చేరింది. దీంతో దాండియా బజార్‌, భరూచ్‌, అంకలేశ్వర్ నగరంలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. 

గుజరాత్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తక్షణ సహాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌లతో 10 బృందాలను సిద్ధంగా ఉంచారు. వడోదర జిల్లాలో ఓ చిన్న ద్వీపంలో చిక్కుకుపోయిన 12 మందిని 48 గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆర్మీ రక్షించింది.