
ఫ్రీ స్టయిల్ లిబ్రే
ఇందులో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి. వాటిలో రీడర్ ఒకసారి కొంటే జీవితాంతం ఉపయోగించుకోవచ్చు. సెన్సార్ మాత్రం మారుస్తూ ఉండాలి. ఈ డివైజ్ కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్, బ్లడ్ గ్లూకోజ్ టెస్టర్, బ్లడ్ కీటోన్ టెస్టర్.. ఇలా మొత్తం మూడు రకాలుగా పనిచేస్తుంది. రీడర్‌లో స్కాన్ చేసిన ప్రతిసారి గ్లూకోజ్ లెవల్ రికార్డు అవుతుంది. గత 8 గంటల్లో గ్లూకోజ్ పెరిగిందా? తగ్గిందా? లేదా స్థిరంగా ఉందా? అని చెప్పే గ్రాఫ్ కనిపిస్తుంది. 90 రోజుల గ్లూకోజ్ డేటాను సేవ్ చేసుకుంటుంది. కొంచెం కూడా నొప్పి లేకుండా ఒక సెకను స్కాన్‌తో గ్లూకోజ్ లెవల్ని చూపిస్తుంది. ముందుగా డిస్పోజబుల్ అప్లికేటర్ వాడి సెన్సర్‌ని బాడీకి అతికించాలి. తర్వాత దాన్ని రీడర్‌తో స్కాన్ చేయాలి. రీడర్ని సెన్సర్‌కు ఒక సెం.మీ. నుంచి నాలుగు సెం.మీ. లోపు ఉంచితే డేటాను క్యాప్చర్ చేస్తుంది. సెన్సర్‌ని చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. దీన్ని ప్రతి 14 రోజులకు ఒకసారి మార్చాలి. ఇది వాటర్ ఫ్రూఫ్. స్నానం చేసేటప్పుడు, ఈత కొట్టేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు తీయాల్సిన అవసరం లేదు. మూడు మీటర్ల లోతు వరకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది.
కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్లు
కొంతమందికి ప్రతి రోజూ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరైతే రోజులో మూడు నాలుగు సార్లు చేసుకుంటారు. అందుకోసం రోజూ సూది గుచ్చాల్సిందే. అలాంటి వాళ్ల కోసం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్లు(సీజీఎం) మార్కెట్లోకి వచ్చాయి. ఇవి చిన్న సెన్సర్ సాయంతో పనిచేస్తాయి. ఇది ప్రతి కొన్ని నిమిషాలకు కణాల మధ్య ఫ్లూయిడ్‌లో గ్లూకోజ్‌ని కొలుస్తుంటుంది. అంతేకాదు.. ఆ డాటాని దాని మెయిన్ డివైజ్‌కు లేదా స్మార్ట్‌ఫోన్‌కు వైర్‌లెస్‌గా ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది. ఈ సీజీఎంలు వచ్చాక టెస్ట్ చేయాల్సిన ప్రతిసారి రక్తం తీయాల్సిన బాధలు చాలా వరకు తగ్గాయి. కానీ.. ఇవి గ్లూకోజ్ మీటర్లలా కాకుండా సెట్ చేసుకున్న టైంకి ఒక్క చుక్క బ్లడ్ అవసరం లేకుండా గ్లూకోజ్ లెవల్స్‌ని చెక్ చేస్తాయి. సెట్ చేసిన టైంలో కూడా గ్లూకోజ్ లెవల్స్‌ని రికార్డ్ చేస్తాయి. అంతేకాదు.. గ్లూకోజ్ లెవల్స్ చాలా తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అలర్ట్ చేస్తాయి.1999లోనే మొదటి సీజీఎం వచ్చింది. అయితే.. అప్పట్లో డాక్టర్లు ఈ డివైజ్‌ని పేషెంట్లకు ఇచ్చేవాళ్లు. మళ్లీ రెండు వారాలకు తిరిగి తీసుకునేవాళ్లు. ఈ రెండు వారాల డాటాతో పేషెంట్ పరిస్థితిని అంచనా వేసేవాళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకు అందరూ వాడడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఇంట్లో కూడా వాడే విధంగా అప్‌గ్రేడ్ చేసి, మార్కెట్లోకి తెచ్చారు. ఈ డివైజ్‌లు షుగర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడంలో డాక్టర్లకు బాగా ఉపయోగపడుతున్నాయి.
ఇన్సులిన్ పెన్
ఇన్సులిన్ని రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన అవసరం లేనివాళ్లు ఎక్కువగా సిరంజ్‌లు వాడుతుంటారు. ఎక్కువసార్లు తీసుకోవాల్సి ఉంటే.. ఇన్సులిన్ ఇంజెక్షన్ పెన్ని వాడతారు. మామూలు ఇంజక్షన్‌తో పోలిస్తే.. దీంతో ఇన్సులిన్ వేసుకోవడం ఈజీ. మార్కెట్లో చాలా కంపెనీలు ఇలాంటి పెన్స్ తెచ్చాయి. వీటిని వాడడం వల్ల ఇంజెక్షన్‌తో పోలిస్తే.. చర్మంపై చాలా చిన్న గుంత పడతాయి. అమిలోయిడోసిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.